బకాయిలు చెల్లించండి..

by Ravi |   ( Updated:2024-02-02 00:45:26.0  )
బకాయిలు చెల్లించండి..
X

నీళ్లు, నిధులు, నియామకాల కోసం దాదాపు 1200 వందల మంది ప్రాణ త్యాగాలు చేసి కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు పర్యాయాలు విద్యార్థులను, విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదు. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య హామీనిచ్చినా.. అమలుకు మాత్రం నోచుకోలేదు. పైగా విద్యారంగానికి నిధులు, నియామకాల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో.. విద్యా వ్యవస్థ ఛిన్నాబిన్నం అయింది. దాదాపుగా 5,300 కోట్ల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్ విడుదల కాక పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉండి.. ఉన్నత విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్‌డీ వరకు గత ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు తమ కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి అప్పుల పాలు కావాల్సి వచ్చింది.

రాష్ట్రంలో దాదాపు 6.20 లక్షల మంది కొత్తగా ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ధరఖాస్తు చేసుకుంటారు. మరో 8.10 లక్షల మంది రెన్యూవల్ చేసుకుంటారు. వీరికి ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి రూ.3000 కోట్లను మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వం 2022-2023 విద్యా సంవత్సరానికి ఒక్క పైసా విడుదల చేయలేదు. పైగా పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గత రెండేళ్ళుగా ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాల యజమాన్యాలు విద్యార్థులను సొంతంగా ఫీజు చెల్లించమని బలవంతం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని విద్యార్థుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అందుకే కొత్త ప్రభుత్వమైనా విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకొని ఫీజుల పాత బకాయిలు విడుదల చేయాలని ఏబీవీపీ కోరుతోంది.

- సిలివేరు అశోక్

ఏబీవీపీ, ఓయూ అధ్యక్షుడు

77806 81801

Advertisement

Next Story