- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హస్తాన్ని దెబ్బకొట్టిన ఆప్
హర్యానాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ము లాటలు, పదవీ లాలస కాంగ్రెస్‌ను అనూహ్యంగా దెబ్బతీశాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదరకపోవటం ఉభయ భ్రష్టత్వం కలిగించింది. ఆప్ ఒక్క సీటు కూడా సాధించలేక పోయింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోవడానికి ఆప్ కారణమైంది. పదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కన్న కలలు... కల్లలయ్యాయి. ఆ పార్టీకి గెలపునకు దోహదపడగల రైతులలో ప్రభుత్వ వ్యతిరేకతను, రెజ్లర్ల పోరాటాన్నీ, 10 ఏళ్ల బీజేపీ పాలనపై ఉండే తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను తన విజయంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఈసారి గెలుపు ఖాయం అనుకున్న చోటే వ్యూహాత్మక తప్పిదాల వల్ల కాంగ్రెస్ మళ్లీ తలవంచింది. ఈ ఓటమి అటు కాంగ్రెస్‌కి, ఇటు ఆప్‌కి కూడా గుణపాఠమై నిలిచింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదట్లో కాంగ్రెస్ అనుకూలంగా ఫలితాల సరళి కనిపించింది దీంతో సంబరపడిన కాంగ్రెస్ కార్యకర్తలు జిలేబీలు పంచుకున్నారు. కానీ కాంగ్రెస్ సంబరాలపై నీళ్లు చల్లుతూ బీజేపీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకుని విజయ బావుటా ఎగిరేసింది. 90 సీట్లకు గాను బీజేపీ 48 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 35 సీట్లకే పరిమితమైంది. స్వతంత్రులు ముగ్గురు, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) నుంచి ఇద్దరు విజయం సాధించారు. కాగా ఆప్ ఎన్నికల సభల్లో కోతలు కోసినా ఖాతా తెరవలేదు. 2022 ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుంటే, ఈసారి 7 స్థానాలను అదనంగా పెంచుకొని తన సత్తా చాటింది. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలవగా ఈసారి మరో 9 స్థానాలు ఎక్కువ వచ్చాయి.
ఎగ్జిట్ పోల్ అంచనాలు మళ్లీ రివర్స్!
మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా సీట్లను పొంది ఒంటరిగా ఘనవిజయం సాధించి, అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనాలు వేశాయి. అలాగే ఈ సారి కూడా ఈ పేరు మోసిన సంస్థలే చేసిన ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు 50 నుంచి 70 సీట్లు రావచ్చని కూడా జోస్యం చెప్పాయి. కానీ, అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచ నాలు తలకిందులు చేస్తూ బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు శాస్త్రీయంగా జరగాలి. ఉగాది పురాణ శ్రవణంలో రాశి ఫలితాలు తమకు ఆతిథ్యం, అవకాశం ఇచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా జోస్యం చెప్పినట్లు ఉండకూడదు. ప్రజలు కూడా వాటి ఊహల అంచనాలపై భ్రమలు తొలగించుకుంటే మంచిది.
ఇండియా కూటమి విజయదుందుభి
దశాబ్దకాలం తర్వాత జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి ఘనవిజయం చేకూర్చారు. మొత్తం 90 స్థానాల్లో 49 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంది. త్వరలో మరోసారి ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా సీఎంగా అధికారాన్ని చేపట్టనున్నారు. ఈ సారి బీజేపీ ఏ పార్టీతో పొత్తులు లేకుండా మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావిం చింది. కానీ ఈ సారి కేవలం 29 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలను కైవసం చేసుకుని ఘనంగా తన సత్తా చాటుకుంది.
కాంగ్రెస్‌కు కష్టకాలం..
అయితే ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్‌కు మాత్రం చేదు అనుభవాలే మిగిలాయి. ఆ పార్టీ కేవలం 6 సీట్లనే గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు ఉన్నప్పటికీ కేవలం ఆరు స్థానాలే గెలుచుకోవటం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. అలాగే 2014లో బీజేపీతో కలిసి అధికారాన్ని చేపట్టిన పీడీపీ ఈసారి దారుణ పరాభవాన్ని చవిచూసింది. పోయినసారి 28 సీట్లు గెలిచిన ఆ పార్టీకి ఇప్పుడు కేవలం 3 స్థానాలే దక్కాయి. ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకోగలిగింది. స్వతంత్ర అభ్యర్ధులూ, వేర్పాటువాద శక్తులకు అనుకూల నాయకులు కూడా పెద్దగా ఈ ఎన్నికల్లో తమ ప్రభావం చూపలేకపోయారు. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఒకే ఒక సీటు గెలుచుకొని తన ఉనికిని చాటింది.
బీజేపీ గెలుపు జమ్మూకే పరిమితం!
జమ్మూ కశ్మీర్‌లో తన సంక్షేమ పథకాల ద్వారా అధికారం చేపట్టాలని పెద్దఎత్తున అనేక ఎత్తుగడలు వేసి ప్రయత్నించినప్పటికీ ఓటర్లు చైతన్యంతో ఓటు వేసి బీజేపీని ప్రతిపక్షానికే పరిమితం చేశారు. ఆ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసి కేవలం 29 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. 2014లో బీజేపీ 25 సీట్లు గెలిచింది. ఇప్పుడు మరో 4 సీట్లు అదనంగా గెలుచుకోగలిగింది. అయితే ఈ గెలుపు కూడా కేవలం జమ్మూ ప్రాంతానికే పరిమితమైంది. బీజేపీ గెలిచిన 29 స్థానాలు కూడా ఇక్కడ గెలుచుకున్నవే కావడం గమనార్హం. ఇక కశ్మీర్ లోయలో బీజేపీ ఒక సీటును కూడా గెలుచుకోలేకపోయింది. కాశ్మీర్ ప్రాంతంలో 20 మందికి పైగా బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తే వారు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496