బీసీలకు రాజకీయ పార్టీ అనివార్యమే!

by Ravi |   ( Updated:2024-10-08 01:00:52.0  )
బీసీలకు రాజకీయ పార్టీ అనివార్యమే!
X

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ వచ్చే అవకాశం ఉంది. అది కూడా బీసీల కోసమే ప్రత్యేకంగా పార్టీ అంటూ చెబుతూ ఉండడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని సమస్యల కంటే బీసీల రాజకీయ చర్చ రాజకీయ వర్గాలలో వాడివేడిగా జరుగుతున్నది. బీసీ సంఘాలు, బీసీ మేధావుల వేదికలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలలో, సదస్సులలో బహిరంగంగానే రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి బలంగా నొక్కి వక్కాణిస్తున్నారు.

బీసీలను ఈ దేశంలో ఎన్నో పార్టీలు వాడుకున్నాయి, బీసీల భవిష్యత్తుతో ఆడుకున్నాయి. బీసీల గళాన్ని వినిపించడానికి ప్రత్యేకంగా తెలంగాణలో ఒక పార్టీ అంటూ ఉండడం కీలకమైన అడుగే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఎన్నో పార్టీలలో బీసీలకు ప్రత్యేకంగా కొన్ని విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలలో ఎంతో మంది గొప్ప గొప్ప బీసీ నాయకులు ఉన్నారు. వారంతా ఈ కొత్త బీసీ పార్టీ లోకి అడుగు పెట్టగలరా? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం.

బీసీలందరూ కలిస్తే..

తెలంగాణ రాష్ట్రంలో బీసీలు దాదాపు 66 శాతం ఉన్నారు. పలు రాష్ట్రాల్లో అధికారానికి సంబంధించిన విజయావకాశాలను కేవలం 40 శాతం ఓటర్లు మాత్రమే డిసైడ్ చేస్తున్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు అందరూ కలిస్తే మాత్రం బీసీ పార్టీకి అద్భుతమైన అవకాశం ఉంటుంది. అయితే బీసీ ఓటర్లు అందరూ కొత్తగా పెట్టే పార్టీనే నమ్ముతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కులగణన చేస్తామని, మంచి చేస్తామని ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గ ప్రణాళికలను కూడా రచిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ పార్టీని తెలంగాణలో తీసుకుని రావడం కూడా ఒక సాహసమనే చెప్పాలి. త్వరలో జరగనున్న గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది చివర్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీసీ ఓటర్లు చాలా కీలకంగా మారనున్నారు. అయితే బీసీలకు మంచి చేస్తున్నాం, మా పార్టీ తెలంగాణ చీఫ్ కూడా బీసీ అంటూ కాంగ్రెస్ పార్టీ బల్లగుద్ది చెబుతోంది. కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని కొత్తగా ఎన్నికైన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కూడా అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కొత్తగా బీసీలకు ప్రత్యేకమైన పార్టీ రావడం కాస్త రిస్కీ అనే చెప్పొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లోని బీసీ నేతలకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. కొత్త పార్టీ స్థాపిస్తే క్రౌడ్ పుల్లర్స్ లాంటి నేతలు బీసీ పార్టీలో భాగమవుతారా? అన్నది కూడా ఆలోచించాలి.

అలా అనడం కరెక్ట్ కాదేమో..?

బీసీ పార్టీని స్థాపిస్తే కేవలం బీసీ ఓట్లే మనకు చాలు అనే ధోరణి కూడా వీడాలి. ఇతర అన్ని సామాజిక వర్గాలలో ఎంతో మంది పేదలు ఉన్నారు. వారికి కూడా అండగా ఉంటామనే చెప్పాలి. వారందరూ కూడా ఓ పార్టీకి ఎంతో ముఖ్యమనే విషయాన్ని తప్పక గుర్తించాలి. బీసీ ఓట్లు మాత్రమే చాలు అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసే నాయకుల విషయంలో కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఓ పార్టీ పెట్టాక అధికారంలోకి వెళ్లాలన్నా, పాలన సాగించాలన్నా అన్ని విషయాల్లో కలుపుకుంటూ వెళ్ళాలి. కొందరికే ప్రభుత్వం, ఆ పార్టీ ఆ వర్గాల కోసమే అనే వదంతులు వ్యాప్తి జరగకుండా కూడా చూసుకోవాలి. బీసీ పార్టీలో మైనారిటీలకు కూడా చోటు ఇవ్వాలి. పార్టీ పెట్టామంటే ప్రతి ఒక్క బలహీన వర్గానికి అండగా నిలబడ్డామనే భరోసాను ఇవ్వాలి.

సాహసోపేతమైన నిర్ణయం

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మరో నాలుగు సంవత్సరాల రాజ్యసభ పదవీ కాలాన్ని వదులుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది అయినప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బీసీల రాజ్యాధికార సాధన దిశగా కృషి చేస్తానని ప్రకటించడం జరిగింది. బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా చర్చోపచర్చలు మేధావులతో ఇప్పటికే ఆయన నిరంతరం కొనసాగిస్తున్నారు. బీసీ సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందిన డాక్టర్ వకుళా భరణం కృష్ణమోహన్ రావు సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాగా ఆయన కొంతకాలంగా తటస్థంగా ఉంటున్నారు. కృష్ణయ్య చర్చల్లో భాగంగా బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు సమ్మయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ మేధావులు ప్రొఫెసర్ మురళి మనోహర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్, వివిధ కుల సంఘాలలో బలమైన నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశలో ప్రయత్నాలలో భాగంగా... బీసీలను ఐక్యం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తానని, బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి కూడా వస్తోందని చెప్పారు. ఆయన వ్యాఖ్యల కారణంగా కూడా తెలంగాణలో బీసీ పార్టీ విషయంలో సరికొత్త జోష్ నెలకొంది.

పోరాటానికి సిద్ధం కావాల్సిందేనా?

బీసీలందరూ ఏకతాటిపై నిలబడి జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల పెంపు కోసం తెగించి పోరాడాల్సిన సమయం వచ్చిందని బీసీ నేతలు చెబుతూనే వస్తున్నారు. అఖిలపక్ష బీసీ కులసంఘాల రాష్ట్ర సదస్సులో కూడా ఈ విషయాలపై చర్చించారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచినా, ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటారనే ఆవేదనను కూడా వ్యక్తం చేశారు బీసీ నేతలు. కాబట్టి బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించి రాజ్యాంగ సవరణ చేస్తేనే శాశ్వతంగా లాభం ఉంటుందని గుర్తించాలి. తెలంగాణకు బీసీ సీఎం రావాల్సిన ఆవశ్యకతపై కూడా పలువురు తమ తమ అభిప్రాయలు చెబుతూ ఉన్నారు. వాటి గురించి కూడా బీసీలు ఆలోచించాల్సి ఉంటుంది.

ఈ ప్రయత్నాలు కొనసాగితే..

ఈ ఉద్యమం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అవ్వకూడదు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలలో మార్పు రావాల్సి ఉంటుంది. జనాభాలో దాదాపు సగం మంది బీసీలు ఉన్నందున ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలంటూ దీర్ఘకాలంగా ప్రధాని నరేంద్ర మోడీని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కేంద్రంలోని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీసీ ఓటు బ్యాంకు, జనాభాను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి, సంక్షేమంలో మాత్రమే కాక రాజకీయపరంగానూ న్యాయమైన వాటా దక్కాలని బీసీ సంఘాలు కోరుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నా , బీసీల రాజకీయ పార్టీ చర్చ బలంగా వినిపిస్తున్నది, ఏనాడు కనీ వినీ ఎరగని రీతిలో చర్చలు జరుగుతున్నాయి.. నిజంగా ఈ వర్గాల ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగితే రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితుల కారణంగా కొత్తగా బీసీ రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడం తథ్యం అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు

99599 12341

Advertisement

Next Story