ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాధ్యాయం!

by Ravi |   ( Updated:2024-06-12 01:00:34.0  )
ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాధ్యాయం!
X

గత పదేళ్లలో రెండు సార్లు అఖండ మెజారిటీ సమకూర్చి పెట్టినప్పటికీ ప్రధాన ప్రజా సమస్యలను గాలికొదిలేసి, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పని చేసిన బీజేపీకి భారత ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. మోడీ అనేక ఆకర్షణీయ వాగ్దానాలు చేసినా ఆచరణలో ఆయన మాటల్లో నిజాయితీ లేకపోవడంతో ఈ దేశ ప్రజలు ఆయన మాటలు నమ్మలేదు.

తమ పార్టీ విధాన లోపాలను పార్లమెంటులోనూ, బయటా విమర్శలు చేసి ప్రజా సమస్యలను ప్రస్తావించినందుకు విపక్ష పార్టీ నేతలపై కక్షకట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థల స్థాయికి దిగజార్చి దుర్వినియోగం చేసి వాటితో దాడులు చేయించడం, బెదిరించి లొంగదీసుకోవటాన్ని ప్రజలు తిరస్కరించారు. బీజేపీ ఇకనైనా తన వైఖరి మార్చుకోకుంటే ఫలితాలు ఇంకా దారుణంగా మారతాయి.

సంకీర్ణ ప్రభుత్వం కోసం వెంపర్లాడేలా..

కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారానికి అవసరమైన మెజారిటీ సీట్లు గెలిచినా గతంలో సొంతంగా సాధించిన మెజార్టీని మాత్రం కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. దేశంలో అత్యధిక లోక్‌సభ సీట్లు కలిగిన యూపీలో బీజేపీకి ఈసారి ఓటర్లు చేదు అనుభవాలనే మిగిల్చారు. గతంలో మొత్తం 80 నియోజకవర్గాలకు గానూ 2014 లో 71 స్థానాలు, 2019లో 62 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 74 స్థానాలకు పోటీ చేసి కేవలం 33 స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌తో జతకట్టి బీజేపీ సీట్లకు భారీగా గండి కొట్టింది.

మోడీ పార్లమెంటులోనూ, బహిరంగ సభల్లోనూ అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ ఈ సారి 400 సీట్లు దాటుతాం అని చాలా ధీమాగా పలికిన మాటలను ప్రజలు పట్టించుకోలేదు. మతతత్వ, నిరంకుశ మోడీ అండ్‌ కోకు భారత ఓటర్లు కీలెరిగి వాత పెట్టారు. ఉన్న మెజార్టీని కూడా ఊడబెరికి, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రుల మద్దతు కోసం వెంపర్లాడేలా చేశారు. బీజేపీకి గుండెకాయ లాంటి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి కోలుకోలేని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయోధ్య రాముని పేరుతో బీజేపీ ఆడుతున్న రాజకీయాన్ని అయోధ్య ప్రజలే ఛీత్కరించి గట్టిగా బుద్ధి చెప్పారు. మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు పెరగడం లౌకిక పార్టీలకు, లౌకిక వాదులకు ప్రమాద సూచికగా భావించాలి.

చావు తప్పి కన్ను లొట్ట‌బోయినట్లు...

గత లోక్‌సభలో సొంతంగా 303 స్థానాలు కలిగిన బీజేపీ ఈ సారి 241 వద్దే ఆగిపోయింది. 2019లో ఎన్డీయే కూటమికి 353 సీట్లు లభిస్తే ఈ సారి 293 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్డీఏ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం రెండు కూడా తగ్గాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో ముందుకొచ్చిన ‘ఇండియా కూటమి’ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్షాల బలం గతంలో కన్నా ఈసారి స్వల్పంగా మెరుగుపడింది. మొత్తం మీద ఈ తీర్పు మతోన్మాద, నిరంకుశ పార్టీలకు ఒక హెచ్చరిక అనే చెప్పాలి.

దేశాన్ని రక్షించేది సంకీర్ణమే!

ఇండియాలో ప్రధాన మీడియా అదానీ చేతుల్లో బందీ అయింది. మోడీనీ ప్రశ్నించే దమ్మున్న ఛానల్ ఒక్కటీ లేదు. ఉంటే అక్రమ ఈడీ, సీబీఐ దాడులే. జైళ్లలో అక్రమ కేసులతో నిర్బంధించటమే. ఇదే మోడీ పదేళ్ళ పాలనా సారం. ఒక్క రవీష్ కుమార్. ధ్రువ్ రాఠీ మొదలైన స్వతంత్ర యూట్యూబర్లు తమ వీడియోలతో సంచలనం సృష్టించారు. మోడీ నియంతృత్వ వైఖరిని తమ పదునైన మాటలతో దుయ్యబట్టారు. వారి ప్రభావం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై పడింది. కాగా స్వప్రయోజనాలు ఆశించి అమ్ముడు పోయిన కొన్ని మీడియా సంస్థలు ఫేక్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. దాదాపు డజన్ సంస్థలు ఎన్డీఏకు 350కి పైగా సీట్లు వస్తాయనీ నమ్మబలికాయి. మోదీ చెప్పినట్లుగా 400 సీట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని బాకా కొట్టాయి. బీజేపీ గతంలో సాధించిన 303 సీట్లను తిరిగి సాధిస్తుందని ప్రశాంత్ కిశోర్ బల్ల గుద్ది మరీ అనేక టివి ఛానళ్లలో బలంగా వాదించాడు. ఇప్పుడు బీజేపీ చరిత్ర తిరగబడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంపై ఆధారపడే పరిస్థితి మోదీ పాలనలో బీజేపీకి వచ్చింది.

పార్టీలకు తగిన గుణపాఠం..

భారత ఓటర్లలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ ఉండవచ్చు. కానీ ప్రతీ ఎన్నికల్లో వారు తమ విజ్ఞత ప్రదర్శించారు. ఎప్పుడు ఎవరికి ఎలా జవాబు చెప్పాలో వారికి బాగా తెలుసు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెను ఘోరంగా ఓడించారు. జనతా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కేసీఆర్, జగన్, మోడీలకు ఈ ఎన్నికల్లో తగిన రీతిన గుణపాఠం చెప్పారు. నియంత పాలనకు చరమగీతం పాడారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఫలితాలను సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story