నిస్తేజకరమైన మధ్యంతర బడ్జెట్

by Ravi |   ( Updated:2024-02-04 00:45:50.0  )
నిస్తేజకరమైన మధ్యంతర బడ్జెట్
X

మొత్తం మీద ఈ మధ్యంతర బడ్జెట్ తాయిలాలకు దూరంగా ఉంది. కొత్త పథకాలు ఏవీ లేవు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. పన్నుల్లో తగ్గింపు శూన్యం. పీఎం కిసాన్ సాయంలో పెంపుదల లేదు. ధరల తగ్గింపు ఊసు లేదు. గత దశాబ్ధిలో సాధించిన ప్రగతిపై గొప్పల దండోరా వినిపించింది. వికసిత్ భారత్ భజన కొనసాగింది.

ఎన్నికల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో పెద్దగా విశేషాలు ఉండే అవకాశం తక్కువ. ఓట్ ఆన్ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకోవటం కూడా వృధా. గురువారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మెరుపులు కనిపించక పోవటానికి కారణం ఇదే. వరసగా 6 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీతారామన్, ఈసారి కేవలం 58 నిముషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రతికూల అంశాలు..

మొత్తం బడ్జెట్ 47.65 లక్షల కోట్లు కాగా, యూరియాపై సబ్సిడీ తగ్గించడం రైతులకు నిరాశ కలిగించే విషయం. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం గత ఏడాది 2,12,332 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 3.33శాతం తక్కువగా 2,05,250 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీని 2.6 శాతం అంటే 11.925 కోట్లు తగ్గించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ద్వారా ఏటా పెట్టుబడి సాయం అందించడం మంచిదే కానీ, సబ్సిడీ తగ్గింపు ప్రభావం వ్యవసాయ రంగంపై గణనీయంగా పడింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేదు. పీ.యం. కిసాన్ యోజన నిధులను పెంచలేదు. డీజిల్‌పై 50 శాతం సబ్సిడీ, మద్దతు ధరల చట్టం ప్రస్థావన తీసుకు రాలేదు. విద్యుత్ సవరణ బిల్లు రద్ధు మొదలైన అంశాలపై బడ్జెట్‌లో ప్రస్తావించ లేదు.

ఉన్నత విద్యపై భారీగా కోతలు

ఈ బడ్జెట్‌లో విద్య, వైద్యం, ఉపాది కల్పనకు నిర్ధిష్ట చర్యలను ఏమీ సూచించ లేదు. యూజీసీతో సహా ఐఐటీ, ఐఐఎంలకు నిధులలో కేంద్రం గణనీయంగా కోతలు విధించింది. యూజీసీకి గతం కంటే 60 శాతం కోత విధించారు. ఐఐఎంకు గత ఏడాది ఇచ్చిన 608.23 కోట్ల నుండి 331 కోట్లకు గణనీయంగా కోత విధించింది. ఉన్నత విద్యకు రూ. 57244.48 కోట్లనుండి 47619.77 కోట్లకు తగ్గించారు. దీనితో ఉన్నత విద్యలో బోధన, పరిశోధన గణనీయంగా దెబ్బతింటుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా మన విశ్వవిద్యాలయాల ప్రతిష్ట అన్ని విధాలుగా దిగజారింది.

పేదరికం తగ్గిందట...

దేశ కార్మికరంగ సంక్షేమం గురించి ఈ బడ్జెట్ మౌనం పాటించింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి ప్రణాళికను ప్రస్తావించలేదు. పన్నుల వ్యవహారంలో కార్పోరేట్ రంగానికి పెద్దపీట వేశారు. కార్పోరేట్ పన్నును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15 శాతానికి తగ్గించారు. పన్ను చెల్లింపుదారులకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. మహిళలు, యువత, రైతుల అభివృద్ధికి ఈ బడ్జెట్లో నిధులు ఏమీ కేటాయించ లేదు. పైగా దేశంలో పేదరికం తగ్గింది అని ఆర్థికమంత్రి అన్నారు. అదే నిజమైతే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేయవలసిన అవసరం ఎందుకుంటుందో వివరించలేదు.

తెలంగాణకు మళ్లీ మొండిచెయ్యి

గతంలో ప్రధాని మోదీ 60 నెలలు సమయం ఇవ్వండి అద్భుతాలు చేసి చూపిస్తా అన్నారు. 120 నెలలు గడిచినా సాధించిన ప్రగతేమిటో బహుశా నిర్మలా సీతారామన్‌కు అర్ధంకాలేదేమో. ఎలాంటి మెరుపులు చూపించలేక పోయారు. దేశంలో గత 6 ఏళ్ళలో 82 లక్షల కోట్ల రుణ భారం పెరిగింది. ఇదో రికార్డు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చటంలో బీజేపీ ప్రభుత్వంతో ఎవరూ పోటీ పడలేరు. పైగా ఇదే విషయంలో రాష్ట్రాలను నిందించటంలో మాత్రం దిట్ట. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేనేలేదు. రైల్వేకు కేవలం 5,071 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్‌కు తెలంగాణ కంటే 4,067 కోట్లు అధనంగా కేటాయించి వివక్ష చూపారు.

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed