73 ఏళ్ల చరిత్ర కానీ.. ఓటుగానే మిగిలిపోయాను!

by Ravi |   ( Updated:2024-05-12 01:16:09.0  )
73 ఏళ్ల చరిత్ర కానీ.. ఓటుగానే మిగిలిపోయాను!
X

ఓటుది 73 సంవత్సరాల ఎన్నికల యాత్ర. 1951 నుంచి 2024 వరకు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి చాటుమాటు ముచ్చట్లు లేకుండా స్వచ్ఛందంగా పాల్గొంటున్న ఓటును నేను. ప్రతి ఎన్నికల్లో నా జీవగంజితో ప్రాణం పోసుకున్నవారు సూటు బూటు వేసుకొని కాలు మీదే కాలు వేసుకుని కూర్చుంటే, నేను బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎం వరకు రహస్యంగా పరదా చాటుకు వెళ్లిపోతుంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. చెప్పద్దు కానీ చెప్పక తప్పడం లేదు. ఒట్టు.. నేను ఓటుగానే మిగిలిపోయాను. ఎన్నికలలో ఇల్లిల్లూ, ఊరూరు, దేశమంతా కాళ్లు అరిగేలా తిరిగే ఎలక్షన్ రథానికి ప్రమాదం జరగకుండా చూసే స్పీడ్ బ్రేకర్‌ను. నామ్ నిషాన్‌కి ఉన్నానంటే ఉన్నా, తిన్నానంటే తిన్నా, పన్ననంటే పన్నా మొత్తానికి నా కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒక్క మాట చెప్పాలంటే కడుపు చించుకుంటే నా కాళ్ళ మీద పడుతుంది.

ప్రజాస్వామ్యం అనే వృక్షానికి తల్లి వేరు ఓటరు. ప్రజల యొక్క ప్రజల కొరకు ప్రజల చేత నిర్వచనం నోరూరిస్తూ ఉంది. కానీ అసలు ఆచరణ మొత్తం దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు తరీక అస్తవ్యస్తం. ఒకప్పటి ప్రజా సేవలు, వ్యక్తిత్వ విలువలు, నైతికత రుజువర్తన రాజకీయ నాయకులలో టార్చ్ లైట్ పెట్టి వెతికినా మచ్చుకు కనిపించవు. అంతా పైసా పేకో తమాషా దేఖో. మెల్లమెల్లగా శాసనసభలలో వందలాది కోట్ల సంపద కూడబెట్టిన నాయకులు ప్రవేశిస్తున్నారు. ప్రజలకు అనుకూలమైన చట్టాలు జరుగుతున్నాయా అనుకుంటే ఎండమావుల్లో నీళ్లను వెతుకుతున్నట్టుగానే ఉంటుంది. ఇకపోతే ప్రజాస్వామ్యం మూల స్తంభాలైన నాలుగు విభాగాలు రోలు పోయి మద్దెలతో చెప్పుకున్నట్టు ఉంది. రాజ్యం కన్ను తెరిస్తేనే లుకలుక లాడుతున్నాయి. నా తర్బీయత్ గురించి ఏమని చెప్పాలి. వేదనను వేరొకరితో పంచుకోరాదు, కడుపులో ఉంచుకోరాదు.

అంతా దాగుడుమూతల ఆట

ఓటుని నేను ప్రాంసరీ నోటును కాదు... రకరకాల రూపాలను మార్చుకునే రూపాయి నోటును నేను. తెల్లారి లేస్తే చేతిలో లేకుంటే ఒక్క పూట గడవదు. జేబులో ఉంటే అస్సలు కాలు నిలవదు. ఎన్నికలు వస్తే చాలు నా పాత్ర మిక్కిలి కీలకంగా చేతులు మారిపోతుంది. కార్యకర్తకు నేనే ఆధారం. రాజకీయ గాలిపటానికి నేనే దారం. ఇచ్చే నాయకునికి తెలుసు ఓటు వట్టిగా వేయరని, తీసుకునే ఓటరుకు తెలుసు నాయకుడు వట్టిగా ఇయ్యడం లేదని. దొంగకు దొర ఎవరో తెలుసు. దొరకు దొంగ ఎవడో తెలుసు. అంతా దాగుడుమూతల ఆట. రానురాను రాజు గుర్రం గాడిద అయినట్టు లాభం గువ్వలకు వచ్చినట్టు నా విలువ రోజుకింత పతనం అయిపోతుంది. ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ ఒక్కసారి తగిలినట్టు అయితది. ఎన్నికలకు రోట్లో తలపెట్టినాక దెబ్బలకు తప్పవు కదా!

బహు రూపిని నేను...

నాయకుడు ఎట్లయినా పర్వాలేదు లంగగానో లఫంగగానో సంపాదించింది కాపాడుకోవడానికి ఇంకా తరతరాలకు తరగని సంపదను పోగు చేసుకోవడానికి భగవంతుని అవతారాల లాగే, సైనికునికి దుంక బుద్ధి, గుర్రానికి ఎత్తేయ బుద్ధి ఏకకాలంలో అయినట్టు నేను రాజకీయ బహు రూపుల అవతారం ఎత్తాను. చెప్పని మాట చెప్పొద్దు ఇచ్చిన మాట ఇవ్వవద్దు అరచేతిలో ప్రజలకు వైకుంఠం చూపెట్టాలి. ఓటరు కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీయాలి. అవసరం ఉన్నా లేకున్నా ఒక అడుగు ముందుకు వేసి చర్మం ఒలిచి చెప్పులు కుట్టేయాలె. మాటలతో నరకాలి. పుడీలు కొట్టాలె. ఒడ్డు ఎక్కే వరకు కాళ్లు పట్టుకోవాలి కడుపులో తల పెట్టాలి. కోతి ఆటలు ఆడాలి. నక్క పాటలు పాడాలి. ఊసరవెల్లి లెక్క మారాలి. పిల్లి లెక్క కళ్ళు మూసుకొని పాలు తాగాలి. గెలిచినంక వాడు ఎప్పటి లెక్క. నేను కుర్చీలో కాలు మీద కాలు రాజులెక్క. భూపాళం పాటలు పాడాలి. శాసనసభ ఒరలో సామాన్యుడు తండ్లాడుతూ శ్రీమంతుడు సంబురపడుతూ సర్దుకునే పరిస్థితి వచ్చింది. అకల్ మందుకు ఇషారా కాపీ.

రూపాయి కడుపులో పాపాయిలా ఓటు

ప్రచారం.. నెత్తి నోరు ఒకటి చేసి ఓటు వేయమని మొత్తుకోవాలి. మైక్ కాబట్టి చెప్పిందే అంటుంది. కాబట్టి పెద్ద బాధ లేదు. పైసలు ఉంటే అన్ని ఉన్నట్టే ప్రచారం అంటేనే పైసలు ఎగచల్లి ఏరుకోవాలి. మనిషి అయితే ఇటు వంక రాకుండా పత్తాకు లేకుండా పోయేవాడు. మైకు కాబట్టి లౌడ్ స్పీకర్ కాబట్టి చెప్పినట్టు వింటున్నయ్. అన్నట్టు అంటున్నయ్. ప్రచారమే నాయకుని గెలుపుకు గ్రహచారం అవుతుంది. కాళ్లకు అందితే తలకు అందదు. కలికాలం చలికాలం చెద్దర్ లెక్క వాహనాలు ఫ్లెక్సీలు పోస్టర్లు కరపత్రాలు ధూమ్ ధామ్ ఇయ్యర మయ్యర కాలుకు బట్ట కట్టకుండా తిరగాలి. గతంలో ఎన్నికల ప్రచారంలో గోడలదే ప్రముఖ పాత్ర ఉండేది. అభ్యర్థనగా ఓటు అడగాలన్నా అభ్యర్థి గుర్తు బొమ్మలు గీయాలన్నా దారి పక్కన ఉన్న కుడ్యాలే ముఖ్యమైన భూమిక వహించేవి. కాలం మారింది. చిన్న చిత్రకారుని కడుపు కాలింది. నిమిషాల్లో ఫ్లెక్సీలు, టీ.వి.లలో పత్రికలలో ప్రకటనలు ఇప్పుడు ప్రచారంలో అస్త్రశస్త్రాలు. రూపాయి కడుపులో పాపాయిలా ఓటు మారిపోయింది. నవ్వితే నాప చేను పండే కాలం ఒకటి ఎన్నికలలో వచ్చి చేరింది. తాజా కలం హస్తం కుస్తీలు పడుతున్నది. కమలం కలవరపడుతున్నది. కారు కీలుగుర్రం లాగా నడయాడుతున్నది. మొత్తానికి ఫలితం మా చెడ్డ గడ్డు పరిస్థితిని చవిచూడబోతున్నది. ఆయా పార్టీల నాయకులు నినాదాల మూలికలను కల్వంలో వేసి నూరి, కొత్త మందుతో ప్రజలకు నూరిపోస్తున్నారు.

-జూకంటి జగన్నాథం,

కవి, రచయిత

94410 78095

Advertisement

Next Story