అందమైన లవ్ ఫెయిల్యూర్ కథ 96

by Ravi |   ( Updated:2023-10-28 00:15:17.0  )
అందమైన లవ్ ఫెయిల్యూర్ కథ 96
X

భారతదేశ సినీ రంగంలో తమిళ సినిమాది ఒక ప్రత్యేక స్థానం. అన్ని భాషా సినిమాల్లో కమర్షియల్ హంగులే కథకు ప్రాణంగా ఉంటాయి. కొన్ని సినిమాల్లో, కథలో అంత పస లేనప్పటికీ హీరో, హీరోయిన్ చెరిష్మా కమర్షియల్ హంగులతో సినిమా నెట్టుకొస్తుంది. కానీ తమిళ సినిమాల్లో ఎక్కువ శాతం కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూ హృదయానికి హత్తుకునే స్టోరీ లైన్‌తో కథ అలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. అందులో ఐదేళ్ల క్రితం మోస్ట్ అండర్ రేటెడ్ సినిమాగా, ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని భారీ విజయం సాధించింది ఈ '96' సినిమా.

స్వచ్ఛమైన ప్రేమ కథ

96 సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మనసుకి హత్తుకునే సినిమా,ఈ సినిమాలోని హీరో హీరోయిన్ల మధ్య కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రతి ఒక్క మూవీ లవర్‌నీ మెప్పింపచేస్తుంది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాలో 1996వ సంవత్సరంలో పదో తరగతి విద్యార్థుల రీ యూనియన్ నేపథ్యంలో తెరకెక్కించాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్కూల్ లైఫ్‌లో ఎదురయ్యే లవ్ ఫీల్‌ని గుర్తు చేస్తాడు. ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని తమ తమ స్కూల్ డేస్‌లోకి తీసుకెళ్తాడు డైరెక్టర్. హీరో తన స్కూల్ లైఫ్‌లో పొందలేకపోయిన ప్రేమ మూలాన బాధతో ఒంటరిగా బ్రతకడం నేర్చుకుని, వయసు మీద పడిపోయి జుట్టు తెల్లబడి పోయినప్పటికీ, పెళ్ళి చేసుకోకుండా చిన్న పిల్లాడిగా జీవితాన్ని గడుపుతూ అందరికీ దూరంగా ఉంటూ తన ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని ఎవరితో పంచుకోకుండా తనలోనే దాచుకొని తన ఓన్ కంపెనీని ఎంజాయ్ చేస్తుంటాడు.

కథేంటంటే..

రామ్ తన స్టూడెంట్‌తో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా తన చిన్ననాటి ఊరికి వెళ్తాడు. అక్కడ తన చిన్ననాటి స్కూల్ డేస్ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి.సరిగ్గా అదే సమయంలో తన మిత్రులు ఫోన్ చేసి విద్యార్థుల రీ యూనియన్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ రీ యూనియన్‌లో రామ్ తన మిత్రులందరికీ కలుస్తాడు. అప్పుడే తాను స్కూల్ డేస్‌లో ఇష్టపడ్డ జానుని చూసి మాటలు రానివాడై పోతాడు, తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే మళ్ళీ కథ స్కూల్ డేస్‌కి మళ్లుతుంది. స్కూల్ సమయంలో జానుని ఎంతగా ప్రేమించినప్పటికి రామ్ భయంతో చెప్పలేకపోతాడు. మనం ప్రేమించిన వారు మన చుట్టూ ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే జాను రామ్ గుండె మీద చేయి వేయగానే అతను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఈ సీన్ అయితే సినిమా మొత్తానికే హైలైట్. ఈ ఒక్క సీన్ తోనే ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది.

స్కూల్ సెలవుల తర్వాత రామ్ కుటుంబం కొన్ని కారణాలవల్ల ఊరిని విడిచి వెళ్ళిపోతారు. దీంతో రామ్ గురించి జాను ఎంతగానో బాధపడుతుంది. మధ్య మధ్యలో ఎన్నోసార్లు జానూని కలవడానికి రామ్ ప్రయత్నించినప్పటికీ వీలుపడదు, అంతేగాక జానుకి సంబంధించిన ప్రతి విషయాన్ని రామ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాడు. పెళ్లి తర్వాత జాను తన భర్తతో విదేశాలకి వెళ్ళిపోతుంది. రీ యూనియన్ తర్వాత రాం, జానులు రాత్రంతా బయట గడిపే సమయంలో, జానుని కలవడానికి కాలేజీకి వచ్చిన సంగతి, తన పెళ్లికి కూడా వచ్చి ఓ మూలన కూర్చొని తను ఏ రంగు చీర కట్టుకుందో కూడా చూశానని చెప్పగానే జాను భోరున ఏడుస్తుంది. ఈ సీన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడి కళ్లెంబట నీళ్లు తెప్పిస్తుంది. ఆ బాధ నుంచి తేరుకున్న జాను ఒకవేళ వారిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే తమ జీవితం ఏ విధంగా ఉంటుందో ఊహించి చెప్పే సన్నివేశం మాత్రం అద్భుతంగా ఉంటుంది. జాను తన ఫ్లైట్ టైం కాగానే వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది.

అమరమైన అమలిన ప్రేమ

సినిమా చివరన విమానాశ్రయంలో రామ్ జానుల మధ్య సన్నివేశం ఎలాంటి డైలాగూ లేకుండా కేవలం వారి ఎక్స్ప్రెషన్స్‌తో మాత్రమే ఉంటుంది. అక్కడ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా మొత్తం మీద ఎక్కడ కూడా హీరో హీరోయిన్లు ఉద్దేశపూర్వకంగా ఒకరినొకరు తాకకుండా ఎటువంటి రొమాన్స్ లేకుండా ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీని అందంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్, సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గోవింద, వసంత పాటలు ఆత్మ లాంటివి. ముఖ్యంగా లైఫ్ ఆఫ్ రామ్, కాదలే కాదలే అనే పాటలు అద్భుతం. అంతేగాక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది సినిమా మొత్తానికి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి, త్రిషల అద్భుతమైన నటన సినిమాకి ఆయువు పట్టులాంటివి. ఈ సినిమాలో డైరెక్టర్ ప్రతి ఒక్క చిన్న విషయంలో దాక్కొని ఉన్న నిగూఢమైన అర్థాన్ని చక్కగా చూపెట్టాడు. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకుంది, అంతేగాక తెలుగులో సైతం జాను పేరిట ఈ సినిమా తీశారు ఇది కూడా మంచి విజయమే సాధించింది. నిజంగా '96' కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

('96' సినిమా ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది)

నేరడిగొండ సచిన్,

ఎం.ఏ జర్నలిజం, ఓయూ

87907 47628

Advertisement

Next Story