నల్లసూర్యుల తిరుగుబాటుకు 44 ఏండ్లు

by Ravi |   ( Updated:2023-01-06 02:06:41.0  )
నల్లసూర్యుల తిరుగుబాటుకు 44 ఏండ్లు
X

ది 1979 జనవరి 6. ప్రస్తుత మంచిర్యాల జిల్లా, అప్పటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మందమర్రి పట్టణంలోని నాగపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వేలాది కార్మికుల మీద పోలీసులు లాఠీఛార్జీలు జరిపిన సంఘటన. ఈ ఘటనలో ఆరుగురు బొగ్గు కార్మికులు చనిపోగా, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 50 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఇందులో మాజీ సీపీఐ శాసనసభా పక్ష నేత, దివంగత గుండా మల్లేష్ తృటిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. ఆయనకు స్వల్పగాయాలు అయ్యాయి. వందలాది సీపీఐ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులపై కేసులు పెట్టి నెలల తరబడి జైలులో పెట్టారు. తిరుగుబాటు చేసిన వారి మీద కేసులు ఎక్కువయ్యాయి. ఈ విషయమై అసెంబ్లీలో పెద్ద రగడ జరిగింది. షరా మాములుగా విచారణ అన్నారు. తర్వాత అది బుట్టదాఖలయింది. కాల్పులకు నిరసనగా సింగరేణి వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో కార్మికులు విధులు బహిష్కరించారు. ఉమ్మడి ఏపీలో సీపీఐ పిలుపు మేరకు బంద్ జరిగింది.

వారికి ఎదురు తిరిగి

అసలు ఆ నిరసనకు కారణం... అప్పట్లో మందమర్రి భూస్వాములు దౌర్జన్యం, దాష్టీకాలకు అసలే లెక్కే ఉండేది కాదు. పేదల భూముల ఆక్రమణ, వారి ఇంటి ముందు చెప్పులు లేకుండా నడవాలని ఆదేశించడం, కాలనీ ప్రాంతంలోని కార్మికులపై వారి గుండాలు దాడులు చేసి జీతాలు గుంజుకోవడం వంటివి చేసేవారు. అలాగే వారి యాజమాన్యంలోని సినిమా హాలులోనూ ఎక్కువ నవ్వినా, విజిల్ కొట్టినా గేట్ కీపర్లతో దాడి చేయించేవారు. ఆ సినిమా హాల్ పక్కన గల బావిలో వారానికి ఒకటి, రెండు మహిళల శవాలు కనిపించేవి. అది దొర పనే అని జనాలకి తెలిసినా ఎవరూ బయటకు చెప్పేవారు కాదు. వారి గుండాలు దసరా, దీపావళి, మొహర్రం పండగల సమయంలో టార్గెట్ చేసి మరీ మనుషులపై దాడిచేస్తూ హల్‌చల్ చేసేవారు. వారి దాడికి భయపడి ఎవరూ బయటకు వెళ్ళేవారు కాదు. దసరా పండుగ సమయంలో పాటిల్ అనే కార్మికుడిని కొట్టి పడేస్తే ఆయనని నేను నా మిత్రులు ఆసుపత్రిలో చేర్చాము. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. ఇది అప్పటి పరిస్థితి. సినిమాహాల్‌లోనూ గేట్ కీపర్లు దాడి చేస్తే మేము ఎదురుతిరిగి వాళ్లను కొట్టాము. అప్పడు పోలీసులు నన్ను లాకప్‌లో పెడితే సీపీఐ నేత, ఏఐటీయూసీ నాయకుడు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు... దొరల గూండాలకు వ్యతిరేకంగా అబ్రహం నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఇలా దొరకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. గూండాల ఇండ్ల మీదికి వెళ్ళి మేమే దాడులు చేసి వార్నింగ్‌లు సైతం ఇచ్చాము. అలాగే సీపీఐ మహిళా నేతలు మహాలక్ష్మి ఎస్ఎన్ మనమ్మ వంద రోజులు నిరాహార దీక్ష చేశారు. కార్మికులకు సారా తాగొద్దని చెప్పి చైతన్య పరిచారు. అలా నల్ల నేలలో తొలిసారి సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఆ సమయంలో పీపుల్స్ వార్ భయానికి సారా కాంట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ల ముందు పెట్టి సారా అమ్మించారు.

అక్కడికి వెళుతుందనే భయంతోనే

ఆ సమయంలోనే 1979 జనవరి 5న ఊరు దొర మనుషులు మందమర్రిలోని కేకే, సీఎస్పీ వద్దగల వే బ్రిడ్జి(కాంట) వద్ద బొగ్గు లారీలో లోడింగ్, అన్‌లోడింగ్ చేసే కార్మికుల నుంచి సగం పేమెంట్ కమీషన్ కింద తీసుకోవడం మళ్లీ ప్రారంభించారు. దీనిపై నలుగురు కూలీలు నాకు చెప్పగా నేను అందుబాటులో ఉన్న మిత్రులు, అబ్రహం సార్ సహాయంతో కాంట వద్దకు చేరుకోగా, అప్పటికే సిద్ధంగా ఉన్న 50 మంది గుండాలు మాపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఆకస్మిక దాడిని మేము తిప్పికొట్టాము ఈ క్రమంలో నేను, అబ్రహం సార్ తప్ప అందరూ వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎదురుదాడికి సిద్ధం కావడంతో పరార్ అయ్యారు. వే బ్రిడ్జిపై రక్తం మడుగులో ఉన్న మా ఇద్దరిని అక్కడి కార్మికులు మంచిర్యాల ఆసుపత్రికి చేర్చారు. మాపై దాడిని కార్మికులు తీవ్రంగా తీసుకున్నారు. సుమారు 10 వేల మంది కార్మికులు ర్యాలీగా బయలుదేరి గుండాల ఆస్తులు, సినిమా హాల్, మద్యం షాపులు దగ్ధం చేశారు.

ఈ ర్యాలీ భూస్వామి ఇంటివైపు వెళుతుందనే అనుమానంతో పోలీసులు పాత బస్టాండ్ లోని నాగపూర్-హైదరాబాద్ హైవే పై లాఠీఛార్జ్ చేశారు. ఈ సంఘటన ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సహా సీపీఐ కార్యకర్తలు, విప్లవ సంఘాల కార్యకర్తలు పాల్గొని మద్దతు తెలిపారు. భూస్వాములకు వ్యతిరేకంగా పలు పోరాటాలలో పాల్గొని భారీగా కేసులలో ఇరుక్కుపోయాం. ఎంతో కాలం జైళ్ళలో ఉన్నాం. తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొన్నాం. ఈ సంఘటనలో ఎంతో మందికి గాయాలయ్యాయి. ఆరుగురు కార్మికులు చనిపోయారు. హైదరాబాద్ జాతీయ రహదారి పొడవునా రక్తసిక్తం అయింది. ఆ దృశ్యాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ కార్మికుల త్యాగాలను నల్ల నేల ఎన్నటికీ మర్చిపోదు. వారి త్యాగాలను నేటికీ గుర్తు చేసుకుంటోంది. పోరు వీరులకు శిరస్సు వంచి స్మరించుకుందాం.

ఎండి.మునీర్,

సీనియర్ జర్నలిస్ట్,

9951865223

Also Read...

బహుజనులు రాజకీయ బానిసలేనా.!?


Advertisement

Next Story