- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 ఫ్రేమ్స్: ఊరూరా మినీ థియేటర్లు ఎక్కడ!?
చిన్న సినిమాలకు, తక్కువ బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు, ప్రయోగాత్మక సినిమాలకు మల్టీప్లెక్సులు, మినీ థియేటర్లే ఊపిరి పోస్తాయి. ఎందుకంటే అక్కడ పెద్ద రెంట్లు కట్టి , ఆక్యుపెన్సీ లేక, వాటి ఖర్చును భరించలేక విడుదలకే నోచుకోని సినిమాలే మనకు కనిపిస్తాయి. భవిష్యత్తులో తెలంగాణ సినిమా కూడా ప్రదర్శనా లేమి ప్రమాదం ఎదుర్కో కోకుండా వుండాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మినీ థియేటర్ల పథకం ఎంతో ఉపయుక్తమవుతుంది. కేవలం వ్యాపార లక్ష్యమే కాకుండా అర్థవంతమైన సినిమాలు తెలంగాణలో నిర్మించబడాలంటే వాటికి ప్రదర్శనకు సంబంధించి నిర్మాణాత్మక కృషి జరిగే విషయంలో చిన్న థియేటర్ల నిర్మాణం గొప్ప ఆశావాహంగా కనిపిస్తున్నది. ఇక సినిమాలపరంగానే కాకుండా ఈ మినీ థియేటర్ల ద్వారా ఆయా నగరాలలో, మండల కేంద్రాలలో థియేటర్ల చుట్టూ పెంపొందే ఇతర వ్యాపారాల ద్వారా కూడా మార్పులు వచ్చే అవకాశం వుంది. ఫలితంగా పన్నుల రూపేణా ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికైనా ఆటకెక్కిన మినీ టాకీసుల ఆలోచనకు రూపమివ్వాల్సిన అవసరం వుంది. 'టాకీసులకు ప్రేక్షకులు రావడం లేదు మొర్రో' అన్న సినిమావాళ్ల బాధలూ దీంతో కొంత మేర తీరతాయి.
సినిమా రంగానికి ఊతమిచ్చే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినీ థియేటర్ల(mini theatres) నిర్మాణానికి పూనుకొన్నట్టు గతంలో ఎప్పుడో ప్రకటించింది. సినిమా రంగానికి సంబంధించిన నిర్మాణ, పంపిణీ, ప్రదర్శనా రంగాలలో ముఖ్యమైన సినిమాల ప్రదర్శన విషయంలో మినీ థియేటర్ల నిర్మాణం ఆహ్వానించదగ్గ పరిణామమే. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల కేంద్రాలలోనూ బస్ స్టేషన్ ఆవరణలలోనూ, ఇతరత్రా ఖాళీ స్థలాలలోనూ ఈ మినీ థియేటర్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు అప్పుడు చెప్పారు. ఏమైందో తెలీదు కానీ, అది ఆలోచనగానే మిగిలిపోయింది. కార్యరూపం దాల్చలేదు. నిజానికి సినిమా ఎక్కువ మంది ప్రజలకు చేరినప్పుడే అటు విలువలపరంగాను, వ్యాపారపరంగాను దాని ప్రయోజనం నిరూపితమవుతుంది.
మారుమూల పల్లెలలో కూడా ప్రదర్శనా వసతులు ఏర్పడినప్పుడే మంచి సినిమాకైనా, చెత్త సినిమాకైనా ప్రజలను చేరే అవకాశం లభిస్తుంది. వాటి మంచీ చెడూ ప్రజలకు తెలవడంతో పాటు వ్యాపార పరంగా కూడా జయాపజయాలు తేలిపోతాయి. తక్కువ సీట్లున్న మినీ థియేటర్లు నిర్మించబడి అవి మల్టీప్లెక్స్‌ల్లాగా మారగలిగితే కేవలం టికెట్ల వల్లనే కాకుండా వాటిచుట్టూ ఏర్పడే ప్రచార వాతావరణం, క్యాంటీన్, పార్కింగ్ తదితర మార్గాల ద్వారా కూడా సినిమా వ్యాపారం విస్తరించే అవకాశం వుంది. అందుకే మినీ థియేటర్ల నిర్మాణం భవిష్యత్తులో మంచి సినిమాకు ఎంతో ఉపయుక్తం అవుతుంది, ఇంకో రకంగా చెప్పుకుంటే విప్లవాత్మకం కూడా కావచ్చు. సినిమాలు పుట్టిన నాటి నుండి డేరాలూ, తడకల హాళ్లు, రేకుల షెడ్లు, టూరింగ్ టాకీసులు తదితర రూపాలలో వున్న ప్రదర్శన వసతులు, కాల క్రమేణా సింగల్ ప్రొజెక్టర్ హాళ్లు, డబుల్ ప్రొజెక్టర్ హాళ్లు ఏర్పాటయ్యాయి. ఇటీవలి కాలంలో తక్కువ సీట్లున్నవి, మల్టీప్లెక్సులు(multiplex theaters) ఏర్పాటయ్యాయి. ఫలితంగా చిన్న సినిమాలకు, ప్రయోగాత్మక సినిమాలకు టాకీసులు దొరికి ప్రదర్శన అవకాశాలు మెరుగయ్యాయి.
మన సినిమాదే సింహభాగం
ప్రపంచవ్యాపితంగా చూసినప్పుడు భారత్ సంఖ్యాపరంగా అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశంగా వినుతుకెక్కింది. దేశంలో యేటా దాదాపు రెండు వేల సినిమాల దాకా నిర్మించబడుతూ వున్నాయి. 20 భాషలలో విస్తరించి వున్న భారతీయ సినిమా రంగం యేటా 2.1 బిలియన్ల వ్యాపారాన్ని విస్తరించి వుంది. అది క్రమంగా పెరిగి 2023 కల్లా 3.7 బిలియన్ల వ్యాపారాన్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. సంఖ్యాపరంగా ఎక్కువైనప్పటికీ, ఆదాయపరంగా హాలీవుడ్‌తో పోలిస్తే చాలా తక్కువే. భారతీయ సినిమా వ్యాపారంలో బాలీవుడ్‌గా పిలువబడే హిందీ సినిమా రంగమే 43శాతం ఆక్రమిస్తుండగా 7 శాతం విదేశీ చిత్రాలుంటున్నాయి, ఇక మిగతా 50లో మిగిలిన భారతీయ భాషా చిత్రాలుంటున్నాయని ఒక అంచనా. ఈ 50 లో కూడా తెలుగు సినిమానే అధిక శాతం ఆక్రమిస్తున్నదనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో ఇప్పటికీ పెద్ద సినిమా హాళ్లే అధిక శాతం వ్యాపారం చేస్తున్నాయి, మొత్తంలో 85 శాతం పెద్ద హాళ్లే వున్నప్పటికీ, వాటి ఉనికి క్రమంగా అంతరించిపోతుంది. అనేక టాకీసులు పెళ్లి మంటపాలుగా, గోడౌన్‌లుగా రూపాంతరం చెందడాన్ని చూస్తూ వున్నాం.
మన దేశంలో ఇప్పటికీ దాదాపు 2100 మల్టీప్లెక్సులు ఒక్కో దాంట్లో 150-250 సీట్లతో వుండగా, పెద్ద టాకీసులు ఆరు వేలకు పైగా 750-1200 సీట్లతో వున్నట్టు అంచనా. బాక్స్ ఆఫీస్ ఆదాయం విషయంలో మల్టీప్లెక్సులు 40 శాతం వరకు సమకూరుస్తున్నాయి. అమెరికాలో మాత్రం 90 శాతం మల్టీప్లెక్సులే వున్నాయి. అధిక ఆదాయం కూడా వాటితోనే వస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో ఇటీవలి కాలంలో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ మొత్తం మీద అవి మహానగరాలకే పరిమితమై వుండడాన్ని గమనించవచ్చు. తెలంగాణ విషయానికి వస్తే మల్టీప్లెక్సులు ప్రధానంగా హైదరాబాద్‌లోనే వున్నాయి. అందుకే తెలంగాణ జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో మినీ థియేటర్లు ఏర్పాటైతే సినిమా రంగానికి ఇతోధికంగా సహకారి అవుతుంది. కొత్తగా రూపొందబోతున్న మనదైన తెలంగాణ సినిమా మనుగడకు ఎంతో ఉపయోగకారి అవుతుంది.
వాటితోనే ఊపిరి
చిన్న సినిమాలకు, తక్కువ బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు, ప్రయోగాత్మక సినిమాలకు మల్టీప్లెక్సులు, మినీ థియేటర్లే ఊపిరి పోస్తాయి. ఎందుకంటే అక్కడ పెద్ద రెంట్లు కట్టి , ఆక్యుపెన్సీ లేక, వాటి ఖర్చును భరించలేక విడుదలకే నోచుకోని సినిమాలే మనకు కనిపిస్తాయి. భవిష్యత్తులో తెలంగాణ సినిమా కూడా ప్రదర్శనా లేమి ప్రమాదం ఎదుర్కో కోకుండా వుండాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మినీ థియేటర్ల పథకం ఎంతో ఉపయుక్తమవుతుంది. కేవలం వ్యాపార లక్ష్యమే కాకుండా అర్థవంతమైన సినిమాలు తెలంగాణలో నిర్మించబడాలంటే వాటికి ప్రదర్శనకు సంబంధించి నిర్మాణాత్మక కృషి జరిగే విషయంలో చిన్న థియేటర్ల నిర్మాణం గొప్ప ఆశావాహంగా కనిపిస్తున్నది.
ఇక సినిమాల పరంగానే కాకుండా ఈ మినీ థియేటర్ల ద్వారా ఆయా నగరాలలో, మండల కేంద్రాలలో థియేటర్ల చుట్టూ పెంపొందే ఇతర వ్యాపారాల ద్వారా కూడా మార్పులు వచ్చే అవకాశం వుంది. ఫలితంగా పన్నుల రూపేణా ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికైనా ఆటకెక్కిన మినీ టాకీసుల ఆలోచనకు రూపమివ్వాల్సిన అవసరం వుంది. 'టాకీసులకు ప్రేక్షకులు రావడం లేదు మొర్రో' అన్న సినిమావాళ్ల బాధలూ దీంతో కొంత మేర తీరతాయి.
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.
వారాల ఆనంద్
9440501281
Also Read...