చిన్న చిత్రాలు.. మంచి రోజులు

by Vinod kumar |
చిన్న చిత్రాలు.. మంచి రోజులు
X

చిన్న చిత్రాలకు మంచిరోజులు వస్తున్నాయన్న సందేశాన్ని 2023లో తెలుగు చిత్రసీమ మోసుకొచ్చింది. 2023 జనవరి నుంచి డిసెంబర్ మూడవ వారం వరకు విడుదలై ‘విజయం’ సాధించిన చిన్న చిత్రాలు రాసిలోనే కాకుండా వాసిలో కూడా ప్రశంసలకు నోచుకున్నాయి. కల్యాణం కమనీయం, రైటర్ పద్మభూషణ్, వినరో భాగ్యము విష్ణు కథ, బలగం, సామజ వరగమన, బేబీ, పొలిమేర 2, మంగళవారం, కోటబొమ్మాళి పి.ఎస్ వంటి సినిమాలు డబ్బు చేసుకోవడమే కాకుండా ప్రశంసలకు నోచుకున్నాయి.

2023 సంవత్సరం ‘చిన్నచిత్రాల’ వత్సరంగా చెప్పుకోవచ్చునని అనిపిస్తుంది. ఈ చిత్రాలలో అన్ని రకాల కథలున్నాయి. ముఖ్యంగా హ్యూమన్ డ్రామా, ఎమోషన్స్‌ను బాగా డీల్ చేశారు దర్శకులు. ఒకవిధంగా నిర్మాతలు చాలా వరకు ‘కొత్త యువ దర్శకులను’ నమ్మారనే చెప్పాలి. వారు కూడా సాధ్యమైనంత వరకు తమ బాధ్యతలను సక్రమంగానే నిర్వహించి ‘నిర్మాత’ బతికి బట్టకడితేనే ‘తమకు’ భవిష్యత్తని వారు నమ్మారు. ఈ నేపథ్యం నుంచి 2023 జనవరి నుంచి డిసెంబర్ మూడవ వారం వరకు విడుదలై ‘విజయం’ సాధించిన చిన్న చిత్రాల గురించి చెప్పుకోవాలి. ‘చిన్న సినిమాలు బతికిబట్ట కట్టనీయండి. వాటికి థియేటర్లు ఇవ్వండి’ అనే నినాదం ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమలో గట్టిగానే వినిపిస్తున్నది. కానీ.. ప్రేక్షకులు ఆదరించేది పెద్ద సినిమా.. లేకుంటే ఎంతటి పెద్దచిత్రమైనా ‘చిన్న’ చిత్రమే అని కూడా సినీ పండితుల విశ్లేషణలు. ఇది నిజం కూడా అనిపిస్తుంది.

చిన్న పెద్ద అనే మాటలకు నిర్వచనాలు మారిపోయిన కాలమిది. బాక్స్ ఆఫీస్ ముందు సత్తా చాటగలగటమే ‘సినిమా’కు ప్రధానమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 150కి పైగా చిత్రాలు విడుదలైనాయి. వీటిలో పరిమిత వ్యయంతో నిర్మించిన చిత్రాలు శతకానికి పైగానే ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు నచ్చాయని చెప్పవచ్చు. సంక్రాంతి సీజన్ 2023 ‘కల్యాణం కమనీయం’తో ప్రారంభమైంది. కానీ పరిశ్రమలో మొదటి విజయం ఫిబ్రవరిలో నమోదు చేసుకుంది. ‘రైటర్ పద్మభూషణ్’ సుహాస్ కథానాయకుడిగా కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ సినిమాను కామెడీ డ్రామాగా మలిచి ఓ మంచి ప్రయత్నం చేశాడు. ఇదే నెలలో విడుదలైన మరో కొత్త దర్శకుడు మురళీ కిషోర్ కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తీసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ పంచిన వినోదం ప్రేక్షకులను అలరించింది. మార్చి నెలలో చిత్ర పరిశ్రమ ‘మర్చి’పోలేని నెలగా విడుదలైన చిత్రం బలగం. మట్టికథల పైన నేటికీ మనుషులలో మమకారం తరగలేదని చెప్పిన సినిమా ఇది. ఈ ఏడాది సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకున్న పరిమిత వ్యయంతో నిర్మించి (మూడు కోట్లు) అపరిమితమైన లాభాలార్జించిన (27కోట్లు) చిత్రంగా ట్రేడ్ వర్గాలు చెప్పుకున్న చిత్రం. తెలంగాణ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సహజమైన లొకేషన్‌లో చిత్రీకరణ సినిమా అభిమానుల మనసు గెలిచింది. నటుడు వేణు ఈ చిత్రంతో దర్శకుడుగా మారాడు. కోట్ల వర్షం కురిపించింది.

ఇక ద్వితీయార్థంలో ప్రథమ భాగం కన్నా కాస్త ఎక్కువ చిన్న చిత్రాలు తమ జోరును పెంచాయి. జూన్‌లో వచ్చిన ‘సామజ వరగమన’ అభిమానులకు మంచి వినోదాన్ని పంచి హిట్టు కొట్టింది. శ్రీ విష్ణు కథానాయకుడు. రామ్ అబ్బరాజు దర్శకుడు. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. మరో చిత్రం సుమంత్ ప్రభాస్ ‘మేం ఫేమస్’ రూపక్ రోనాల్డ్స్, ‘పరేషాన్’ చిత్రాలు కూడా మంచి ప్రయత్నాలుగా తమస్థాయికి తగిన వసూళ్లను రాబట్టుకున్నాయి. జులైలో విడుదలైన ‘బేబీ’తో దర్శకుడు సాయిరాజేష్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన తారాగణంగా వచ్చిన ‘కల్ట్ ప్రేమకథా’ చిత్రమిది. 10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ‘యువత’ను విశేషంగా ధియేటర్లకు రప్పించి 80 కోట్లు పైచిలుకు వసూళ్ళను సాధించిందని సినీ వ్యాపార వర్గాల అంచనా. ‘ఆర్ఎక్స్ 100’ తరువాత సరైన విజయం లేని కార్తికేయకు ‘బెదురులంక 2012’ కాస్త చేయూతనిచ్చి నిలిపింది. ఈ ఏడాదిలో విడుదలయ్యి మంచి వసూళ్ళను రాబట్టుకున్న చిత్రం ‘మాడ్’. కళ్యాణ్ శంకర్ దర్శకుడయ్యాడు. ఇదే నెలలో విడుదలైన సంపూర్ణేష్ బాబు చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. పూజ కొల్లూరు అనే దర్శకురాలు ఈ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

నవంబర్ నెలలో దాదాపుగా 20కి పైగా చిత్రాలు విడుదలైనవి. వాటిలో నాలుగు మాత్రమే హిట్ టాక్‌ను తెచ్చుకున్నాయి. ఓ విభిన్నమైన క్రైమ్ కామెడీ కథతో వచ్చిన ‘కీడాకోలా’ను తరుణ్ భాస్కర్ తీశారు. ఆయనో పాత్రను కూడా పోషించారు. అనిల్ విశ్వనాథ్ ‘పొలిమేర’ ఇచ్చిన విజయంతో ‘పొలిమేర 2’ నిర్మించారు. ఇది కూడా ఆ తరహాకథలు నచ్చేవారు మెచ్చుకున్నారు. అజయ్ భూపతి సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ‘మంగళవారం’ కూడా జనాలను అలరించింది. ఇక మలయాళీ చిత్రం రీమేక్ గా వచ్చిన తేజ మార్ని ‘కోటబొమ్మాళి పి.ఎస్’ ఓ రాజకీయపరమైన థ్రిల్లర్ కథాంశంతో చేసిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. డిసెంబర్ నెలలో ఇంతవరకు ఓ పన్నెండుకు పైగా చిన్న చిత్రాలు విడుదలైనా ఏదీ తమ ‘ముద్ర’ను వేసుకోలేకపోయింది. ‘పిండం’ ‘కలశ’ వంటి చిత్రాలకు ట్రైలర్లు ముందుకు తోసినా ప్రేక్షకులు మాత్రం వాటిని వెనుక వరుసలోనే ఉంచారు.

ఇంతవరకు విడుదలై మంచి విజయాలను అందుకున్న చిన్న చిత్రాలన్నీ విభిన్నమైన కథాంశంలో వచ్చినవి. అంతేకాదు.. మానవ భావోద్వేగాలను, మనస్తత్వ కథనాలు, రాజకీయ నేపథ్యాలు, మనిషిలోని బలహీనతలపై ఆడుకొని సొమ్ము చేసుకునే ‘స్వార్థ పూరిత వివిధ మతవర్గాల వారిపైన వచ్చినవే. ఒక విధంగా ప్రజలను కాస్త ఆలోచించమని చెబుతాయి. ఓటు విలువను సైతం తెలుసుకోవలసిన అవసరం ఉందని చెప్పే చిత్రాలు రావటం శుభ పరిణామంగానే భావించాలి. చిన్న చిత్రాలకు ప్రేక్షకులు అందించిన విజయాలు కొత్త సంవత్సరంలో తెలుగు చిత్రసీమకు మంచి రోజులను సూచిస్తాయనుకోవచ్చు.

భమిడిపాటి గౌరీశంకర్,

94928 58395




Advertisement

Next Story

Most Viewed