83వ యేట ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న చునీబాలాదేవి ఎవరో తెలుసా?

by Ravi |   ( Updated:2022-09-03 13:30:53.0  )
83వ యేట ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న చునీబాలాదేవి ఎవరో తెలుసా?
X

మొదట సినిమాలో నటించలేనని చెప్పిన చునీ బాలాదేవి తర్వాత అంగీకరించారు. ఈ పాత్ర చేయడానికే ఇంకా బతికుందా అన్నట్టుగా అద్భుతంగా నటించిన చునీ బాలాదేవిని మహా మహా నటులు ఎంతగానో మెచ్చుకున్నారు. సహజ నటన చూపిన చునీ బాలాదేవికి బంగ్లా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి పురస్కారాన్ని ప్రకటించారు. 83 వ యేట (జననం:1872) ఈ సినిమా రిలీజు కంటే ముందే 1955లోనే చునీ బాలాదేవి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. అనారోగ్యంగా వున్న చునీ బాలాదేవి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సత్యజిత్ రే ప్రొజెక్టర్‌తో సహా ఆమె నివాసానికి వెళ్లి సినిమా చూపించారు. తన సినిమాలో నటించిన నటుల పట్ల సత్యజిత్ రే చూపించిన ఔన్నత్యాన్ని నిరూపించిన సంఘటన ఇది.

వేగంగా వెళ్తున్న కారు కలకత్తాలోని చౌరంగీలేన్ దాటి ఒక సెంటర్ దగ్గర ఆగిపోయింది. 'ఎందుకాపావు?' అడిగాడు వెనక సీట్లో కూర్చున్న 34 సంవత్సరాల యువకుడు ఇంగ్లిష్ దిన పత్రిక చదువుతూనే. 'రెడ్ లైట్' బాబూ అన్నాడు డ్రైవర్. 'అయితే లోపలికి పోనీయ్' అంటూ దిన పత్రిక కిందికి దించి అన్ని వైపులా చూశాడు. యువకుడి హడావుడి గమనించిన డ్రైవర్ 'రెడ్ లైట్ పడింది బాబూ' అన్నాడు క్లారిటీగా. 'ఓహో, రెడ్ లైటా? రెడ్ లైట్ ఏరియా' అప్పుడే వచ్చిందా అనుకున్నాను' అన్నాడా యువకుడు. అతడి మనసులో ఇందర్ థాకూరన్ పాత్రధారిని మాత్రమే మెదులుతోంది మరి. మరో అరగంట తర్వాత రెడ్ లైట్ ఏరియా రానే వచ్చింది.

ఉదయం పదకొండవుతోంది. సగం చనిపోయిన ఆడ శరీరాలు అప్పుడప్పుడే నిద్రలేచి ఆరు బయట తిరుగాడుతున్నాయి. వారంతా చెదిరిపోయిన జుట్టుతో, వాడిపోయిన పూలతో, రాలిపోయిన మేకప్పుతో కళావిహీనంగా కనబడుతున్నారు. కండ్లు ఎరుపెక్కి ఉన్నాయి. రాత్రంతా అదేపనిగా తాగిన మందు తలకెక్కినట్లుంది. వేశ్యాగృహాల ముంగిట అన్ని వయసుల మహిళలు వేడి వేడి చాయ్ చప్పరిస్తున్నారు. కారు సరాసరి ఓ పాడుపడిన సింగిల్ రూం టెనామెంట్ ముందు ఆగింది. కారును చూసి గుడిసెలోంచి ఒక నడి వయస్కురాలు బయటికొచ్చింది. నోటిలో పైపుతో పొగ ఊదుతూ కారు దిగిన యువకుడు ఎదురొచ్చిన ఆవిడతో ఎవరి గురించో ఆరా తీస్తున్నాడు. యువకుడి సహాయకులు డిక్కిలోనుంచి చిన్న స్టాండు, ఒక తెర, ఒక పోర్టబుల్ ప్రొజెక్టర్, ఫిల్ములతో ఉన్న గుండ్రటి డబ్బాలు కిందకు దించారు. ఇరుగుపొరుగు వింతగా చూస్తున్నారు. ఆ యువకుడు తన పైపులో కాలిపోయిన టొబాకోను ఓ చెత్తకుప్ప దగ్గర రాల్చి, పైపును తన హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు.

కుంగి, కృశించి

లోపలికి ప్రవేశించగానే ఒక కుక్కి మంచంలో పడుకుని కనిపించింది ఆమె. అనారోగ్యంతో కుంగిపోయి, మంచానికి అతికిపోయివున్న ఆమె యువకుడిని చూసి కళ్లతోనే పలుకరించింది. తను వచ్చిన పని చెప్పాడు. ఆమె కొద్దిగా తలూపింది. తన సహాయకులకు తెచ్చిన పరికరాలు ఎలా అమర్చాలో చెప్పాడు. అతి చిన్న గదిలో తెరను అతి కష్టంగా అమర్చారు. ప్రొజెక్టర్ నుంచి తెరకు దగ్గరగా అమర్చిన చిన్న స్పీకర్‌కు వైర్లతో కనెక్ట్ చేశారు. బ్యాటరీ ఆన్ చేసి అన్ని సరిగా ఉన్నాయో, లేదో చూసుకున్నారు. ఆమె నటనను చాలా మంది మెచ్చుకున్నారని ఆ యువకుడు చెబుతుండగా ఆ నటి శ్రద్దగా వింటున్నది. తెరకు అభిముఖంగా ఆమెను మంచంలోనే గద్దీలు అమర్చి కూర్చోబెట్టారు. యువకుడు ప్రొజెక్టర్ ఆపరేట్ చేయసాగాడు. టైటిల్స్ పడుతున్నాయి. పండిట్ రవిశంకర్ సితారతో రవీంద్ర సంగీత్ పలికిస్తున్నాడు. ఆ నటి కళ్లు పరవశంతో వెలుగుతున్నాయి.

టైటిల్స్‌లో 'ఇందర్ థాకురన్-చునీబాలా దేవి' అని రాగానే ప్రొజెక్టర్ ఆపి ఆ నటికి చదువుతూ చూపించాడు. చిరునవ్వుతో తలూపింది. ఆనందంతో కన్నీళ్లు రాలాయి. అతని సహాయకులు చప్పట్లు కొట్టారు. సినిమా చివరి వరకు రెండు గంటల పది నిమిషాలు విసుగు చెందకుండా చూసిందామె. కళ్లతోనే యువకుడికి ధన్యవాదాలు చెప్పింది. తృప్తిగా ఓ చిరునవ్వు నవ్వింది. అదే ఆమె ఆఖరి చిరునవ్వు ఆ తర్వాత కొన్ని రోజులకే అనారోగ్యంతో చనిపోయింది. రాష్ట్రపతికో, ప్రధాన మంత్రికో సినిమా చూపించడానికి వారుండే చోటుకే వెళతారు. కానీ, రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఓ నటికి ఆ గౌరవం దక్కింది. ఆమె పేరు చునీ బాలాదేవి. ఆ యువ దర్శకుడి పేరు సత్యజిత్ రే, ఆ సినిమా పేరు 'పథేర్ పాంచాలి'

వెతకగా, వెతకగా దొరికి

ఈ సినిమా నిర్మాణ సమయంలో మొత్తం పాత్రలకు ఎంపిక జరిగింది. కానీ, అందులో పండు ముదుసలి ఇందర్ థాకురన్ పాత్రకు ఎవ్వరూ దొరకలేదు. బాగా ముడుతలు పడిపోయి ఉన్న మొహం, కుంగి కృషించిపోయిన బలహీన శరీరం, బాగా వెన్ను వొంగిపోయి ఉన్న నటి కావాలని వెతికారు. కానీ, దొరకలేదు. 80 యేళ్లు దాటిన ముదుసలి, సంభాషణలు చెప్పగలిగి, ఇన్‌డోర్-ఔట్‌డోర్ షూటింగులలో అనుకూల, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగిన నటి దేశంలో ఎక్కడా కనబడలేదు. కనబడినా, తృప్తికర నటన చేయగలుగుతారన్న నమ్మకం దర్శకుడికి కలగలేదు. తక్కువ వయసుండి, బాగా నటించగలిగిన నటికి మేకప్ చేసి నటింపచేయడం సత్యజిత్ రేకు అసలే ఇష్టం లేదు. రాజీ పడే దర్శకుడు కాదు. చివరకు ఇదే సినిమాలోనే సేజా థాకురన్ పాత్రకు ఎన్నుకోబడిన నటి రేవాదేవి సూచన మేరకు రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న ఒకనాటి నర్తకీమణి, నాటకానుభవంతోపాటు ఒక రెండు సినిమాలలో (బిగ్రహ-1930, రిక్తా-1940) చిన్న చిన్న పాత్రలు వేసిన చునీ బాలాదేవిని కలుసుకున్నారు.

ఆమెను చూడగానే నూరుపాళ్లు తాను అనుకున్న పాత్రకు సరిగ్గా సరిపోయిందనుకున్నారు. మొదట సినిమాలో నటించలేనని చెప్పిన చునీ బాలాదేవి తర్వాత అంగీకరించారు. ఈ పాత్ర చేయడానికే ఇంకా బతికుందా అన్నట్టుగా అద్భుతంగా నటించిన చునీ బాలాదేవిని మహా మహా నటులు ఎంతగానో మెచ్చుకున్నారు. సహజ నటన చూపిన చునీ బాలాదేవికి బంగ్లా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి పురస్కారాన్ని ప్రకటించారు. 83 వ యేట (జననం:1872) ఈ సినిమా రిలీజు (26 ఆగస్టు 1955) కంటే ముందే 1955లోనే చునీ బాలాదేవి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. అనారోగ్యంగా వున్న చునీ బాలాదేవి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సత్యజిత్ రే ప్రొజెక్టర్‌తో సహా ఆమె నివాసానికి వెళ్లి సినిమా చూపించారు. తన సినిమాలో నటించిన నటుల పట్ల సత్యజిత్ రే చూపించిన ఔన్నత్యాన్ని నిరూపించిన సంఘటన ఇది.

('పథేర్ పాంచాలి' విడుదలకు నేటితో 67 యేండ్లు)


కోట ప్రసాద్

సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు

98497 61797

Advertisement

Next Story

Most Viewed