ఈటల కొత్తపార్టీ పక్కా.. మెడలో నీలిరంగు కండువా.. పార్టీ గుర్తు అదేనా?

by Anukaran |   ( Updated:2021-05-24 11:02:15.0  )
ఈటల కొత్తపార్టీ పక్కా.. మెడలో నీలిరంగు కండువా.. పార్టీ గుర్తు అదేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టడానికే సిద్ధమయ్యారు. అన్ని సెక్షన్ల ప్రజలను కలుపుకుపోయే విధంగా వ్యూహ రచన చేయడం మాత్రమే కాక భవిష్యత్తులో ఏం చేయబోతున్నదీ సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఆర్ఎస్‌యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరితో సంబంధాల్లో ఉన్నానని బహిరంగంగానే చెప్పుకున్న ఈటల ట్విట్టర్‌లోని తన ప్రొఫైల్‌లో ఆ విషయాన్ని ఫోటో ద్వారా తెలియజేశారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ ఇప్పటికీ టెక్నికల్‌గా టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా, ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్ళిపోయేలా టీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంటే, పార్టీయే గెంటివేసే వరకు వేచి చూడాలని ఈటల ఆలోచిస్తున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా, అంతిమ ఫలితం ఎలా సంభవించినా ఏదో ఒక రోజు గులాబీ పార్టీకి దూరం కాక తప్పదనేది ఆయనకు తెలియందేమీ కాదు.

గులాబీ పార్టీ నుంచి దూరమైన తర్వాత కాంగ్రెస్‌లో చేరుతారా లేక బీజేపీలో చేరుతారా లేక కొత్త పార్టీని పెడతారా అంటూ రకరకాల చర్చలు తెలంగాణలో మొదలయ్యాయి. ఆయనకు మద్దతు ఇచ్చేవారెవరు, ఆయనతో కలిసి నడిచేవారెవరు, టీఆర్ఎస్‌లోని అసంతృప్తి, అసమ్మతి నేతలు ఏ మేరకు ఆయన వెంట వెళ్తారు.. ఇలాంటి చర్చలు ఎన్ని ఉన్నా చివరకు సొంత పార్టీ పెట్టుకునే తీరులోనే ఆయన ప్రయాణం సాగుతోందని ఆయన తన కార్యాచరణ ద్వారానే స్పష్టం చేస్తున్నారు. కలిసొచ్చే అన్ని శక్తులనూ, అన్ని సెక్షన్ల ప్రజలనూ కలుపుకుపోవాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. ట్విట్టర్ ప్రొఫైల్‌లో ఆయన పెట్టుకున్న ఇమేజ్‌ను, దానిలోని ప్రాధాన్యతలను గమనిస్తే…

• వామపక్ష భావజాలానికి స్ఫూర్తిగా బిగించిన పిడికిలిని తెలంగాణ మ్యాప్‌లో పెట్టుకున్నారు.
• హిందు సెంటిమెంట్ కోసం, హిందు ఓటుబ్యాంకును ఆకర్షించడానికి రాష్ట్ర మ్యాప్‌లో కాషాయం రంగును పెట్టుకున్నారు.
• తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ కోసం తెలంగాణ తల్లి చిత్రాన్ని పెట్టుకున్నారు.
• రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ప్రజల త్యాగానికి గుర్తుగా తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పెట్టుకున్నారు.
• బీసీల గొంతుకగా, ఆ వర్గానికి చెందిన వ్యక్తిగా, ఆ వర్గ ప్రజలను కలుపుకుపోయేలా జ్యోతిబా ఫూలే చిత్రాన్ని పెట్టుకున్నారు.
• దళిత, బహుజనులు ఆరాధ్యునిగా, ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాల ఏర్పాటుకు సహకరించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ ఫోటోను పెట్టుకున్నారు.
• తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్, ‘జై తెలంగాణ‘ అనే నినాదం వినగానే స్ఫూర్తిగా నిలిచే ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని కూడా పెట్టుకున్నారు.
• ఇక పచ్చని, పసిడి తెలంగాణ సాధనను తలపించేలా మొత్తం చిత్రానికి హైలైట్‌గా నిలిచే పిడికిళ్ళు, ఉద్యమ సన్నివేశం, యావన్మంది ప్రజలు రాష్ట్ర సాధనకు ఉద్యమంలో కలిసి నడిచిన ఫోటోను వాడారు.
• నుదుట కుంకుమను మహిళలు దిద్దిన ‘వీరతిలకం‘గా మాత్రమే కాక హిందువుల సెంటిమెంట్‌గా భావించేలా మెడలో ‘నీల్’, ఆకుపచ్చ రంగులు కలిసిపోయిన కండువాను ధరించి అటు బహుజనులకు, ఇటు రైతులకు ప్రతీకగా ఉంటుందనే తన ఫోటోను పెట్టుకున్నారు.
• సంప్రదాయ హిందుత్వాన్ని, పోరాటానికి స్ఫూర్తిగా ఉండే బిగించిన పిడికిలిని తెలంగాణ రాష్ట్ర చిత్రపటంలో పెట్టుకోవడం ద్వారా అన్ని సెక్షన్ల ప్రజలకు ప్రతినిధిగా ఉంటుందనే సందేశాన్ని ఇచ్చారు.
• ఆత్మగౌరవం మొదలు అమరుల స్ఫూర్తి వరకు అన్నింటినీ తన ప్రొఫైల్ పిక్చర్‌లో పెట్టుకున్న ఈటల రాజేందర్ తన భవిష్యత్ రాజకీయాలను కూడా ఈ స్ఫూర్తితోనే కొనసాగించాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.

తన ప్రొఫైల్ పిక్చర్‌లో ఎక్కడా గులాబీ రంగును, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed