- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల నరుక్కుంటానన్నావ్ కదా కేసీఆర్.. ఈటల సంచలన కామెంట్స్
దిశ, జమ్మికుంట : తెలంగాణ ఆవిర్భావం తరువాత దళితున్ని తొలి ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానన్న సీఎం కేసీఆర్.. ఐఏఎస్ ఆఫీసర్లను అవమానపరిచి చరిత్రకెక్కారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితునికి ఉప ముఖ్యమంత్రిని కట్టబెట్టినట్టే పెట్టి లాక్కున్నావంటూ మండిపడ్డారు. భూపాలపల్లి కలెక్టర్‌గా పనిచేసిన ఆకునూరి మురళీని అవమనించారని, చీఫ్ సెక్రటరీగా పని చేసి రిటైర్ అయిన ప్రదీప్ చంద్ర పదవి విరమణకు వెళ్లకుండా సీఎం కేసీఆర్ ఆయన్ను అవమానించారని, గతంలో చీఫ్ సెక్రటరీలకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చినా ఆయనకు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు.
అందరికీ ఇచ్చినట్టుగానే రాష్ట్రంలోని దళితులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి తప్ప.. ప్రత్యేకంగా ఏమీ లేవని గుర్తించే సబ్ ప్లాన్ నిధులను ఏర్పాటు చేశారని అన్నారు. అయితే, ఆ నిధులను సైతం మళ్లించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఈటల విమర్శించారు. దళితుల అభ్యున్నతి కోసం బీజేపీతో సహా అన్ని పార్టీలు పాటుపడాల్సిన అవసరం ఉందని ఈటల అభిప్రాయపడ్డారు.
దళితులపై ఇంతకాలం గుర్తుకు రాని ప్రేమ.. సడెన్‌గా సీఎంకు ఎందుకు పుట్టుకొచ్చిందో అంతు చిక్కడం లేదన్నారు. గతంలో దొరల నుంచి దళితులు పొందిన భూముల రికార్డుల్లో వారి పేర్లని ప్రక్షాళన సమయంలో వారి పేర్లు మాయం అయ్యాయని ఆరోపించారు. దళితులకు పాలించే నైపుణ్యం, తెలివి లేదని అవమాన పరిచారని తెలిపారు. రాష్ట్రంలో 16 శాతం ఎస్సీలుంటే, కేబినెట్‌లో ఆ వర్గం వాళ్లు ఎందరు మంత్రులున్నారని ప్రశ్నించారు.
నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందిద్దామంటే పట్టించుకోని సీఎం.. ఇప్పుడు ఎంజీఎం చుట్టూ తిరుగుతున్నాడన్నారు. నేను బయటకు వచ్చాక వరంగల్ ఎంజీఎంను సందర్శించి, కొన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ప్రకటించారన్నారు. హుజురాబాద్ ఎన్నిక కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి బయటకు పరుగులు పెట్టిస్తోందని, ప్రజల గురించి ఆలోచించి పనులు చేయాలన్న భయాన్ని పుట్టించిందన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే సీఎంఓలో ఒక్క దళిత అధికారైనా ఉన్నారా.? అని అడిగారు. కొందరు బానిసలు ఆయనకు బాకా ఊదుతున్న వారు.. ఏ జాతి వల్ల మీకు ఆ పదవి వచ్చిందో, ఆ జాతికి మీరు మోసం చేయొద్దని హితవు పలికారు.
దళిత ఎంపవర్‌మెంట్ పేరుతో మరోసారి ఆ జాతిని మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మూడు ఎకరాల పంపిణీ పథకం సాధ్యం కాదని అప్పట్లోనే మేం చెప్పాం. ఈ స్కీం కింద మీరు ఎంత మందికి భూమిని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి, హరీశ్ రావు లాంటి వాళ్లు నాపై మాట్లాడుతుంటే బాధేస్తోందన్నారు. గతంలో హరీశ్ రావు ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై వేసిన సబ్ కమిటీ నివేదిక ఏమైందో చెప్పాలన్నారు. కేసీఆర్ కలలు కన్నట్లు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారో వివరించాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్లలో మాత్రమే డబుల్ ఇళ్లు కట్టారు తప్ప, మిగతా ప్రాంతాలో ఆ ఊసే లేదని ఈటల అన్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక సొంత స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టుకునేందుకు సాయం చేస్తామని చెప్పిన మాట ఏమైందో చెప్పాలన్నారు. ప్రజలకు కుల సంఘాల భవనాలు ఇస్తామని, ఫించన్లు ఇస్తామని ప్రలోభాలకు పాల్పడుతూ అదే పనిగా మంత్రులు హుజురాబాద్‌లోనే తిరుగుతున్నారని విమర్శించారు.
ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాల్లో ఆ కుల సంఘాల భవనాలు వద్దా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్, హుజూర్ నగర్‌లో ఇచ్చిన హామీలు అమలయ్యాయా.. నా రాజీనామా తర్వాతనైనా రేషన్ కార్డులు, కొత్త ఫించన్లు వస్తాయని ఆశపడ్డా.. కానీ, అవి కూడా ఇవ్వలేదన్నారు.
ఒకే ఠాణాలో వందమందా..?
ఒక్కో పోలీసు స్టేషన్‌లో వంద మంది పోలీసులను నియమించారని, ఇంటలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు చట్టానికి లోబడి పనిచేస్తున్నడా లేక చుట్టానికి లోబడి పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదని ఈటల వ్యాఖ్యానించారు. వందల మంది ఇంటెలిజెన్స్ పోలీసులు ఊర్లలో తిరుగుతున్నారని, మాకు మద్ధతునిచ్చేవారిని ఈటల వెంట తిరగవద్దని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల సొమ్ముతో ఉద్యోగం చేస్తున్న పోలీసులు ఓ రాజకీయ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే ఉద్యోగాలు మానేసి వాళ్ల జెండాలు, చొక్కాలు తొడుక్కుని తిరగాలన్నారు.
మీరు పోలీసు స్టేషన్‌కు ఒక డీఎస్పీని పెట్టినా, వందల మందిని పోలీసులను నియమించినా ప్రజలు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని ఈటల స్పష్టం చేశారు. ప్రలోభాలను, అధికార దుర్వినియోగాన్ని ఓడించి మీకు బుద్ధి చెబుతారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు మీకు పంచితే తీసుకోండి. మీకు ఎవరికీ ఓటు వేయాలి అనిపిస్తే వారికే ఓటు వేయండని రాజేందర్ ప్రజలను కోరారు. యావత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపేలా హుజురాబాద్ ప్రజలు తీర్పునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ మొత్తం మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు.
ఈటల గెలిస్తేనే ఆత్మగౌరవం, ధర్మం గెలుస్తుందని ఇక్కడి ప్రజలకు ఇతర ప్రాంతాల్లోని బంధువులు ఫోన్ చేసి చెబుతున్నారని వివరించారు. నాకు నేనుగా ఇక్కడ ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదని, ఫ్లెక్సీల మీద, గోడల మీద మీ స్కీంలు రాసుకుంటున్నారు కానీ, నా పేరు హుజురాబాద్ ప్రజలు వారి హృదయాల్లో రాసుకున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. డబ్బు సంచులకు, ఆశలకు ఇక్కడి ప్రజలు లొంగరని, ఇక్కడ ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనన్నారు. ఎంత మంది కొట్లాడినా భంగపాటు తప్పదని, 2006లో కరీంనగర్‌లో కేసీఆర్ గెలిచినట్లుగా.. ఇప్పుడు నేను ఇక్కడ గెలవబోతున్నానని ఈటల స్పష్టం చేశారు.