బెడిసికొట్టిన గులాబీ వ్యూహాలు.. ఈటలకు రెడ్ కార్పెట్ వేసిన ఓటర్లు.!

by Anukaran |
బెడిసికొట్టిన గులాబీ వ్యూహాలు.. ఈటలకు రెడ్ కార్పెట్ వేసిన ఓటర్లు.!
X

దిశ, హుజురాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఈటలపై పన్నిన కుట్రలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈటలను టార్గెట్ చేస్తూ వైరల్ చేసిన ఫేక్ న్యూస్ ప్రభావాన్ని చూపలేదు. ఈటల లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు పన్నినా ఓటర్లు తిప్పికొట్టారు. హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె‌కు చెందిన ప్రవీణ్ యాదవ్ గుండెపోటుతో మృతి చెందగా ఆ నెపాన్ని ఈటలపై మోపేందుకు కుట్రలు పన్నారు. ఏడాది క్రితం ప్రవీణ్ యాదవ్ మరణించగా ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేశారు.

అదే గ్రామంలో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఈటలను ప్రవీణ్ కుటుంబ సభ్యులు అడ్డుకొని గొడవ చేశారు. అన్ని రకాలుగా ఈటల.. ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకున్నప్పటికీ టీఆర్ఎస్ నాయకులు పన్నిన వ్యూహంలో భాగంగా ఈటలను అడ్డుకోవడం టీఆర్ఎస్‌కు ఆ గ్రామంలో కొంత నష్టం కలుగజేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దళిత బంధు ఆపాలని ఎన్నికల సంఘానికి ఈటల ఫిర్యాదు చేశారని అధికార పార్టీ దళిత ఎమ్మెల్యేలు చేసిన రాద్దాంతం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దళితబంధు ఆపాలని ఈటల ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆ వ్యూహం కూడా బెడిసికొట్టింది. ఇది చాలదన్నట్లు సమాచార హక్కు చట్టం కింద ఎన్నికల కమిషన్ నుండి తీసుకున్నట్లు లేఖ వైరల్ చేయడం, ఈ సందర్భంగా స్పందించిన ఎన్నికల కమిషన్ ఫేక్ లేఖ సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పలేదు.

సానుభూతి కోసం ఈటల దంపతులు అక్టోబర్ 13న స్వయంగా దాడులు చేపించుంటారని మంత్రులు చేసిన గోబెల్స్ ప్రచారం విస్మయానికి గురిచేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వృద్దులకు లక్షల రూపాయలు నజరానాగా ఇచ్చి ఆత్మహత్యలకు పురిగొల్పుతారని చేసిన విషపు ప్రచారాలు బెడిసిగొట్టాయి. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసినా తర్వాత.. అక్టోబర్ 27న సాయంత్రం ఈటల సొమ్మసిల్లి పడిపోయి ఆసుపత్రిలో చేరుతారని పదే పదే చెప్పడం ప్రజలకు విసుగు తెప్పించింది. ఈటలను టార్గెట్ చేస్తూ స్థానికేతర ఎమ్మెల్యేలు చేసిన విషప్రచారాలను ప్రజలు ఓట్ల రూపంలో తిప్పి కొట్టారు.

Advertisement

Next Story