ఏపీలో రాక్షస పాలన సాగుతోంది

by srinivas |
ఏపీలో రాక్షస పాలన సాగుతోంది
X

దిశ, ఏపీ బ్యూరో :
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే దళిత యువకుడు ఇసుక మాఫియాకు చెందిన లారీలను అడ్డుకోవడంతో… స్థానిక వైఎస్ఆర్సీపీ నేత కృష్ణమూర్తి అక్కడికి చేరుకుని సదరు యువకుడిపై జులుం ప్రదర్శించారు. అంతేకాకుండా తన కారుతో వరప్రసాద్‌ను ఢీ కొట్టడంతో పాటు తన పరపతి ఉపయోగించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళి ఒళ్లు హూనమయ్యేలా పోలీసులతో కొట్టించి, గుండు గీయించడంతో పాటు మీసాలు కూడా కత్తిరించారు. తీవ్రగాయాలపాలైన యువకుడిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో వెదుళ్లపల్లిలోని బాధితుడి ఇంటికి వెళ్లి డీఎస్పీ విచారణ చేపట్టారు. ఆ వెంటనే సీతానగరం పీఎస్‌లోని ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పలువురు ప్రముఖులు ఘాటుగా స్పందించారు. అవి :

హర్షకుమార్ ఏమన్నారంటే…

సీతానగరం పీఎస్‌లో పోలీసులే వరప్రసాద్‌కు గుండు చేయటం అమానుషమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దీనికి బాధ్యులను చేస్తూ సీఐ, డీఎస్పీ, ఎస్పీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత కృష్ణమూర్తి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై 24 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఏమి చేస్తామో చేసి చూపిస్తామని హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే…

పోలీసుల సమక్షంలోనే వరప్రసాద్‌ను చితక్కొట్టి, గుండు కొట్టారని మండిపడ్డారు. ఓ దళితుడి ఆత్మగౌరవాన్ని దారుణాతిదారుణంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆటవిక పాలన మళ్లీ వచ్చిందని ఈ ఘటనతో తేటతెల్లమైందన్నారు.ఆ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించడమే వరప్రసాద్ చేసిన నేరమైందని ఆక్రోశించారు. “ఏపీలో పోలీసులకు ఏమైంది? అవినీతిపరులైన అధికార పక్ష నేతల చేతిలో వాళ్లు ఎందుకు కీలుబొమ్మలా మారారు? ఇది నిజంగా తీవ్రస్థాయిలో హక్కుల ఉల్లంఘనే. ఈ ఘటనలో వరప్రసాద్‌కు టీడీపీ అండగా ఉంటుంది. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా చూస్తాం” అంటూ చంద్రబాబు ట్వీట్లు చేశారు.

నారా లోకేశ్ ఏమన్నారంటే..

అధికార పార్టీ నాయ‌కుడి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ద‌ళిత యువకుడు వరప్రసాద్‌ను చిత్రహింసలకు గురి చేసి, పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేయడం ఘోరమని వ్యాఖ్యానించారు. అధికార‌పార్టీ నేత‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ ఇసుక మాఫియాని నిల‌దీసిన ద‌ళిత‌ యువ‌కుడిపై పోలీసులే గూండాల్లా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మాస్కు అడిగిన ద‌ళిత‌ డాక్టర్ సుధాకర్‌ని న‌డిరోడ్డులో బంధించి తీవ్రంగా హింసించి, పిచ్చోడిని చేసి చంపేయాల‌ని చూశారని వ్యాఖ్యానించారు. అవినీతికి సహకరించలేద‌ని ద‌ళిత‌ డాక్టర్ అనితారాణిని వేధించారని, ద‌ళిత న్యాయమూర్తి రామకృష్ణపై భౌతిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దళితుల‌కు జీవించే హ‌క్కు జ‌గ‌న్‌రెడ్డి రాజ్యంలో లేదా అని ఘాటుగా ప్రశ్నించారు.

దీనిపై డీజీపీ ఏమన్నారంటే..

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పీఎస్‌లో వరప్రసాద్ అనే దళితుడికి శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. ఘటన తీరుతెన్నులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. ఇటువంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed