- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పండుగొచ్చే.. పల్లె జనాలు పట్నం బాట పట్టే
దిశప్రతినిధి, మెదక్ : పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మకు మరింత ప్రాచుర్యం లభించడంతో మహిళలందరూ బతుకమ్మ పండుగపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికే పెద్ద పండుగగా చెప్పుకునే బతుకమ్మ, దసరా పండుగలకు కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు పల్లె జనం పట్నం బాట పట్టారు. దీంతో ఎప్పుడూ లేనంత గిరాకీ వస్త్ర దుకాణాల్లో కనిపిస్తోంది. అదే విధంగా బంగారు షాపుల్లోనూ జనం సందడి చేస్తున్నారు. పాఠశాలలకు సెలవులు రావడంతో పట్టణాల్లో నివసించే వారు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటికెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించడంటూ పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
పండుగ సందడి షురూ..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ, దసరా సంబురాలు గత వారం, పది రోజుల నుండే ప్రారంభమయ్యాయి. గతేడాది కరోనా కారణంగా చాలా మంది పండుగకు దూరమయ్యారు. ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టడం, చాలా మంది కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడంతో పండుగ జరుపుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బొడ్డెమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు పల్లెలు, పట్టణాల్లో కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు, ఐదో రోజు, ఏడో రోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి, చివరి రోజైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా పేర్కొంటూ పెద్ద బతుకమ్మను పేర్చి మహిళలందరూ మరింత సందడి చేయనున్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం సైతం తెలంగాణ మహిళలకు కానుకగా బతుకమ్మ చీరలను పంచిపెట్టింది.
జనంతో కిక్కిరిసిపోతున్న దుకాణాలు..
దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా కొత్త వస్త్రాలు కొనుగోలు చేసేందుకు జనాలు పట్నం బాట పట్టారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏ షాపులో చూసినా జనంతో కిక్కిరిసిపోతుంది. ఇసుకపోస్తే రాలనంత జనం పట్టణాల్లో కన్పిస్తున్నారు. ఏ వస్త్ర దుకాణం చూసినా జనంతో నిండిపోయి కన్పిస్తోంది. సీఎంఆర్, చెన్నయ్, మాంగళ్య లాంటి పెద్ద షాపులు ఆఫర్లు ప్రకటిస్తుండటంతో వాటిలో షాపింగ్ చేసేందుకు జనం బాగా ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా కొత్త నగలు చేయించుకునేందుకు సైతం ప్రజలు వెనుకాడటం లేదు. దీంతో ఏ బంగారు దుకాణం చూసినా కిక్కిరిసి కనిపిస్తోంది. కాగా, ఈ దుకాణాల్లో ఏ ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు.
రద్దీగా మారిన పట్టణాలు..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు గజ్వేల్, హుస్నాబాద్, నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట, పటాన్ చెరు లాంటి పట్టణాలు రద్దీగా మారాయి. పండుగ వేళ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. రోడ్డు వెడల్పుగా లేకపోవడం, షాపుల ముందు బైకులు, కార్ల పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో మరింత ట్రాఫిక్ పెరిగింది. దీన్ని నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పలు రోడ్లలో టూ వీలర్ బైకులకు మాత్రమే అనుమతిస్తూ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో పండుగ ఉండగా మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది.
ఊరెళ్తున్నారా..
పండుగల సందర్భంగా పట్టణం వీడి తమ సొంత ఊర్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వీరికి పోలీసు శాఖ తరపున పలు సూచనలు చేస్తున్నారు. ఊరికి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకూడదని, పక్కింటి వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని చెబుతున్నారు. వీలైతే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే మంచిదని, వీలైనంత వరకు త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా చూడాలని సూచిస్తున్నారు. రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తామని, ఇతర వివరాలకు డయల్ 100కు కాల్ చేయొచ్చని చెబుతున్నారు. పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా, ఆనందోత్సాహల మధ్య పండుగలు జరుపుకోవాలని పోలీసులు కాంక్షిస్తున్నారు.