- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పైసల్లేని పంచాయతీలు..!
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఓ చేత్తో ఇచ్చి.. ఇంకో చేత్తో లాక్కున్నట్లు’గా ఉంది పంచాయతీ నిధుల కథ. గ్రామాలకు నెలనెలా లక్షలు ఇస్తున్నామని, గతంలో నల్లా నీళ్ల మోటర్ల కోసమే లక్షల కరెంట్ బిల్లులు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు అసలే లేవంటూ ఊదరగొట్టే ప్రభుత్వం.. కరెంట్ బిల్లుల పేరుతోనే నిధులన్నీ లాక్కుంటోంది. గ్రామ పంచాయతీలకు ప్రతినెలా రూ. 309 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పుతున్నా.. అందులో ఒక్క రూపాయి కూడా గ్రామం కోసం వెచ్చించే అవకాశం దక్కడం లేదు. విద్యుత్ బిల్లులు, ఈఎంఐలు పోను చిల్లిగవ్వ మిగలకపోవడంతో వేతనాల కోసం మళ్లీ పన్నులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీల్లో పనులు చేసిన ప్రజాప్రతినిధులకు బిల్లులు రావడం లేదు. బిల్లులు రావడం లేదనే కారణంగా ఓ గ్రామ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన అంశం వివాదమైంది. రాజకీయాల్లో ఉండి గ్రామ సర్పంచ్లుగా ఎన్నికైన వారు కొంతమేరకు తట్టుకుంటున్నా.. తొలిసారి సర్పంచ్ అయిన వారు, మధ్య తరగతి వర్గాల నుంచి ఎన్నికైన వారు, మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
లక్షన్నర దాటుతున్న కరెంట్ బిల్లులు..
కారణాలేమైనా గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లులు రెండింతలయ్యాయి. గతంలో రూ. 60వేల నుంచి రూ. 70 వేలలోపు వచ్చే విద్యుత్ బిల్లులు ప్రస్తుతం రూ. లక్షన్నర దాటుతున్నాయి. ప్రతి పంచాయతీలో ఇదే పరిస్థితి. ఎందుకు పెరుగుతుందంటే సమాధానం చెప్పేవారు లేరు. కానీ ముందుగా కరెంట్ బిల్లులు చెల్లించిన తర్వాతనే పంచాయతీ నిధులను వాడుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ‘ప్రత్యేక’ నిబంధనలు పెట్టింది. నెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి ముందుగా విద్యుత్ బిల్లుల చెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు మిషన్ భగీరథతో నల్లా నీరు వస్తుందని, కరెంట్ మోటర్ల బిల్లులు తప్పుతాయని గొప్పలు చెప్పుకున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పాత పైపులైన్లకే కొత్తగా నల్లాలు బిగించిన వైనం ఓవైపు ఉంటే.. మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా కాకుండా ఇంకా బావుల ద్వారానే నీళ్లు సరఫరా చేస్తున్నారు. గ్రామాలు తవ్వించుకున్న బావుల నుంచి నీటిని ట్యాంకులకు ఎక్కించి మళ్లీ నల్లాలకు విడుదల చేస్తున్నారు. దీంతో నల్లాల బావుల మోటర్లు రోజులో ఐదారు గంటలు నిరంతరాయంగా నడువాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్ బిల్లులు గతంలో మాదిరిగానే యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఆ తర్వాతే మిగిలిన వాటికి
పంచాయతీలకు వచ్చే నిధుల్లో కొన్ని గ్రామాల్లో మొత్తం, మరికొన్ని గ్రామాల్లో 80 శాతం కరెంట్ బిల్లులకే పోతున్నాయి. ఇక మిగిలిన దాంట్లో ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. కొత్తగా ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనాలని ప్రభుత్వం నిబంధనలు విధించి బలవంతంగానైనా ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకు, చదువును చేసే యంత్రం ఇలా అన్నింటినీ కొన్నారు. దీంతో ట్రాక్టర్ల ఈఎంఐలతో పాటుగా డీజిల్ బిల్లులు తడిసిమోపడవుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఇవి కూడా భారమవుతున్నాయి. కొన్నిచోట్ల డీజిల్ కోసం అప్పులు తీసుకువస్తున్నారు. పంచాయతీల నుంచి బిల్లులు రావడం లేదనే కారణంగా కొన్నిచోట్ల బంకుల్లో డీజిల్ పోయడం నిలిపివేశారు.
జీతాలెట్ల…?
కొత్త చట్టాన్ని రూపొందించి 12,751 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పంచాయతీల్లో మల్టీపర్పస్ ఎంప్లాయిస్గా కార్మికులను మార్చారు. కొన్నిచోట్ల కొత్త వారిని నియమించుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 8,500 వేతనంగా నిర్ధారించారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనాల కోసం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచే వేతనాలను ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇచ్చే పంచాయతీల నిధుల నుంచి రూపాయి మిగలడం లేదు. దీంతో నెలనెలా వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితే. కొన్నిచోట్ల పన్నులు వసూలైతే ఎలాగో అడ్జెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రతినెలా వసూలు కావడం ఇబ్బందికరంగానే మారింది.
స్పెషల్ ఫండ్.. ఓన్లీ పేపర్ పర్పస్
ఇక జిల్లా కలెక్టర్లకు విడుదల చేసే స్పెషల్ ఫండ్ కేవలం బడ్జెట్ కాగితాల కోసమే ఇస్తున్నారు. కేవలం కలెక్టర్లకు విడుదల చేసి వెంటనే తిరిగి తీసుకుంటున్నారు. తాజాగా రూ. 84కోట్లు కలెక్టర్లకు విడుదలయ్యాయి. అయితే వీటిని గ్రామాల కోసం వినియోగించేందుకు చాలా జిల్లాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికే చాలా పంచాయతీల్లో నిధుల కొరత స్పష్టమైంది. కానీ ఉదయం ఇచ్చినట్టే ఇచ్చిన ప్రభుత్వం.. మధ్యాహ్నానికే తిరిగి తీసుకుంది. ఈ నిధులు వచ్చినట్టు తెలుసుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కలెక్టర్ను రిక్వెస్ట్ చేశారు. ఉదయం స్పెషల్ ఫండ్స్ వచ్చాయని, కొంత తాము చెప్పిన పనులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. అప్పటికే ప్రభుత్వం తిరిగి తీసుకుందని చెప్పడంతో సదరు మంత్రి అవాక్కయ్యారు. అసలు ఇచ్చింది, తీసుకున్నారనే విషయం తెలియకుండానే నిధులు వెళ్లిపోయాయంటూ పలువురు సర్పంచ్ల ఎదుట మంత్రి వాపోయారు.
మమ్మల్ని చావమంటారా..?
‘ప్రజాసేవలో తరించేందుకు చాలా ఆశలతో ముందుకు వచ్చాం. మా గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని రాత్రింబవళ్లు శ్రమించాం. బిల్లులు రాకున్నా లక్షల అప్పులు చేసి పనులు చేశాం. పనులు పూర్తయి పాతబడిపోతున్నాయి. కానీ రూపాయి రావడం లేదు. బిల్లు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న జాబితాలో మా పేర్లు రాకుండా చూడాలని మా విజ్ఞప్తి’ అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కిష్టగూడెం సర్పంచ్లోనే భవానీ రాసిన బహిరంగ లేఖ అధికారులను సైతం కదిలించింది. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీలు, డస్ట్బిన్ల కోసం లక్షలు వెచ్చించామని, ఆ నిధులు.. ఈ నిధులు వస్తాయంటూ చెప్పుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రూపాయి ఇప్పించడం లేదనే ఆరోపణలు చేశారు. ఇది కేవలం ఒక్క సర్పంచ్ వేదన కాదు… రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గాల మనోవేధన.