PhotoOfTheDay: డీఐజీ తండ్రికి సెల్యూట్ చేసిన డీఎస్పీ డాటర్!

by Shyam |
PhotoOfTheDay: డీఐజీ తండ్రికి సెల్యూట్ చేసిన డీఎస్పీ డాటర్!
X

దిశ, ఫీచర్స్: ఏతల్లిదండ్రులకైనా పిల్లలు ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా చూపకుండా ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారనే విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది. ఈ క్రమంలోనే ఇటీవల యూపీ పోలీస్ డీఎస్పీగా నియమితులైన అపేక్ష నింబాడియా ఐటీబీపీలో డీఐజీగా పనిచేస్తున్న తన తండ్రి ఐపీఎస్ నింబాడియాకు సెల్యూట్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను హత్తుకుంది.

మొరాదాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోలీస్ అకాడమీలో పాసింగ్-అవుట్ పరేడ్ జరగ్గా అపేక్ష నింబాడియా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. అనంతరం ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP)లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న తన తండ్రి నింబాడియాకు సెల్యూట్ చేసింది. ఈ భావోద్వేగ క్షణాలను క్యాప్చర్ చేసిన పోలీసు బృందం.. ఆ ఫొటోను ‘ప్రౌడ్ ఫాదర్ గెట్టింగ్ సెల్యూట్ ఫ్రమ్ ప్రౌడ్ డాటర్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక నింబాడియా కుటుంబంలో అతడు మూడో తరం పోలీసు అధికారి కాగా నాలుగో తరంకు చెందిన అపేక్ష ఉత్తరప్రదేశ్‌లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా చేరనున్నారు.

ఇక ఇలాంటి సన్నివేశమే ఆంధ్రప్రదేశ్‌‌లో 2018 జనవరిలో వైరల్ అయిన విషయం తెలిసిందే. 2018 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పీగా బాధ్యతలు నిర్వరిస్తుండగా.. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌‌ అయిన జెస్సీ తండ్రి శ్యామ్ సుందర్ తిరుపతిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్‌‌లో కూతురికి సెల్యూట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. తండ్రిని మించిన తనయగా ప్రశంసలు పొందింది.

Advertisement

Next Story