కేటీఆర్ నియోజకవర్గంలో బానిసలవుతున్న యువత

by Anukaran |   ( Updated:2021-03-01 11:45:06.0  )
కేటీఆర్ నియోజకవర్గంలో బానిసలవుతున్న యువత
X

దిశ, సిరిసిల్ల: మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్‌ నియోజకవర్గం(సిరిసిల్ల)లో డ్రగ్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గంజాయి, బ్రౌన్‌ షుగర్‌, హెరాయిన్‌, కొకైన్‌ తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థి దశలోనే గాడి తప్పుతూ డ్రగ్స్‌ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటోంది. మానసిక బలహీనత, ఉరికే యవ్వనం.. ఇలా అనేక కారణాలతో కొందరు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారు. ఈ మాదక ద్రవ్యాలకు చాలామంది ఇంజినీరింగ్‌, డిగ్రీ, మెడిసిన్ స్టూడెంట్లు అలవాటు పడుతున్నారు. డబ్బుకు ఆశపడి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న యువకులు ఎందరో ఉన్నారు. గంజాయి, బ్రౌన్‌ షుగర్‌, హెరాయిన్‌, కొకైన్‌ తదితర మాదకద్రవ్యాలు ఒక్కసారి వినియోగిస్తే మళ్లీ మళ్లీ వాడాలనిపిస్తుంది.

వినియోగం.. రవాణా

పేదరికం ఒకవైపు అయితే, లగ్జరీ, జల్సాలకు అలవాటు పడిన యువత మరోవైపు ఇలా అవసరాలు కలిగిన యువతనే స్మగ్లర్లు టార్గెట్‌ చేస్తున్నారు. డబ్బుల ఆశ చూపిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్‌లోకి యువతను దింపేస్తున్నారు. ఒక వైపు మత్తు పదార్థాలను వినియోగిస్తూ, మరోవైపు విక్రయాలు చేస్తూ యువత రెండు రకాలుగా మత్తు వలలో చిక్కుకుంటున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న స్మగ్లర్లు సాగు చేసిన గంజాయిని అనేక రూపాల్లో రకరకాల మార్గాల ద్వారా జిల్లాకు చేర్చి యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీటితో పాటు మత్తు మాత్రలు, మత్తు ఇంజెక్షన్‌లకు యువత అలవాటు పడుతోంది. డ్రగ్స్‌ను హైదరాబాద్, ముంబయి, గోవా, బెంగుళూరు వంటి నగరాల నుంచి రహస్యంగా తీసుకొచ్చి ఇక్కడ చదువుకుంటున్న స్థానిక విద్యార్థులకు విక్రయిస్తున్నారు.

రహస్యంగా..

చాపకింద నీరులా మరింత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు విషపు కోరలు చాస్తున్నాయి. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ తతంగం జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ తదితర మండలాలకు కూడా పాకిందని చెప్తున్నారు. గంజాయి కంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో సంపన్న వర్గాల పిల్లలు వీటికి అలవాటు పడుతున్నారు.

కొకైన్, బ్రౌన్ షుగర్..

కొకైన్, బ్రౌన్ షుగర్,హెరాయిన్ వంటి డ్రగ్స్ గంజాయి కంటే ప్రమాదకరమైనవి. ఇప్పుడిప్పుడే జిల్లాకు చేరుతున్నట్లు తెలుస్తోంది. వీటిని సులభంగా రవాణా చేయవచ్చు. వాడుక పదంగా చెప్పాలంటే గోరంత పదార్థం పది గంటల మైకాన్ని ఇస్తుంది. వీటిని గోవా, ముంబాయి, హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల నుంచి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

మత్తుకు బానిసలుగా..

సరదా కోసం, ఫ్యాషన్‌, మోజు, స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తు పదార్థాల వినియోగానికి అలవాటు పడుతున్నారు. సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తు మందు వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియోగించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం బానిసగా మార్చేస్తోంది. చివరకు మత్తు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. వాటిని సమకూర్చుకోడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లో మత్తుకు బానిసైన యువకులకు మత్తు పదార్థాలను సప్లై చేసే పనిలో స్మగ్లర్లు నిమగ్నమయ్యారు. మత్తు పదార్థాలను సరఫరా చేసేందుకు ఒక పెద్ద వ్యవస్థనే స్మగ్లర్లు తయారు చేసుకున్నారు. గంజాయిని సిగరెట్‌లలో, చిన్న చిన్న ప్యాకెట్లుగాను తయారు చేసి సరఫరా చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed