జులై చివరి కల్లా అన్ని గ్రామాలకు..

by Shyam |
జులై చివరి కల్లా అన్ని గ్రామాలకు..
X

దిశ, నల్లగొండ: జులై 30 నాటికి నల్లగొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు. ఇప్పటికే 90 శాతం గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయన్నారు. రెండు నెలల వ్యవధిలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మిషన్ భగీరథ పురోగతిపై బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. రూ.40,123 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మక మైందన్నారు. ఏడు దశాబ్దాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి పాలకులు తాగు నీటి కోసం రూ.590 కోట్లు ఖర్చు పెడితే కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలో ఒక్క నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ పథకం కింద రూ.2,950కోట్లు ఖర్చు పెట్టి సురక్షితమైన నీరు అందించిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని కొనియాడారు. నల్లగొండ జిల్లాలోని 33 మండలాలకు 1536 ఓహెచ్ఎస్‌ఆర్లు మంజూరు కాగా 1509 ఇప్పటికే నిర్మించామని, మిగతా 27 ట్యాంకులు త్వరితగతిన పూర్తి చేయ్యాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు.

సర్పంచ్‌లు సంతకాలు పెట్టొద్దు: జగదీశ్ రెడ్డి

మిషన్ భగీరథ పనులు పూర్తి కాకముందే సర్పంచ్‌లు పూర్తి అయినట్లు సంతకాలు పెట్టకూడదని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూచించారు. మిషన్ భగీరథ పథకం పుట్టింది మునుగోడులో ఫ్లోరిన్‌ను నిరోధించడం కోసమేనన్నారు. సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్.రవీంద్ర కుమార్, నోముల నరసింహామయ్య, ఎన్.భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed