కరోనాపై డాక్టర్ ఇక్బాల్‌తో ఇంటర్వ్యూ..

by sudharani |   ( Updated:2020-03-17 08:22:41.0  )
కరోనాపై డాక్టర్ ఇక్బాల్‌తో ఇంటర్వ్యూ..
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఇప్పుడు దేశమంతటా కరోనా మాటే వినిపిస్తోంది. ప్రజలు స్వీయ నియంత్రణచర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నాయి. ఈ కారణంగా వ్యాధివ్యాప్తి అదుపులో ఉంది. కరోనా మాట వినగానే కొద్దిమంది బెంబేలెత్తుతున్నారు. మరికొద్దిమంది జాగ్రత్తలు తీసుకున్నామనే ధీమాతో ఉన్నారు. కానీ, ఈ వ్యాధి సోకిన పేషెంట్లు, వారి కుటుంబసభ్యుల పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంటోంది. కుటుంబసభ్యులు సహా బంధువులు, ఇరుగుపొరుగువారి నుంచి ఎదురయ్యే అనుభవాలు ఆ పేషెంట్లను ఒకింత ఆత్మన్యూనతకు గురిచేస్తోంది. పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు తదితర వైద్య సిబ్బందికి ఎన్ని సవాళ్ళు ఉన్నా అవి పెద్దగా వెలుగులోకి రావడంలేదు. వారి కృషి ఎప్పుడూ తెరవెనకగానే ఉండిపోతోంది. కరోనా పేషెంట్ అంటే వణికిపోయే పరిస్థితుల్లోనూ వారికి సన్నిహితంగా మెలుగుతూ చికిత్స చేస్తున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్‌ విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ ‘దిశ’తో తన అనుభవాలు పంచుకున్నారు.

చికిత్స క్రమంలో వైద్యసిబ్బందికి ఎదురయ్యే సవాళ్ళు

‘ఒకప్పుడు హెచ్ఐవి పాజిటివ్. ఆ తర్వాత స్వైన్ ఫ్లూ. ఇప్పుడు కరోనా. ఇలాంటివన్నీ ప్రజల్లో భయం కంటే ఆందోళనలు ఒకస్థాయి దాకా తీసుకెళ్ళాయి. దాంతోపాటే స్వీయ జాగ్రత్తలు పాటించే అవగాహనను పెంచాయి. ఇప్పుడు కరోనా మాట వినిపిస్తోంది. నిజానికి భయపడాల్సినంత పరిస్థితి ఇండియాలో లేదు. జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. ప్రజల్లో ఆందోళన ఉండడం, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుండడంతో దేశమంతా ఒక ప్రత్యేకమైన మానసిక వాతావరణం నెలకొంది. కరోనా పాజిటివ్ పేషెంట్‌కు చికిత్స చేసే సమయంలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న పారామెడికల్ సిబ్బందికి చాలా సవాళ్ళు ఉన్నాయి. వీరు కూడా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే వీరికి కూడా ఆ వ్యాధి లక్షణాలు సోకే ప్రమాదం ఉంది. కానీ, సంపూర్ణ అవగాహనతో ఉన్నందున చికిత్స చేసే మెడికల్ సిబ్బందికి ఇన్‌ఫెక్షన్ రావడం చాలా అరుదు’.

ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు..

పేషెంట్‌కు చికిత్స చేసే క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలపై నర్సులకు స్పష్టత ఉంటుంది. ఇప్పుడు కరోనా విషయంలోనూ డాక్టర్లు సంపూర్ణ అవగాహన కలిగించారు. ఎలాంటి స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలో స్పష్టత ఏర్పడింది. మాస్కులు, గ్లౌజులు లాంటివే కాకుండా పేషెంట్‌ దగ్గరకు వెళ్ళేముందు, వచ్చిన తర్వాత ఎలాంటి శుభ్రతా చర్యలు పాటించాలో వివరించాం. ఏ తీరులో ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశముందో అర్థం చేయించాం. ఆ చర్యలన్నీ నర్సులు పాటిస్తున్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు ఒక సీనియర్ నర్సును ‘ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ హెడ్’గా నియమించింది ప్రభుత్వం. పేషెంట్ ఉండే గదికి ఎవరు ఎప్పుడు వెళ్ళాలి, ఇతరులను ఎలా నియంత్రించాలి లాంటి అంశాలన్నింటినీ ఈ హెడ్ పర్యవేక్షిస్తారు. మరోవైపు నర్సుల్లో మానసిక స్థైర్యాన్ని కల్పించడానికి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. అందుకే ఇలాంటి లక్షణాలతో వచ్చినవారికి, పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేసినా నర్సులు మాత్రం ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా చూసుకోగలిగారు.

నర్సుల్లో ఎలాంటి ట్రామా ఉంటుందంటే..

‘కరోనా పాజిటివ్ పేషెంట్‌కు చికిత్స చేయడానికి డాక్టర్లు సిద్ధపడక తప్పదు. అది వారి బాధ్యత కూడా. డాక్టర్లే చేతులెత్తేస్తే పరిస్థితి అదుపు తప్పుతుంది. అయితే డాక్టర్లకు ఉన్నంత అవగాహన, చైతన్యం చాలా మంది నర్సుల్లో ఉండదు. అందుకే పాజిటివ్ పేషెంట్‌కు చికిత్స చేయడానికి చాలా మంది నర్సులు సంసిద్ధం కారు. ఒకింత భయమూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్లుగా మేమే వారికి అవగాహన కల్పించి మానసికంగా సిద్ధం చేస్తుంటాం. డాక్టర్ సూచనల మేరకు వైద్యం చేసే నర్సులు ఆ పేషెంట్‌తో సన్నిహితంగా ఉండక తప్పదు. ఆ సమయంలో ఇన్‌ఫెక్షన్ సోకుతుందేమోననే భయం నర్సుల్ని వెంటాడుతూ ఉంటుంది. అయినా ఇప్పుడు చాలా మంది నర్సులు మానసికంగా చాలా ధైర్యంగానే ఉన్నారు. సహజంగా అందరిలో ఉంటే ఒక రకమైన అపోహ, ఆందోళన, భయం నర్సుల్లోనూ ఉంటుంది’.

చికిత్సలో ఒంటరిగా ఉండే పేషెంట్ మానసిక స్థితి

‘చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్ ఆ గదిలో ఒంటరిగానే ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే పరిస్థితి ఉండదు. బంధువులు రారు. అవసరమైతే తప్ప వైద్య సిబ్బంది కూడా కంటికి కనిపించేంత దగ్గరలో ఉండరు. ఆ ఒంటరితనంతో పేషెంట్‌లో రకరకాల ఆలోచనలు కలుగుతుంటాయి. వాటిని పంచుకోడానికి పక్కన ఎవ్వరూ ఉండరు. ఏకంగా రెండు వారాలపాటు కేవలం నాలుగు గోడల గదికే పరిమితమై ఉంటారు. ఒక పక్కన వారి మానసిక స్థితిని తెలుసుకుంటూనే మరోపక్క వ్యాధికి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ సోకుతుందేమోననే ఆందోళన (ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ) ఒకవైపు, పేషెంట్ మానసిక స్థితికి తగినట్లుగా వారికి ధైర్యం చెప్పే బాధ్యత మరోవైపు నర్సులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఒక సైకియాట్రిస్ట్‌తో కూడా పేషెంట్‌కు కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరం. ఏకకాలంలో వ్యాధికి చికిత్స, సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది.

డాక్టర్ల, నర్సుల కృషికి గుర్తింపేది?

అనేక సవాళ్ళ నడుమ కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్ల, నర్సుల కృషి ఎప్పుడూ తెర వెనకగానే ఉండిపోతుంది. ఫలానా వ్యక్తి చికిత్స అనంతరం నెగెటివ్ లక్షణాలతో డిశ్చార్జి అయ్యారు అని వార్తలు చూస్తుంటాం. కానీ, ఆ చికిత్స చేసిన డాక్టర్లుగానీ, నర్సులుగానీ సమాజానికి తెలియని ‘అన్ సంగ్ హీరో’లుగానే మిగిలిపోతారు. చికిత్సచేసే నర్సు ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుటుంబ సభ్యులకు సోకుతుందేమోననే భయం ఎప్పుడూ ఉంటుంది. రాకుండా జాగ్రత్తలూ తీసుకుంటారు. సమాజం కోసం ఇంత కృషి చేసినా వారికి ఎలాంటి గుర్తింపూ లభించదు. నిజానికి అలాంటి గుర్తింపు ఒక్కోసారి వారికి చేటు కూడా తెస్తుంది. నిజానికి కరోనా పాజిటివ్ పేషెంట్‌కు చికిత్స చేసే నర్సు లేదా డాక్టర్ పేరు బైటకు వస్తే బంధువులు, ఇరుగుపొరుగువారు కనీసంగా కూడా మాట్లాడరు. దూరంగా పెట్టేస్తారు. అందుకే వారి వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు అవసరం. డాక్టర్ల, నర్సుల వృత్తిధర్మం ఎప్పుడూ ‘థాంక్‌లెస్ జాబ్’గానే ఉండిపోతుంది.

tags : Dr. Asif Iqbal, Corona virus, Nurses, Awareness, Treatment, Corona Positive Patients, Psychiatrist, Family members

Advertisement

Next Story

Most Viewed