రాహుల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలి: డీపీసీసీ

by Shamantha N |
Rahul Gandhi
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ వెంటనే బాధ్యతలు తీసుకోవాలని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మోడీ ప్రభుత్వ దుశ్చర్యలను ఆయన సమర్థవంతంగా వెలికి తీస్తున్నారని, ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారని తెలిపింది. ప్రస్తుత సమయంలో ఆయన వెంటనే పార్టీపగ్గాలను మళ్లీ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సమీక్షించడానికి డీపీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆదివారం సీనియర్ పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. శక్తి సిన్హా గోహిల్, జగదీశ్ టైట్లర్, రమేశ్ కుమార్, కృష్ణ తీరథ్, డాక్టర్ నరేంద్ర నాథ్, డాక్టర్ యోగానంద్ శాస్త్రి, డాక్టర్ కిరణ్ వాలియా, హరూన్ యూసుఫ్‌లు సహా పలువురు హాజరైన ఈ భేటీలో మూడు తీర్మానాలు ఏకగ్రీవంగా తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సమర్థవంతంగా పోరాడుతున్నారని, ఆయన కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాల్సిన సమయం ఆసన్నమైందని అనిల్ కుమార్ తెలిపారు. ఆయన సారథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ తప్పుడు ఆలోచనలు ఎండగట్టడానికి నైతికంగా బలం చేకూరుతుందని వివరించారు. దేశంలో నెలకొన్న ప్రమాదకర విద్వేష, అప్రజాస్వామిక, మతోన్మాద శక్తులను ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. రైతుల ఆందోళనల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు సరిగా నడుచుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ కారణంతోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మరో రెండు తీర్మానాలను చేశారు.

Advertisement

Next Story

Most Viewed