భయం వద్దు… జాగ్రత్తే ముద్దు

by Sridhar Babu |
భయం వద్దు… జాగ్రత్తే ముద్దు
X

దిశ, కరీంనగర్: కరోనా విషయంలో ప్రజలు భయం నుండి బయటకు రావాలి తప్ప, స్వేచ్ఛగా రోడ్లపై తిరగడం సరికాదంటున్నారు వైద్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ నుండి కరీంనగర్ విముక్తి అవుతుందని చెప్పడం ప్రజల్లో ధైర్యం నూరిపోయడానికే కానీ, లాక్‌డౌన్‌‌ను పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరగవద్దని అంటున్నారు. కరోనా పూర్తిగా తగ్గలేదని, తగ్గుముఖం మాత్రమే పట్టిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. భవిష్యత్తులో కరోనా ప్రబలకుండా ఉండాలన్న సంకల్పంతోనే కేంద్ర, రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయని, ఎప్పటివరకు స్వీయ నిర్భందంలో ఉండాలని సూచిస్తాయో అప్పటి వరకు ఉండాల్సిందే. లేకుంటే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు లేకపోలేదు.

కరోనా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియన్ మత ప్రచారకులు 10మందికి, మరో స్థానికుడికి ఈ వ్యాధి సోకింది. అయితే జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఇండోనేషియా దేశస్థులు తిరిగిన ప్రాంతాన్ని గుర్తించి రెడ్‌జోన్‌గా ప్రకటించడమే కాకుండా వైద్య పరీక్షలు చేయించారు. అయితే కరీంనగర్‌లో చాలా తక్కువ ప్రాంతమే రెడ్‌జోన్‌గా గుర్తించబడ్డప్పటికీ నగరం అంతా కరోనా వ్యాప్తి చెందిందన్న భావనకు ఇతర ప్రాంతాల వాసులు వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవల్సిన అవసరం ఉంది.

వైద్యులు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తుంది కానీ ప్రజలు తమ వద్ద కరోనా లేదు కదా అని మొండిగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూ సోషల్ డిస్ట్రబెన్స్ లేకుండా చూసుకోవల్సిన అవసరం ప్రతి పౌరునిపై ఉంది. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మన దేశ పరిస్థితి ఎలా ఉండనుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు అన్ని దేశాలు కూడా భారతదేశంలో చేపట్టిన చర్యలపై చర్చలు జరిపి సక్సెస్ మంత్రం గురించి జపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే మరిన్ని రోజులు జిల్లా వాసులు సెల్ఫ్ కర్ఫ్యూ పాటించాల్సిందే.

Tags: Corona Virus, Karimnagar, Indians, Evangelists, Native Social Distance, Doctors, Experts, Precautions

Advertisement

Next Story

Most Viewed