బట్టబయలైన కేసీఆర్ సర్కార్ అసలు బండారం

by Anukaran |   ( Updated:2021-12-04 21:22:00.0  )
బట్టబయలైన కేసీఆర్ సర్కార్ అసలు బండారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఏకంగా 20 లక్షలు దాటిందా? ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయా? అంటే ప్రభుత్వ అంతర్గత రిపోర్టులు గమనిస్తే నమ్మక తప్పడం లేదు. ఒమిక్రాన్ ​నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతపై ఆరోగ్యశాఖ ఇటీవల ప్రభుత్వానికి ఓ స్పెషల్​ నివేదికను అందజేసింది. దీన్ని పరిశీలిస్తే విస్తుబోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఏకంగా 20,78,151 దాటినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. 2 మార్చి 2020 నుంచి ఈ ఏడాది నవంబరు 26 వరకు ఈ సంఖ్యకు చేరుకున్నట్లు పొందుపరిచారు. వీటిలో 2 మార్చి 2020 నుంచి 2 ఫిబ్రవరి 2021 వరకు జరిగిన ఫస్ట్​వేవ్​లో 7,45,635 కేసులు, 3 మార్చి 2021 నుంచి 26 నవంబరు 2021 వరకు వచ్చిన సెకండ్​వేవ్​లో ఏకంగా 13,32,516 కేసులు తేలాయి. వీటిలో ఒక రోజులో అత్యధికంగా సెకండ్​ వేవ్​ సమయంలో 20 ఏప్రిల్​ 2021న భారీ స్థాయిలో 24,959 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఫస్ట్​ వేవ్​ టైంలో 31 ఆగస్టు 2020లో 10,628 కేసులు రికార్డు అయినట్లు వైద్యారోగ్య సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ఫస్ట్ వేవ్‌లో 8.54 శాతం పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవగా, సెకండ్‌ వేవ్‌లో 6.75 శాతం పాజిటివ్ రేటు నమోదైంది.

అధికారికంగా ‘6’ లక్షలకు పైనే…

రాష్ట్రంలో కరోనా లెక్కలపై మొదట్నుంచి అనుమానాలే ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రతీ రోజూ విడుదల చేసే బులెటెన్​లకు, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో తేడా స్పష్టంగా కనిపించింది. దీంతో పాటు మరణాలల్లోనూ పొంతన లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కేసులు నమోదైనా, హెల్త్​బులెటెన్​లో ఇప్పటి వరకు కేవలం 6.76 లక్షలే తేలినట్లు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ నివేదికలను పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వం కరోనా లెక్కలను గోప్యంగా ఉంచుతున్నట్లు నొక్కి చెప్పడంలో ఎలాంటి సందేహం చెందాల్సిన అవసరం లేదు. దీంతో పాటు కరోనా డెత్​లను కూడా దాచిపెట్టినట్లు గతంలో వచ్చిన ఆరోపణలకూ ఈ నివేదికలు బలం చేకూర్చాయి. డెత్​ వివరాలను రిపోర్టులో పొందుపరచకపోయినా, డెత్​లు కూడా భారీగా నమోదైనట్లు అధికారులు ఆఫ్​ది రికార్డులో చెబుతున్నారు.

ఎందుకు ఇలా..?

రాష్ట్ర ప్రభుత్వం కరోనా లెక్కలు ఎందుకు దాస్తుందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. కేసుల సంఖ్య తక్కువ చూపితే ప్రజలు భయాందోళన చెందరనే ఉద్దేశ్యంతో కేసులు తగ్గిస్తున్నట్లు అధికారులు చెప్తున్నా, ప్రజలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్నట్లు మరిచిపోతున్నారు. గతంలో కేసులు, డెత్​లలో తప్పులు చెబుతున్నారంటూ కొన్ని రాజకీయ పార్టీలు కోర్టు మెట్లు తొక్కినా, నిజాలు బయటకు రాకుండా సర్కార్​ జాగ్రత్తలు తీసుకున్నది. మొదటి, సెకండ్​ వేవ్​ పరిస్థితులను గమనించిన కోర్టుకు కూడా కేసులపై అనుమానాలున్నా, ప్రభుత్వం సమర్పించే రిపోర్టులను చూసి ఏం చేయలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. దీంతో చేసేదేమీ లేక అధికారులు పేర్కొన్న రిపోర్టులు ఆధారంగా సలహాలు, సూచనలు ఇస్తూ వెళ్లడం గమనార్హం.

మనమే బెటర్​…

కరోనా కట్టడిలో మనమే బెటర్​ అంటూ సర్కార్​ లెక్కలు తప్పులు చూపుతూ మొదట్నుంచి ప్రజలను మోసం చేస్తున్నది. ఏ దేశంలో లేని విధంగా ట్రీపుల్​ టీ(ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీట్​మెంట్​)ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలను బురిడీ కొట్టించింది. ఇలా కేసులు తక్కువగా చూపుతూ గొప్పలు చెబుతున్నదంటూ ఆరోపణలు ఉన్నాప్పటికీ, బలంగా నమ్మేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. దీంతో ప్రభుత్వం చెప్పిందే ప్రజలు నమ్ముతూ రావడం గమనార్హం. కానీ అసలు విషయాలు మాత్రం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, సర్కార్​కు స్పష్టంగా తెలుసని ప్రభుత్వ అంతర్గత నివేదికలు గమనిస్తే అర్థం అవుతున్నది.

ఆరు రాష్ట్రాల్లో 20 లక్షలకు పైగా..

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 50 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే 20 లక్షలకుపైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోన్నది.

కొత్తగా మరో 12 సెంటర్లు.. వైద్యశాఖ కీలక నిర్ణయం

Advertisement

Next Story