డెలివరీ చేయమంటే నిద్ర చెడగొట్టొద్దన్న సిబ్బంది.. నిర్లక్ష్యంతో పసికందు మృతి

by Sumithra |
డెలివరీ చేయమంటే నిద్ర చెడగొట్టొద్దన్న సిబ్బంది.. నిర్లక్ష్యంతో పసికందు మృతి
X

దిశ, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటోంది. పేదలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో పేషెంట్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ సమయంలో పలువురు వైద్య సిబ్బంది మాత్రం తీరు మార్చుకోవడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు నిలిపే హాస్పిటల్స్‌లోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇటువంటి ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పసికందు మరణించిందని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు బాధితులు శనివారం ఆందోళన నిర్వహించారు.

బాధితుల వివరాల ప్రకారం..

ఆత్మకూర్(ఎస్) మండలం తెట్టే కుంట తండాకు చెందిన భూక్య నీరజ(గిరిజనురాలు) ప్రసవం కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా ఆస్పత్రిలో చేరింది. అర్ధరాత్రి నీరజకు నొప్పులు వస్తున్నాయని బాధితులు హాస్పిటల్ సిబ్బంది దగ్గరికి వెళ్లి చెప్పగా.. రేపు చూసుకుందాం పో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా.. మా నిద్ర చెడగొట్టొద్దు అంటూ బదులిచ్చారని వాపోయారు. దీంతో చేసేదేమీలేక నీరజ రాత్రి మొత్తం ఏడ్చుకుంటూ పురిటి నొప్పులు భరించలేక బాధపడుతున్నప్పటికీ, ఆ సిబ్బందికి కనికరం కలగలేదు. మొద్దు నిద్ర కూడా వీడలేదు. అడ్మిట్‌ అయిన 24 గంటల తర్వాత (శనివారం తెల్లవారుజామున) ఆపరేషన్ చేయడంతో బాబు మృతి చెందాడు. బాబు చావుకి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆందోళన చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed