ఈ ఏడాది 80 కోట్ల చేప పిల్లల పంపిణీ !

by Shyam |
ఈ ఏడాది 80 కోట్ల చేప పిల్లల పంపిణీ !
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది రూ. 50కోట్ల ఖర్చుతో 80కోట్ల చేప పిల్లలను నీటి వనరులలో విడుదల చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే 57కోట్ల చేప పిల్లలను విడుదల చేశామని వివరించారు. 2016-17లో 3,939 నీటి వనరులలో 27.85 లక్షల చేప పిల్లలు విడుదల చేయగా 1.93లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందన్నారు.

2017-18లో 11,067 నీటి వనరులలో 51కోట్ల చేప పిల్లలు విడుదల చేయగా 2.62లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని, 2018-19 సంవత్సరంలో 10,772 నీటి వనరులలో 49 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తే 2.84 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందన్నారు. 2019-20 సంవత్సరంలో 15,175 నీటి వనరులలో 64కోట్ల చేప పిల్లలు విడుదల చేసి 2.99 లక్షల టన్నుల మత్స్య సంపద వృద్ది చేశామన్నారు. ఈ సంవత్సరం విడుదల చేస్తున్న 80కోట్ల చేప పిల్లలతో సుమారు 3.40లక్షల టన్నుల చేపల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ ఏడాది రూ. 10 కోట్ల ఖర్చుతో 5కోట్ల రొయ్య పిల్లలను త్వరలో విడుదల చేస్తామని మంత్రి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed