ఢీ అంటే ఢీ.. కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు

by Anukaran |   ( Updated:2021-03-29 05:42:33.0  )
ఢీ అంటే ఢీ.. కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తుంది. షాద్ నగర్ లో వీర్లపల్లి శంకర్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే విడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ప్రవర్తిస్తూ, గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు.

సొంత‌గూటిలోనే విబేధాలు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు కాంగ్రెస్ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జిల్లేడు చౌదరిగూడ ,మాజీ జడ్పీటీసీ సుధాకర్ రావు‌పై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ నుండి ఆయనను ఆరు సంవత్సరాలపాటు సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ కోదండ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది షాద్ నగర్ కాంగ్రెస్‌లో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది. సస్పెన్షన్ సందర్భంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

వంశీ చందర్ రెడ్డి నాయకుల మధ్య చిచ్చుపెడుతున్నాడు

కల్వకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన వంశీ చందర్ రెడ్డి ఇప్పుడు షాద్ నగర్ నియోజకవర్గంలోని బీసీ నాయకుల మధ్య చిచ్చుపెడుతూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్రపన్నారంటూ మచ్చ సుధాకర్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వంశీచంద్ రెడ్డితో వీర్లపల్లి శంకర్ మిలాఖత్ అయి తనపై కుట్ర పన్నారని సుధాకర్ రావు ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేపట్టినా.. పథకం ప్రకారం తమకు సమాచారం ఇవ్వకుండా పార్టీకి దూరం పెట్టారని అన్నారు. పార్టీలో దంగు శ్రీనివాస్ యాదవ్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, సురేష్ రెడ్డిని పార్టీ నుండి బయటకు పంపించేందుకు వీర్లపల్లి శంకర్ కుట్రపన్నారని సుధాకర్ రావు ఆరోపించారు. వీర్లపల్లి శంకర్‌కు ఎమ్మెల్యే కావాలని ఆలోచన ఉంటే.. తనలాంటి బీసీ నాయకులను ఎందుకు దూరం పెడతారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రెండు గ్రూపులను తయారు చేయడంలో వంశీ చంద్ రెడ్డిది ప్రధాన పాత్ర అని, భవిష్యత్‌ను అంచనా వేయలేని రాజకీయ అజ్ఞాని వీర్లపల్లి శంకర్ అని ఆయన ఆరోపించారు. దీనికి ఆగ్రహించిన వీర్లపల్లి వర్గీయులు నెత్తిమీద రూపాయి బిళ్ళ పెడితే ఆఠానకు కూడా చెల్లనివాడు వీర్లపల్లి శంకర్ గురించి మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందంటూ హెచ్చరించారు.

విభేదాలతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది: భాస్కర్ గౌడ్

నాయకుల మధ్య ఉన్న విబేధాలతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని యూత్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ గౌడ్ ఆరోపించారు. మనం మనం కొట్టుకొని ఇతర పార్టీల వారికి లాభం చేకూర్చే పనులను విడనాడి నియోజకవర్గంలో కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని విభేదాల కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో మంచివ్యక్తి అయిన చిన్నారెడ్డిని గెలిపించుకోలేకపోయమని, కనీసం మండలాలలో తిరిగి ప్రచారం చేయలేకపోయామన్నారు. రేపు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపుకోసం అందరం పనిచేద్దామని, కానీ ఇప్పటికైతే నాయకులు విబేధాలు పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు అందరు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

పార్టీకి దూరం చేస్తూ అధికారంలోకి ఎలా తెస్తారు?

పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీకి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి పనులు చేస్తూ పార్టీని ఎలా అధికారంలోకి తెస్తారని మాజీ జడ్పీటీసీ మచ్చసుధాకర్ రావు పేర్కొన్నారు. ఎవరైనా నాయకుడన్నవాడు అందరిని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, కానీ పార్టీకి దూరం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ‘వంశీచందర్ రెడ్డికి షాద్ నగర్‌లో ఏం పని. కల్వకుర్తిలో పార్టీని భ్రష్టుపట్టించారు. ఇప్పుడు ఆయన కన్ను షాద్ నగర్‌పై పడింది. విలువలతో కూడిన నాయకత్వం లోపం షాద్ నగర్ కాంగ్రెస్‌లో కనిపిస్తుంది. కార్యకర్తలు గందరగోళంకు గురవుతున్నారు’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed