బీజేపీకి బిగ్ షాక్.. పదవి తొలగించారని పార్టీకి రాజీనామా..!

by Sridhar Babu |
బీజేపీకి బిగ్ షాక్.. పదవి తొలగించారని పార్టీకి రాజీనామా..!
X

దిశ, హుజురాబాద్ రూరల్ : అర్థరాత్రి తనను బాధ్యతల నుంచి తొలగించినందుకు నిరసనగా తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు హుజురాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఒంటెద్దు పోకడలవల్లే తనను పదవి నుండి తొలగించారని మండిపడ్డారు. హుజురాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ప్రచారం చేయని వ్యక్తి, ఆయన గెలుస్తాడా అని వ్యాఖ్యానించిన వ్యక్తి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన కోవర్టు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారిని గుర్తించే పరిస్థితి కూడా ఆయనకు లేదన్నారు. కనీసం ఆయన సొంత గ్రామంలో జనరల్ స్థానంలోనూ పోటీ చేయలేని వ్యక్తి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తుండటం బాధాకరమన్నారు. తనతో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు మహేందర్ రెడ్డి ప్రకటించారు.

ఈటలపై ఫైర్..

ఆత్మగౌరవం అంటూ నినదిస్తున్న ఈటల రాజేందర్‌ ది ఆస్తులు, అంతస్తులు కాపాడుకోవడం కోసమే ఆత్మగౌరవం తప్ప మరోటి లేదన్నారు. పార్టీలో సీనియర్లను బయటకు పంపిస్తూ ఆత్మగౌరవం అంటూ ఈటల వ్యాఖ్యానించడం విచారకరమని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కాంప్లెక్స్‌లోని ఓ షటర్‌ను కూల్చి దానికి ఈటల రాజేందర్ కాంప్లెక్స్ అని పేరు మార్చుకున్నది వాస్తవమా? కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీనని చెప్పుకుంటున్న ఈటల మునిసిపల్ ఎన్నికల్లో పంజాల సతీష్ గౌడ్ అనే బీసీ బిడ్డ బీజేపీ తరుపున కౌన్సిలర్‌గా పోటీ చేస్తే ఆయన ఇంట్లో సీఐని కూర్చోబెట్టిన చరిత్ర కారుడని ఆరోపించారు. అన్ని ఒత్తిళ్లు వచ్చినా సతీష్ గౌడ్ కేవలం ఒక్క ఓటుతోనే ఓటమిపాలయ్యాడన్నారు. బీజేపీకి చెందిన సీనియర్లను ఒక్కొక్కరిని బయటకు పంపిస్తూ.. మళ్లీ ఏమీ తెలియనట్టు వాళ్లను టీఆర్ఎస్ నాయకులు కొంటున్నారంటూ తప్పుడు విమర్శలు చేస్తున్నారని మహేందర్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed