ఐపీఎల్ 2021: 10 సెకన్ల యాడ్‌కు రూ.15 లక్షలు!

by Shyam |
Disney-Star, ipl
X

ముంబయి: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌,‌ బీసీసీఐకే కాకుండా అందులోని భాగస్వాములందరికీ కాసుల వర్షం కురిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లీగ్ ద్వారా బీసీసీఐతోపాటు బ్రాడ్‌కాస్టర్లూ భారీ లాభాలను గడిస్తున్నాయి. ఐపీఎల్ క్రేజ్ ప్రతి సీజన్‌కూ పెరుగుతూ పోతోంది. గత సీజన్‌ను కొవిడ్ కారణంగా యూఏఈలో ప్రేక్షకులు లేకుండా నిర్వహించినప్పటికీ, ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ స్పోర్ట్స్ చానల్ ప్రకారం, 2019 సీజన్‌తో పోల్చితే, 2020 సీజన్‌లో ఐపీఎల్‌ను వీక్షించినవారి సంఖ్య 400 కోట్ల వ్యూయింగ్ మినిట్స్‌తోపాటు 23శాతం పెరిగింది. ఈ మొత్తంలో 24శాతం మంది మహిళలు, 20శాతం మంది పిల్లలు ఉండటం విశేషం. అంటే ఇంటిల్లిపాదినీ ఐపీఎల్ అలరిస్తుందన్నమాట. వీక్షకుల సంఖ్యతోపాటు ప్రకటనలూ 4శాతం పెరిగినట్టు బార్క్ ఇండియా తెలిపింది. ఇలా ఐపీఎల్ 13వ సీజన్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ క్రేజ్‌ను ఐపీఎల్ 14వ సీజన్‌లో మరింత క్యాష్ చేసుకోవాలని బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ ప్రసార సమయంలో వచ్చే ప్రకటనల రేట్లను భారీగా పెంచనున్నట్టు సమాచారం.

ప్రముఖ జాతీయ క్రీడా వెబ్‌సైట్ ప్రకారం, ఏప్రిల్ రెండోవారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ ఇండియా ప్రకటనల ధరలను 25 నుంచి 30శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. ఈ లెక్కన ఐపీఎల్ సమయంలో 10 సెకండ్లపాటు ప్రసారమయ్యే యాడ్‌కు సంబంధిత సంస్థలు రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో ఈ ధర రూ.12 లక్షలుగా ఉండేది. ‘స్టార్ యాజమాన్యం, ఇప్పటివరకు యాడ్ ఏజెన్సీల జూనియర్ లెవల్ ఉద్యోగులతో మాత్రమే చర్చలు జరిపింది. బీసీసీఐ పూర్తి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత యాడ్ రేట్ల పెంపుపై అధికారిక చర్చలు నిర్వహించనుంది’ అని సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

గత సీజన్‌‌లో స్టార్ ఇండియా, అసోసియేషన్ స్పాన్సర్స్ అయిన డ్రీమ్11, ఫోన్‌పే, బైజూస్, విఐ, అమేజాన్‌ సహా కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్స్ మోండెల్స్, ఐటీసీ ఫుడ్స్, పాలీక్యాబ్, డియాజియో, పీ అండ్ జీ, కోకాకోలా, హీరో, ఫేస్‌బుక్, కేపీ గ్రూప్, డైలీ హంట్, సామ్‌సంగ్, క్రెడ్, ఏమెఎఫ్ఐతోపాటు 117 అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

Next Story

Most Viewed