పరాయి స్త్రీలో అమ్మను చూడగల సమాజం రావాలి, కావాలి!

by Shyam |   ( Updated:2020-03-08 23:36:01.0  )
పరాయి స్త్రీలో అమ్మను చూడగల సమాజం రావాలి, కావాలి!
X

దిశ, న్యూస్‌బ్యూరో: చూడ చక్కటి అమ్మాయి. బాగా చదువుకున్నది. పోటీ పరీక్షలు రాసింది. యాస్ పర్ మెరిట్ జాబ్ కొట్టింది. పశు సంవర్థక శాఖలో ఆఫీసర్ అయింది. మూగ జీవాల జబ్బులకు చికిత్స చేసింది. రైతుల్లో మంచి పేరు తెచ్చుకున్నది. ఎదురవగానే చేతులు జోడించి నమస్కరించేంతటి సేవా గుణం గల మన సమాజ ఆణిముత్యమామే. అపుడుపుడే మొదలైన తన కెరీర్‌లో ఇంకా ఎన్నో మైలు రాళ్లను అధిగమించి, సొసైటీలో గొప్ప స్థాయికి ఎదగాల్సిన యువతి. తన కన్నవారి కలల్ని పండించే జీవన ప్రణాళికామెది. మతిలేని గ్యాంగు కన్నుపడింది. మోసపూరిత వలపన్నింది. ఈ కాలపు యువతే అయినా, ఆహార్యానికి తగ్గట్టే ఆ అమాయకపు వెటర్నరీ డాక్టర్..తాను వైద్యం చేసే పశుపక్ష్యాదులుసహా క్రూర మృగాలూ తలపెట్టనంతటి హానిని తొలి క్షణాల్లో గ్రహించలేకపోయింది. కొండలూ, బండలూ సైతం కరిగిపోయేంతటి చిత్ర‘వధ’యింది. నాగరిక చిహ్నం నడిబొడ్డున మొన్నటి ‘దిశ’పై ఆ అకృత్యం దేశ వ్యాప్తంగా వైబ్రేషన్సు తెచ్చింది. మనసున్న ప్రతి గుండెనూ పిండేసింది. న్యాయ, పోలీసుసహా అనేక వ్యవస్థలనూ చలింపజేసింది. ప్రభుత్వాలనూ మేలుకొల్పింది. ఏకంగా దిశ పేరిటే చట్టమొచ్చింది. శంషాబాద్ దృష్టాంతమే కాదు, హాజీపూర్, ఆదిలాబాద్ ఇన్సిడెంట్లూ మహిళల రక్షణను ఛాలెంజ్ చేశాయి. పసి పాపలు మొదలు పండుటాకుల దాకా ఎవరినీ వదలని ఆ శాల్తీలను సృష్టిలోని మరే జీవ జాలంతోనూ పోల్చలేం! అడుగుకొకటి అన్నట్టుగా మూడో కన్ను సీసీ కెమెరాలు విస్తారమైనా, మరెంతటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, సమస్త జంతు జాలమూ తలపెట్టని అపాయానికి మానవ రూపాలు తెగబడుతున్న నేపథ్యంలో మరో మహిళా దినోత్సవం మన ముంగిటకు వచ్చింది. అనేక ప్రశ్నలు, సవాళ్లకు సమాధానాలను వెతకమంటోంది. గడప దాటి, ఇల్లు చేరేదాకా రౌండ్ ద క్లాక్ స్వేచ్ఛగా, క్షేమంగా ఉండేలా ఏదో చేయాలనీ, మరేదో కనిపెట్టాలని అసైన్ చేస్తున్నది! వాచీలో నిమిషాల ముల్లు మూమెంటులా మినిట్‌కో స్ర్తీ ఆర్తనాదం ధ్వనిస్తోంది. సగటున డెయిలీ 90 మంది మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. రికార్డులకు ఎక్కినవే ఇవయితే, వెలుగులోకి రాని ఆటవికాలెన్నో! గుడిలో దేవతను మొక్కే గొప్ప సంస్కారం మనది. ఆటోమెటిగ్గా చేతులు జోడిస్తాం. తిరుగులేని క్రమశిక్షణ పాటిస్తాం. దేవుడు ప్రతి చోటా ఉండలేక అమ్మ రూపంలో అందరికీ అందుబాటులో ఉంటారని కొలుస్తారు. స్ర్తీని పూజించేచోట సకల దేవతలూ కొలువుంటారని ప్రతీతి. అట్లాంటిది అదే మహిళలను గౌరవించలేకపోతున్నారు. వారిపై జరిగే నేరాల లెక్కలే ఇందుకు తార్కాణం. మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవం లాంటివి ఘనంగా జరుపుకుంటుంటాం. దండలు వేస్తాం. దండాలు పెడతాం. సన్మానాలు చేస్తాం. సత్కరిస్తాం. కానీ ఆచరణలో ఎవరికి వారు ఆ భక్తి భావనను అనుసరించడంలో లోటు తీరడంలేదు. మన సమాజంలో మహిళ ఎక్కడో, ఆమె స్థానం ఏమిటో అధికారిక గణాంకాలు చూస్తే, గుండె తరుక్కుపోతుంది. సమాజంలోని ఈ విపరీత రుగ్మతలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘దిశ’ ప్రత్యేక కథనం.

భారత సమాజంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై నమోదవుతున్న కేసులను ఓ సారి పరిశీలిస్తే..2015లో 3.29 లక్షలు. ఆ తర్వాతి ఏట పాపాల చిట్టా మరింత పెరిగి, 3.38 లక్షలకు చేరుకుంది. 2017లో 3.59 లక్షలు, 2018లో 3.78 లక్షల మేర మహిళలపై సంభవించిన నేరాలుగా రిజిస్టరయ్యాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా సుమారు 56 వేల కేసులుండగా, తదుపరి ప్లేసులో మహారాష్ట్ర (31 వేలు), పశ్చిమబెంగాల్ (32 వేలు), మధ్యప్రదేశ్ (30 వేలు)లున్నాయి.

లాగులు తడువడం లేదు..నేరాలు ఆగడం లేదు!
మహిళలపై నేరాల రేటును పరిగణనలోకి తీసుకుంటే ప్రతీ లక్ష మందిలో గరిష్టంగా 143 మంది లేడీసు మీద అసోంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానం మన తెలంగాణదే! ఇక్కడ ప్రతీ లక్ష మందిలో 87 మంది మహిళలు బాధితులవుతున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెలువరించిన జాతీయ క్రైం రికార్డు బ్యూరో చెబుతున్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సగటున 63 మందిపై (ప్రతీ లక్ష మందిలో) లైంగిక దాడులు, ఇతర అకృత్యాలు జరుగుతున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మాత్రం ఎక్కువే. మహిళలపై నేరాల్లో ఎక్కువగా అత్యాచారాలు (రేప్), అత్తింటి ఆరళ్లు (గృహ హింస), కిడ్నాప్‌లు, పని స్థలాల్లో వేధింపులు తదితరాలు ఉన్నాయి.
తెలంగాణకన్నా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకునే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సైతం మహిళలపై నేరాల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రతీ వంద కేసుల్లో నాలుగు తెలంగాణలోనే రికార్డులకు ఎక్కుతున్నాయి. గడచిన మూడేళ్లలో సుమారు 49 వేల కేసులు కట్టారు. ‘ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే లాగు తడువాలే’ అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో గంభీరంగా వ్యాఖ్యానించారు. అంతటి పటిష్టమైన వ్యవస్థలు తెచ్చినట్టు చెప్పుకున్నారు. మహిళల వైపు చూస్తే గుడ్లు పీకుతా అని కూడా హెచ్చరించారు. వనితల భద్రత కోసం నగరంలో షీ టీమ్స్ అనే కొత్త ఒరవడికి నాడే శ్రీకారం చుట్టారు. కానీ, ఇవేవీ మహిళలపై నేరాలను సంపూర్ణంగా అరికట్టడానికి దోహదపడడంలేదని ‘దిశ’ తదితర దృష్టాంతాలు చెప్పకనే చెబుతున్నాయి. నమోదైన కేసుల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఛార్జిషీట్లు దాఖలు చేసినా, చివరకు 41 శాతం కేసులు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఒక్క 2018 సంవత్సరంలో తెలంగాణలో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే…

అత్యాచారాలు 606
అత్యాచారం కోసం హత్యలు 6
వరకట్న హత్యలు 186
ఆత్మహత్యవైపు పురికొల్పే ఘటనలు 445
యాసిడ్ దాడులు 10
భర్త, అత్తమామల వేధింపులు 6286
కిడ్నాప్‌లు 1121
పెళ్ళికోసం ఒత్తిడి, కిడ్నాప్‌లు 311
ఇందులో 18 ఏళ్ళ వయసులోపు ఘటనలు 249
అక్రమ తరలింపు (ట్రాఫికింగ్) 73
వేధింపులు, దాడులు 4567
అన్ని రకాల వేధింపులు 14230
పోక్సో కేసులు 1640

సత్వర న్యాయం..పరివర్తనే కర్తవ్యం!
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను మెజారిటీ సమాజం మెచ్చుకున్నది. ‘ఆ కౌంటర్ ఘటన’పై భిన్నాభిప్రాయలున్నాయి. మంచిపన్జేశారనీ అనేవారూ, అలా ఎట్లా చేస్తారని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు. ‘సుప్రీం’ ఆదేశాల మేరకు దానిపై విచారణ కమిషన్ ఉనికిలోకి వచ్చింది. ఆదిలాబాద్, హాజీపూర్ కేసుల్లో ఈ మధ్యే తీర్పులు వెలువడ్డాయి. ఉరి శిక్షను రాశాయి. ఢిల్లీ నిర్భయ కేసు దోషుల ఉరితీత ఈసారైనా ఎఫెక్టులోకి వచ్చేనా! అనే యావత్ సమాజం వేచి చూస్తున్నది. నిజానికి సత్వర న్యాయం అనేది జరిగి తీరాలి. నేరాలు ఎంతలా ఫోకస్ అవుతున్నాయో, పనిష్మెంట్లు అంతకంటే ఎక్కువగా నలుమూలల్లోకి వ్యాప్తి చెందేలా కచ్చితం చేయాలి. తద్వరా ప్రతి ఒక్కరి మదిలోనూ భయభక్తులు నాటాలి. అదే సమయంలో ఎవరికి వారిలో పరివర్తన రావాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ప్రతి పరాయి స్త్రీలోనూ అమ్మను దర్శించే సమాజం కావాలి, రావాలి! వచ్చే మహిళా దినోత్సవం నాటికి ఆ ఫలితం కనిపించాలి.

Advertisement

Next Story

Most Viewed