నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.. ఎదురు చూపు ఎంతకాలమో..!

by Anukaran |   ( Updated:2021-08-01 10:31:14.0  )
Legislative Council
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటాకింద భర్తీ కావాల్సిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలపై ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా, అవకాశాలు లభిస్తాయా అని ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ నేతలకు నిరాశే మిగిలింది. ఇప్పట్లో ఎన్నికలు జరిపించే అవకాశం లేదని స్వయంగా ప్రభుత్వమే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి తెలియజేయడంతో ఇంతకాలం పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది.

రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) స్థానాల పదవీకాలం జూన్ 3వ తేదీన ముగిసింది. ఆ జాబితాలో మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ కూడా ఉన్నారు. సరైన టైమ్‌లో ఎన్నికలు జరిగినట్లయితే ఎక్స్‌టెన్షన్ వస్తుందని కొద్దిమంది ఆశ పెట్టుకోగా, ఇంతకాలం తగిన పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్న మరికొద్దిమంది తప్పకుండా ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ వచ్చిందని సంతోషపడ్డారు. కానీ ఇవన్నీ ఇప్పట్లో నెరవేరేలా లేదని తాజా లేఖతో స్పష్టమైంది.

శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఎన్నిక జరపడంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ ఏడాది మే నెలలోనే ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్లు మే 13న సీఈసీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలపై అభిప్రాయాన్ని తెలియజేయాలని రాష్ట్రానికి లేఖ రాసింది. కానీ సెప్టెంబరు వరకూ నిర్వహించవద్దని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఆలోచించవచ్చని తన అభిప్రాయాన్ని తెలియజేసి తదుపరి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కేంద్ర ఎన్నికల కమిషన్‌కే వదిలేసింది.

ఖాళీ స్థానాలన్నీ టీఆర్ఎస్ పార్టీవే…

శాసనమండలిలో పదవీకాలం పూర్తయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల సభ్యులందరూ అధికార పార్టీకి చెందినవారే. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికై జూన్ 3న సభ నుంచి నిష్క్రమించారు. గవర్నర్‌ కోటాలో ఎన్నికైన శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా జూన్ 16న ముగిసింది. ఆ విధంగా మొత్తం ఏడు స్థానాలు ఖాళీ అయ్యాయి.

Advertisement

Next Story