ఆన్‌లైన్ విద్య అందరికీ అందేనా..?

by Shyam |   ( Updated:2020-08-27 01:45:11.0  )
ఆన్‌లైన్ విద్య అందరికీ అందేనా..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ :

కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరవలేని పరిస్థితులు ఏర్పడినందున ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ అందరు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు వినడం సాధ్యం కాదు. 40 శాతం మంది విద్యార్థులకు టీవీలు, స్మార్ట్ ఫోన్ వంటి సౌకర్యాలు లేవని ఇటీవలే నిర్వహించిన సర్వేలో తేలింది. అయినా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై చాలా మంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

పాఠశాలలు మూతపడి సుమారు ఐదు నెలలు గడిచింది. అసలు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరుస్తారా? లేదా? తరగతులు ఎలా నిర్వహిస్తారు? అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తాయి. వాటన్నిటికీ సమాధానంగా సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలి. తరగతులు ప్రారంభానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆన్ లైన్ తరగతుల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఉపాధ్యాయులతో గతంలో సర్వే సైతం చేయించారు. సుమారు 40 శాతం మంది విద్యార్థులకు టీవీ, స్మార్ట్ ఫోన్ వంటి సౌకర్యాలు లేవని, ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తే వారు నష్టపోతారని సర్వేలో తేలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,217 పాఠశాలల్లో 5.89 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో 2,866 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిల్లో 3.53లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలు..

తరగతులను దూరదర్శన్, టీ-శాట్ చానళ్ల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ లు, ఫోన్ల‌ద్వారా సైతంత విద్యార్థులకు విద్యను బోధించాలనుకుంది. ఇవేవీ అందుబాటులో లేని వారి కోసం రెడియోల ద్వారా తరగతి గదుల నిర్వహాణ చేపట్టనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం 1,2 తరగతుల విద్యార్థులను మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన సమయ పట్టిక ఇప్పటికే జిల్లా విద్యాధికారులకు చేరింది.

సౌకర్యాలు పరిస్థితేంటి?

ఆన్ లైన్ విద్య సాధ్యమేనా అనే విషయంపై ఇప్పటికే ప్రభుత్వం సర్వే నిర్వహించింది. దీని ప్రకారం సుమారు 40శాతం మంది విద్యార్థుల ఇండ్లలో సౌకర్యాలు లేవని తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన రీతిలో మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉండవు. సిగ్నల్స్ కారణంగా ఫోన్లు మాట్లాడేందుకు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఉండగా ఆన్‌లైన్ విద్య ఏలా సాధ్యమవుతుందనే విషయం ఆలోచించాల్సిందే. సర్వే ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు లక్షమంది విద్యార్థులు ఆన్‌లైన్ విద్యకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కేబుల్ నెట్‌వర్క్‌లలో, డీటీహెచ్‌లలో దూరదర్శన్, లేదా టీ-శాట్ వచ్చే అవకాశాలు లేవు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 76,534మంది విద్యార్థులకు ఇంటర్‌నెట్, ఫోన్ సౌకర్యం లేదు. 71,779మంది విద్యార్థులకు దూరదర్శన్, టీ–శాట్ అందుబాటులో లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది సాధారణ ఫోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల కోసం స్మార్ట్ ఫోన్లు కొనాలంటే పెద్ద కష్టమే.

ఇతరులకు కలవడం కష్టమే..

ఇతర విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సౌకర్యాలు లేని విద్యార్థులను ఉన్న విద్యార్థులతో తరగతులు హజరయ్యేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఉపాధ్యాయులు సైతం పెదవి విరుస్తున్నారు. పస్తుత పరిస్థితుల్లో ఒకరి పిల్లలను మరొకరి ఇంట్లోకి పంపించాని సూచించడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు.

శానిటైజేషన్ నిల్..

కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కరోనా బాధితులను ఉంచింది. అలాంటి వాటిల్లో నేటి వరకు శానిటైజేషన్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సరైన రవాణా వ్యవస్థ లేని గ్రామాలకు ప్రైవేటు వాహనాల‌పై ఉపాధ్యాయులు వెళ్లాలి. ఇలాంటి సమయంలో తమకు కరోనా సోకే అవకాశాలు లేకపోలేవని వారు ఆందోళన చెందుతున్నారు.

ఆన్‌లైన్‌లో ప్రైవేటు పాఠశాలలు పరిస్థితి అంతంతే..

ఇప్పటికే చాలా ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహించాయి. ఇవి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. పట్టణాల్లో 20 నుంచి 30శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారని సమాచారం. ఇక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు 5 నుంచి 10 శాతం కూడా హాజరుకావడం లేదని చెబుతున్నారు.

మా టీవీలో ఆ చానళ్లు రావు..

నేను దినసరి కూలీని. ప్రస్తుత పరిస్థితుల్లో పని దొరకడం లేదు. మాఇంట్లో ఉన్న టీవీలో దూరదర్శన్, టీశాట్ ఛానళ్లు రావు. నా వద్ద ఇంటర్నెట్ ఉన్న ఫోన్ కూడా లేదు. కానీ ప్రస్తుతం మా ఊరి సారు టీవీలు, ఫోన్లలో పిల్లలకు పాఠాలు చెబుతామని అంటున్నారు. ఎవరింట్లో ఛానళ్లు వస్తాయో వారింటికి నా పిల్లలను పంపించమంటున్నారు. కరోనా కారణంగా ఒకరింటికి మరొకరు పోలేని పరిస్థితి. ఇక చదువులు ఎట్టా సాగుతాయి.
– గోవర్దన్, వెంకటయ్యపల్లి

ఇంట్లోకి రానివ్వడం కష్టమే..

మామూలు రోజుల్లోనే పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంటాం. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్లాలి. చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వం చెప్పిన సాంకేతిక లేక‌పోవడం వల్ల వారు విద్యకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులను ఇండ్లలోకి రానిచ్చే పరిస్థితి లేదు. కొన్ని మారుమూల ప్రాంతాలలో సిగ్నల్స్ కూడా సరిగా రావు. అలాంటి చోట్ల ప్రభుత్వం చెబుతున్న టీ శాట్, దూరదర్శన్ ఛానళ్లు రావు.
– ఓ ఉపాధ్యాయుడు

Advertisement

Next Story

Most Viewed