డీజిల్ వల్ల సాగు ఆగిపోతోంది

by Anukaran |   ( Updated:2020-08-23 23:06:49.0  )
డీజిల్ వల్ల సాగు ఆగిపోతోంది
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఫలితంగా వానాకాలం సాగు ఊపందుకుంది. వర్షాలకు తోడు ఇటీవలే ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వకు నీటిని విడుదల చేసింది. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని లక్షలాది ఎకరాల్లో వరిపంటను సాగు చేసేందుకు రైతాంగం సిద్ధమయ్యింది. వ్యవసాయం పూర్తిగా యాంత్రీకరణగా మారిన తరుణంలో రైతాంగం ట్రాక్టరుపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. రోజురోజుకూ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ట్రాక్టర్ల యజమానులు ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా రైతులకు సాగు పెట్టుబడి పెరిగిపోయింది.

ఒకప్పుడు వ్యవసాయం అంటే నాగలి పట్టి ఎద్దులు కట్టి దుక్కి దున్ని విత్తనాలు వేసి పంటలను పండించేది. కానీ ప్రస్తుత రోజుల్లో అంతటా యంత్రాల మయం అయిపోయాయి. గతంలో రైతుల ఇంట తప్పనిసరిగా ఎడ్లు ఉండేవి. ప్రస్తుతం ఎటు చూసినా యంత్రాలే కనిపిస్తున్నాయి. దుక్కి దున్నడం మొదలు విత్తువేసిన దగ్గర నుంచి చివరకు పంట చేతికొచ్చే వరకు యంత్రాలనే వాడుతున్నారు. ఎక్కడ చూసినా రైతులు ట్రాక్టర్‌ యంత్రాలతోనే వ్యవసాయం చేస్తున్నారు. దుక్కులు దున్నుడు మొదలు అన్ని పనులు యంత్రాలతోనే ఉండటంతో సాగుఖర్చులు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు రైతులు. దీంతో పంట ఏదైనా ఒక్క ఎకరా సాగుకు కనీసం రూ.30 నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుందని తెలుపుతున్నారు. ఐదెకరాల పొలం ఉన్న రైతు పెట్టుబడులు ఎలా పెట్టాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం తిండి గింజలు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులు ఖరీఫ్‌ సాగు ఖర్చుల కోసం దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నారు.

సాగర్ ఆయకట్టు పరిధిలోనే 3.60 లక్షల ఎకరాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాల్వల ద్వారా 2.78 లక్షల ఎకరాలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 81వేల ఎకరాలు మొత్తం 3.60 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. నల్లగొండ జిల్లాలోని మండలాలు అనుముల, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో 1.53 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సూర్యాపేట జిల్లాలో ని 11 మండలాల్లో పెన్‌పహాడ్, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చిలుకూరు, నడిగూడెం, మునగాల, కోదాడ మండలాల్లో 2.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదీ కాకుండా బోర్లు, బావుల కింద మరో ఏడు లక్షల ఎకరాలకుకు పైగానే వరిని సాగు చేస్తారు.

ట్రాక్టర్ కిరాయి రెట్టింపు

జిల్లాలో ఈ సారి వందల ఎకరాల్లో పంట సాగయింది. ఒక్కో ఎకరాన్ని కనీసం 5 గంటల పాటు ట్రాక్టర్‌తో దునాల్సి ఉంటుంది. దుక్కికి గంటకు రూ.1200, రోటేవేటర్‌కు రూ.వెయ్యి, బురద పొలం రూ.2వేలు, క్రేజ్‌వీల్‌కు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఎకరానికి నాటు పడే వరకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ట్రాక్టర్ కిరాయి అవుతుంది. జూన్ నెలలో డీజిల్ లీటరుకు రూ.68 ఉంటే ప్రస్తుతం రూ.81 దాటింది. నెల వ్యవధిలోనే లీటరు డీజిల్‌పై రూ.13కు పైగా పెరిగింది. డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ట్రాక్టర్ యజమానులు కిరాయిలను అమాంతం పెంచుతున్నారు.డీజిల్ ధరలు పెరగడం వల్ల గత వారం పది రోజులుగా గంటకు రూ.300 నుంచి రూ.500 అదనంగా వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ల అద్దెతోపాటు కూలీల ధరలు పెరగడంతో రైతులకు సాగు పెట్టుబడి భారంగా మారింది.

రైతులకు డీజిల్ రాయితీపై ఇవ్వాలి : యాదగిరి, యువ రైతు, కేతేపల్లి

డీజిల్ ధరలు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. ఒక్క ఎకరం నాటు పెట్టేందుకు ఐదారు గంటల పాటు ట్రాక్టర్‌తో దున్నాల్సి వస్తున్నది. గంటకు బురద పొలంలో రూ.2వేల నుంచి రూ.2500 వరకు తీసుకుంటున్నారు. డీజిల్ ధరలు పెరిగినయని ట్రాక్టర్ యాజమానులు కిరాయి పెంచిర్రు. ప్రభుత్వం వ్యవసాయం కోసం రైతులకు డీజిల్‌ను రాయితీపై అందివ్వాలి.

Advertisement

Next Story