- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధరణి కష్టాలు తప్పేదెలా
దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ ఉద్యోగులకు, రైతులకు ధరణి కష్టాలు తప్పేలా లేవు. పోర్టల్ లోని సాంకేతిక ఇబ్బందులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ కు ఇస్తున్న నివేదికలలో ఎంత వాస్తవమున్నదో అర్ధం కావడం పలువురు మండిపడుతున్నారు. పది రోజుల క్రితమే సీఎం ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, అన్ని అంశాలకూ ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. పార్టు బి ఖాతాలకు 60 రోజులలో శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఇవేవీ సక్రమంగా అమలు కావడం లేదు.
సీఎం కేసీఆర్ ఆదేశించిన మరుసటి రోజు నుంచే ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చినట్లుగా అధికారులు ప్రచారం చేశారు. వెబ్ పోర్టల్ లో కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు మాత్రం తీరడం లేదు. పెండింగ్ మ్యూటేషన్లు, డీఎస్ పెండింగ్ వంటి వాటికి ఇచ్చిన ఆప్షన్లు ముందుకు సాగడం లేదు. స్లాట్ బుకింగ్ కు ధరణి సహకరించడం లేదు. అపార అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సమస్యలను సాగదీస్తుండడంతో దరఖాస్తుదారులలో అసహనం వ్యక్తమవుతోంది. సోమవారం మరోసారి ధరణి, రెవెన్యూ సమస్యలపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. కనీసం ఇపుడైనా సాంకేతిక సమస్యల గురించి విస్తృతంగా చర్చించి, పరిష్కరించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఏండ్ల కొద్దీ పెండింగులో ఉండడంతో తాము మానసిక వేదనకు గురవుతున్నామని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను కలెక్టర్లు సీఎంకు వివరిస్తే పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ధరణి ద్వారా మెరుగైన సేవలందించాలని సీఎం ప్రయత్నిస్తుంటే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది మాత్రం దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.
అన్నీ అపరిష్కృతమేనా?
భూ వివాదంలో కోర్టులు జారీ చేసిన స్టే ఆర్డర్, స్టేటస్ కో వంటి ఉత్తర్వులను అమలు చేసేందుకు ధరణిలో ఆప్షన్లు ఇస్తున్నామని అంటున్నారు. దరఖాస్తు చేయగానే తహసీల్దార్ల లాగిన్ లోకి వస్తుందంటున్నారు. ఆయన పరిశీలించి ఎలాంటి సందేహాలు లేకుంటే వెంటనే అమలు చేస్తారని, లేదా కలెక్టర్ల పరిశీలనకు పంపుతారని ప్రకటించారు. ఆ వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. నిషేదిత భూముల జాబితా 22ఎ లో నమోదు చేసిన ప్రభుత్వ భూముల వివరాలు ధరణిలో పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. వాటిని మార్చేందుకు అవకాశాలు లేవు. ప్రాపర్టీని ఇద్దరు, ముగ్గురు కలిసి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక్కరే కొనుగోలు చేయాలి. రిజిస్ట్రేషన్ విధానంలో ఆ ఆప్షన్ లేదు. పెండింగ్ మ్యూటేషన్ కు సంబంధించి రుసుం జనరేట్ అయినప్పటికీ స్లాట్ బుక్ కావడం లేదు. దాంతో మ్యూటేషన్ల ప్రక్రియ నిలిచిపోతోంది. అసైన్డ్ భూములను విరాసత్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భాగ పంపిణీ భూములకు సంబంధించి పార్టుకు బదులుగా మొత్తం భూమికి ఫీజు జనరేట్ అవుతోంది.
అధికారుల జాప్యం.. పట్టాదారులకు కష్టం
భూములు కొనుగోలు చేసేందుకు అన్ని రకాల పన్నులు కట్టారు. ప్రతి దస్త్రం సరిగ్గా ఉందని సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేశారు. ధరణి అమలులోకి రాకముందు కొందరు అధికారులు, ఉద్యోగులు మ్యూటేషన్లను నిలిపివేశారు. డిజిటల్ సంతకాలు పెండింగులో పెట్టి పాస్ పుస్తకాలు జారీ చేయకుండా ఆపేశారు. యజమానుల తప్పు లేకున్నా నెలల తరబడి హక్కుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. భూముల వివరాలు ఆన్ లైన్ లో మ్యూటేషన్ చేయలేదు. వాటిని మరొకరికి అమ్ముకునేందుకు అవకాశం ఉంది. రెండోసారి కూడా యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకునేటట్లుగా సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.
ఏవి ఆప్షన్లు?
ఏజీపీఏలను రద్దు చేశారు. గతంలో ఏజీపీఏ చేసుకున్న వారికి హక్కులు కల్పించడం లేదు. వారి పేర్లను ధరణిలో నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు. దాంతో వారు మరొకరికి ఆ భూములను అమ్ముకోలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్ బాధ్యత తహసీల్దార్లదే. ఆయన సెలవు పెడితే అన్ని పనులు బందే. లాగిన్ మార్చే అధికారం ఎవరికి లేదు. జాప్యం కారణంగా సివిల్ తగాదాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ధరణిలో నమోదు కాని భూములపై పేచీలు నడుస్తున్నాయి. కంపెనీలు, సంస్థల పేరిట ఉన్న భూములను ధరణిలో నమోదు చేయలేదు. ఎన్ఆర్ఐలకు ఆధార్ నంబరు లేదు. పాస్ పోర్టు ఆధారంగా పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఉన్నతాధికారుల మార్గదర్శకాలు జారీ చేస్తే తప్ప చేయలేమని తహసీల్దార్లు స్పష్టం చేస్తున్నారు. సమీక్షా సమావేశంలో విస్తృతంగా చర్చించి పరిష్కరిస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమమం అవుతుందని రెవెన్యూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు.