స్కూల్స్‌లో పెరుగుతున్న కేసులు.. డీహెచ్ శ్రీనివాస్ కీలక ప్రకటన

by Anukaran |
DH Srinivas
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్కూల్స్ తెరిచిన తర్వాత పాజిటివ్ కేసులు తేలుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డీహెచ్ డా. శ్రీనివాస రావు పేర్కొన్నారు. కొన్ని చోట్ల టీచర్లు వైరస్ బారిన పడినట్టు సమాచారం ఉందన్నారు. వీరంతా స్కూల్స్ ప్రారంభం కాక ముందే వైరస్‌కు ఎక్స్‌పోజ్ అయి ఉంటారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఆయా స్కూళ్లలోని ప్రైమరీ కాంటాక్ట్‌లకు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామన్నారు. అయితే, పాఠశాలకు వచ్చే టీచర్లు, పిల్లలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని డీహెచ్ సూచించారు. ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంత మందికి పాజిటివ్ అని తేలడం సహజమేనన్నారు. కానీ, 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తైన చోట ఔట్ బ్రేక్స్(ఒకే చోట ఎక్కువ మంది వైరస్‌కు ఇన్‌ఫెక్ట్ కావడం) అయ్యే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు టీకాలు వేశామన్నారు. అయితే, సరైన యాంటీబాడీలు వృద్ధి చెందని వారే మళ్లీ వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నారు. కానీ, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండదన్నారు. స్కూల్స్‌లో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వైద్యశాఖ అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు.

ప్రతీ విద్యార్థి పాఠశాలలో మాస్క్ ధరిస్తున్నాడన్నారు. అంతేగాక వ్యాక్సిన్ తీసుకున్న వారినే పాఠశాలలోకి అనుమతిస్తున్నారని తెలిపారు. దీంతో పాటు పాఠశాల ప్రవేశంలో థర్మల్ స్ర్కీనింగ్ జరుగుతుందన్నారు. జ్వర లక్షణాలు ఉన్న పిల్లలు, టీచర్లను ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలల్లోకి పంపించడం లేదన్నారు. ఆ మేరకు అన్ని స్కూళ్లకు వైద్యశాఖ మార్గదర్శకాలను జారీ చేసిందని పేర్కొన్నారు.

మాల్స్‌కు రూల్స్..

షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో మాస్క్ నిబంధనను మరింత పకడ్బంధీగా అమలు పరిచేందుకు ఆరోగ్యశాఖ కసరత్తులు చేస్తున్నదని డీహెచ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా యాజమాన్యలకు వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించామన్నారు. మాస్కు ఉంటేనే ఎంట్రీ ఇవ్వాలని సూచించామని తెలిపారు. అతి త్వరలో వారితో సమావేశాన్ని కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు శాఖ సహకారంతో దీన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తామన్నారు.

కాలేజీల్లో స్పెషల్ డ్రైవ్‌లు..

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించబోతున్నట్లు డీహెచ్ వివరించారు. టీకాలు పొందాలనుకునే కళాశాల యాజమాన్యాలు జిల్లా వైద్యాధికారి కార్యాలయాల్లో వివరాలు ఇస్తే, వెంటనే మొబైల్ టీంల ద్వారా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల చివరి వరకు 100 శాతం టీకాల పంపిణీకి లక్ష్యం పెట్టుకున్నామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story