ఒకవైపు డీజీపీ… మరోవైపు డీఐజీ.. అడవుల్లో మకాం

by Aamani |   ( Updated:2020-09-04 21:17:16.0  )
ఒకవైపు డీజీపీ… మరోవైపు డీఐజీ.. అడవుల్లో మకాం
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నాలుగు రోజులుగా తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మకాం వేశారు. రోజుకో రకమైన చర్చ.. భిన్నమైన లీకులు..! ఇదిగో అగ్రనేతల బంధువులు వస్తున్నారు… అదిగో వేచి చూడండి… అన్న సమాచారమే తప్ప అన్ని వర్గాల్లోనూ అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయం గత రెండ్రోజులుగా నెలకొంది. ఏకంగా స్టేట్ పోలీస్ చీఫ్ మారుమూల జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో మకాం వేయడమే పెద్ద చర్చకు దారితీస్తోంది. మావోయిస్టు అగ్రనేత గణపతి కుటుంబ సభ్యులతో పాటు కొందరు సీనియర్ నేతల లొంగుబాటు ప్రక్రియ కోసమే డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్ వచ్చారని పోలీసు వర్గాల్లో ప్రచారం జరిగింది. తమ అగ్రనేతల లొంగుబాటు వట్టి కట్టుకథేనని ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల అణచివేతకు కొత్త కోణం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసు యంత్రాంగం అప్రమత్తత..!

డీజీపీ మహేందర్ రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మకాం వేయడం పోలీసు వర్గాలను కలవరపెడుతున్న ది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం మళ్ళీ మొదలైందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక మేరకు స్థానిక పోలీసు వర్గాలను అప్రమత్తం చేసేందుకే డీజీపీ స్థానికంగా మకాం వేశారని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు కార్యదర్శి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌తో పాటు జిల్లా ఇతర సభ్యులను లొంగిపోయే దిశగా పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా డీజీపీ స్థానికంగా ఉండటం జిల్లా పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నది. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం శక్తియుక్తులను ఒడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మావోయిస్టు లొంగుబాటు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు కటకం సుదర్శన్, ఇర్రి మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భాస్కర్ ఆయన భార్య కంతి లింగవ్వతో పాటు మరికొందరు మావోయిస్టుల లొంగుబాటుకు వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడడం ద్వారా విభిన్న మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మావోయిస్టుల ఉనికిని నిర్వీర్యం చేసేందుకు పోలీస్ బాస్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

డీఐజీ సైతం జిల్లాలోనే…

ఇదిలా ఉండగా వరంగల్ రేంజ్ డీఐజీ నాగిరెడ్డి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పర్యటిస్తున్నారు. రెండ్రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన అటవీ గ్రామాల్లో పర్యటనలు చేస్తుండడం ఉత్కంఠ రేపుతున్నది. ఉట్నూరు సిరికొండ పోలీస్ స్టేషన్లను డీఐజీ నాగిరెడ్డి సందర్శించారు. ఒకవైపు డీజీపీ మరొకవైపు డీఐజీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మకాం వేయడం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. ఇదంతా అగ్రనేతల ఆపరేషన్ సరెండర్‌లో భాగమేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed