పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ

by srinivas |   ( Updated:2021-10-13 05:20:07.0  )
Gautham-Sawang
X

దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం దర్శించుకున్నారు. దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరికి దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంగళవారం మూలా నక్షత్రం రోజున సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి వెల్లడించారు.

భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ

దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని డీజీపీ గౌతం సవాంగ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పాలకమండలి దుర్గమ్మ చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దర్శన ఏర్పాట్లలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు నగర సీపీ బత్తిన శ్రీనివాసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చేశారని డీజీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed