- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tourism: బోలెడన్ని మధుర స్మృతుల సమ్మేళనం అరుణాచల గిరి ప్రదక్షణ
ఆధునిక తెలుగు సాహిత్యంలో తన బలమైన ముద్రవేసిన గొప్పరచయిత గుడిపాటి వెంకటాచలం. నా అభిమాన రచయిత. ఆయన చివరి రోజుల్లో తిరువణ్ణామలైలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ ఉన్న ఆయన సమాధిని చూసి, ఆయన కుటుంబంతో కలిసి రెండు రోజులు గడపాలనుకొని 2005లో రామహనుమాన్ కుటుంబం, మా కుటుంబం కలిసి అరుణాచలం వెళ్లాము. అనుకున్నట్లుగానే చిత్ర, నర్తకి, డాలీలను కలిసి, పరిసర ప్రాంతాలను చూసివచ్చాము. అప్పట్లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు అంత ప్రాచుర్యం లేదు.
రమణ మహర్షి ఆశ్రమంలో వసతి
చాగంటి కోటేశ్వరరావులాంటి ప్రవక్తల ప్రవచనాల కారణంగా ఈ రోజుల్లో గిరిప్రదక్షణకు విశేష ప్రాచుర్యం వచ్చింది. అందువల్ల ఇన్నేళ్ల తరువాత మళ్ళీ ఐదుగురు స్నేహితులం కలిసి అరుణాచలం వెళ్లాము. ఒక మిత్రురాలు అతి ప్రయత్నం మీద రమణమహర్షి ఆశ్రమంలో వసతి సంపాయించగలిగింది. అందువల్ల అనుకోకుండా అరుణాచలానికి నా ప్రయాణం ఖరారైంది. ముందురోజు సాయంత్రం హైదరాబాదులో బసెక్కి మరుసటిరోజు ఉదయం అరుణాచలంలో దిగాము. ఐదు పడకలు ఉన్న గదిని మాకు కేటాయించారు. ఆశ్రమం పచ్చని చెట్లతో పరిశుభ్రంగా విశాలంగా ఉన్నది. ఉదయం 7.30 లకు ఉపాహారం, 11.30 లకు మధ్యాహ్న భోజనం, రాత్రి 7.30 లకు రాత్రిభోజన వేళలను ఖచ్చితంగా పాటిస్తారు. భోజనం రుచికరంగా ఉన్నది. ధ్యానమందిరం ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడకం, ఫొటోలు నిషిద్ధం. ఖచ్చితమైన నిశ్శబ్దాన్ని విధిగా పాటించాలి.
అరుణాచలేశ్వరుడి దర్శనం
స్నానాదికాలు, ఉపాహారం ముగించి ఉదయమే అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్ళాము. నాలుగు గోపుర ద్వారాలతో కూడిన చాలా పెద్ద ప్రాంగణం. విచిత్రంగా ప్రత్యేక దర్శనానికి రద్దీ ఎక్కువగా ఉంది. ధర్మ దర్శనానికి రద్దీ తక్కువగా ఉంది. అక్కడ ఉన్న శివలింగం పంచభూతా త్మకమైనది. అగ్నికి ప్రతీక. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి పదకొండు దాటింది. 11.30. లకు ఆశ్రమంలో భోజనం ముగించి ఆటో మాట్లాడుకుని కొండ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలను చూడడానికి బయలుదేరాము. వీటిని అరుణాచల గిరి ప్రదక్షణలో భాగంగా కూడా చూడవచ్చు. కానీ ప్రదక్షణ ఆలస్యమౌతుందని మేము ముందుగానే చూడాలనుకున్నాము. కొండ చుట్టూ అష్టదిక్కులకు ప్రతీకాత్మకంగా ఎనిమిది లింగాలు (శివాలయాలు) ఉన్నాయని చెప్పారు. అవి వరుసగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనేవి. ఇవికాక పంచముఖ హనుమాన్, ఆది అన్నామలై ఆలయాలున్నాయి.
ఫుట్ పాత్‌పైకి చేరిన చలం సమాధి
మేము వెళ్ళింది మధ్యాహ్న సమయం కాబట్టి అక్కడ ఆటోవాలను సంప్రదించగా వారాంతంలో రోజంతా తెరిచి ఉంటాయని చెప్పాడు. మేం భోంచేసి ఆటో ఎక్కే సమయానికి అతని తమ్ముడిని పంపాడు. తీరా మేము వెళ్ళిన సమయంలో కొన్ని ఆలయాలు మూసి ఉన్నాయి. గ్రిల్స్ లో నుంచే చూడవలసి వచ్చింది. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిసింది. అప్పుడు అర్థమైంది ముందు చెప్పిన ఆటోవాలా మమ్మల్ని పక్కదారి పట్టించాడని. అందువల్ల మేము అతి పురాతనమైన ఆది అన్నామలై ఆలయాన్ని చూడలేక పోయాము. గిరిప్రదక్షణ రాత్రి 8గం.ల తరువాత చేయడం వలన రాత్రి కూడా చూడలేక పోయాము. చివరగా తెలుగు సాహిత్యంలో గొప్ప రచయిత గుడిపాటి వెంకటాచలం సమాధి చూసి కొంచం బాధ కలిగింది. ఎందుకంటే మేము ఇంతకు మునుపు వెళ్ళినప్పుడు చలం ఇల్లు, ఇంటి ప్రాంగణంలో ఆయన సమాధి ఉండేది. ఇప్పుడు అక్కడ ఆ ఇల్లు లేదు. సమాధి ఫుట్ పాత్ మీదికి వచ్చింది.
గిరి ప్రదర్శనలో మోక్షమార్గం విశేషం
గదికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాము. రాత్రి 7.30లకు భోజనం ముగించి 8 గంటలకు గిరిప్రదక్షణ మొదలు పెట్టాము. 14.కి.మీ నడక. పగలు నడవడం కష్టమే... వాహనాలు, ట్రాఫిక్, ఎండ ఇబ్బందిగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు రద్దీ లేదు. వాహనాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. పౌర్ణమినాడు రద్దీ ఎక్కువగా ఉంటుందట. గిరిప్రదక్షణలో నన్ను బాగా ఆకర్షించింది మోక్ష మార్గం. మధ్యాహ్నం ఆటోలో వచ్చినప్పుడే చూశాను. చాలా రద్దీగా ఉన్నదని లోపలికి పోలేదు. అప్పుడే అనుకున్నాను గిరి ప్రదక్షణ సమయంలో తప్పకుండా వెళ్ళాలని. నాకు అడ్వెంచర్ అంటే ఆసక్తి. అదీ అలాంటిదే అన్నమాట. ఐదారుగురు మాత్రమే ఉన్నారు. సుమారు రెండు అడుగుల వెడల్పు ఉన్న చిన్న సందులో దూరి బయటకు రావడమే మోక్ష మార్గం. అలా చేయడం వలన మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. కొంతమంది నిర్భయంగా లోపలికి వెళ్ళారు. మరికొంత మంది దగ్గరదాకా వెళ్లి భయంతో వెనక్కి వస్తున్నారు. నాకు అలాంటివి చేయడం సరదా కాబట్టి లోపలికి దూరి బయటకు వచ్చాను. రోడ్డు మీద టిఫిన్, టీ, పళ్ళు, పళ్ళ రసాలు, కొబ్బరి బొండాలు మొదలైనవి అన్నీ అమ్ముతున్నారు. నడక అలవాటు లేక కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు మసాజ్ చేయించుకునే సౌకర్యం కూడా ఉన్నది. మేము నలుగురం నడిచాము. ఇద్దరం నాలుగు గంటలలో ముగించాము. మరో ఇద్దరు మిత్రులు ఐదు గంటలలో ముగించారు.
బేరం లేకుండా బొమ్మల కొనుగోలు
తెల్లవారి ఉదయమే ఎనిమిది గంటలకు ముగ్గురు మిత్రులం అరుణాచలం కొండ ఎక్కడం మొదలు పెట్టాము. ఎటుచూసినా పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్నది. దారిలో విదేశీయులు దిగుతూ కనిపించారు. వాళ్ళు రోజూ ఆరుగంటలకే వెళతారట. దారిలో నన్ను బాగా ఆకర్షించింది శిల్ప కళాకారులు. మార్బుల్, గ్రానైట్ రాయితో అందమైన బొమ్మలు చెక్కుతున్నారు. శిల్ప కళాకారుడు శంకరన్ తో మాటకలిపాను. తరతరాలుగా వాళ్ళది అదే వృత్తి అట. అతడు నాలుగో తరం వాడు. ప్రతి రోజూ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు కొండ మీద ఉంటాడట. నేను రెండు బొమ్మలు బేరం చేయకుండా కొన్నాను. అతడు ఆశ్చర్యపోయాడు. అదే విషయం అతనిని అడిగాను. "మేడమ్ విదేశీయులు మాత్రమే బేరం చేయకుండా కొంటారు." అన్నాడు. 'మీరు చేస్తున్న పని పట్ల నాకున్న గౌరవం అంతే' అన్నాను. చాలా సంతోషించాడు. అక్కడి నుంచి స్కంధాశ్రమానికి చేరుకున్నాను. అది రమణమహర్షి నివాసమట. అక్కడ కాసేపు ఉండి అక్కడినుంచి విరూపాక్ష గుహకు వెళ్ళాను. అది రమణమహర్షి ధ్యానం చేసిన చోటు. కొద్ది సేపు నేను కూడా ధ్యానం చేసి తిరుగు ముఖం పట్టాను. దారిలో ఉన్న చిన్న చిన్న గుహాలయాలను చూస్తూ కిందకు దిగాను.
తళతళ మెరిసే వామనమూర్తి
మధ్యాహ్నం పన్నెండున్నరకు రూం ఖాళీ చేసి కంచి బయలుదేరాము. మూడున్నర గంటల ప్రయాణం. తమిళనాడు టూరిజం వాళ్ళ యాత్రీనివాస్‌లో ఐదుపడకల గది అందుబాటులో లేనందువల్ల ఏడుపడకల గదిని అద్దెకు తీసుకున్నాము. అద్దె రోజుకు ₹5200/. కంచి చారిత్రక నామం కాంచీపురం. పల్లవరాజుల రాజధాని. గబ గబా రెడీ అయి కాంచీపురం విధుల్లో పర్యటనకు వెళ్ళాము. ఈ నగరం పెద్ద కంచి, చిన్న కంచి రెండు భాగాలుగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆలయాలే... మొత్తం 150 దేవాలయాలు ఉన్నాయట. మేము ముందుగా శివ కంచి దేవాలయానికి వెళ్ళాము. విశాలమైన ప్రాంగణం. ప్రశాంతమైన వాతావరణం. అక్కడినుంచి వామనాలయానికి వెళ్ళాము. గుడి ఒక మోస్తరుగానే ఉన్నా లోపల విగ్రహం మాత్రం చాలా పెద్దది. బలి చక్రవర్తి తలమీద తన పాదాన్ని మోపిన వామనమూర్తి విగ్రహం (ఆ పాదం కింద బలి చాలా చిన్నగా ఉన్నాడు) నల్ల రాతితో తళతళా మెరిసిపోతూ చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది.
బంగారు బల్లిని తాకితే బల్లి దోషం ఉండదట
అక్కడి నుంచి విష్ణుకంచి ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయం చిన్న కంచిలో ఉన్నది. వరదరాజ పెరుమాళ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 93 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. 8.వ. శతాబ్దం నాటిది. 1053 లో పునరుద్ధరించ బడింది. కులోత్తుంగ, విక్రమ చోళుల పాలనలో విస్తరించబడింది. ఇది చారిత్రకంగా చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయం. శిల్పకళ ఉట్టిపడుతూ ఉన్నది. ఇక్కడ ప్రత్యేకత బంగారు బల్లిని చేతితో తాకడం. ఇది రెండో అంతస్తులో ఉన్నది. చిన్న వెండి బల్లి, సూర్య, చంద్రులతో పాటు కొంచం పెద్దదిగా బంగారు బల్లి ఉన్నది. దీనిని తాకిన వారి పైన బల్లిపడినా దోషం ఉండదని, బల్లి పైన పడిన వాళ్ళు కంచిలోని బంగారు బల్లిని తాకిన వారిని తాకినా ఆ దోషం పోతుందని ప్రజల నమ్మకం. ప్రాంగణంలో మరోపక్క కోనేరు కూడా ఉన్నది. తరువాత మేము ప్రసిద్ధమైన కంచి కామాక్షి ఆలయానికి వెళ్ళాము. అప్పటికే చీకటి పడడంతో హోటల్‌కు వెళ్ళిపోయాము.
మరునాడు ఉదయమే బయలుదేరి చిత్రగుప్తుడు ఆలయానికి వెళ్ళాము. నాకు తెలిసినంతవరకు వామనుడికి కాని, చిత్రగుప్తుడికి కానీ ఎక్కడా ఆలయాలు కనిపించవు. ఆలయం చిన్నదే... అక్కడి నుంచి కచికేశ్వరాలయానికి వెళ్ళాము. కచిక అంటే బూడిద బిళ్ళ అని అర్థం. ఇది శివాలయం. చాలా పెద్దది. దర్శనం చేసుకొని, ప్రాంగణమంతా తిరిగి చూసి అక్కడి నుంచి కంచి పీఠాధిపతి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ జయేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి నిర్యాణం పొందిన జీవసమాధులు ఉన్నాయి. ఎదురుగానే ఉన్న హనుమాన్ ఆలయాన్ని కూడా దర్శించి ఊరి చివర ఉన్న కైలాసనాథ ఆలయానికి వెళ్ళాము. యునెస్కో గుర్తించిన చారిత్రక ప్రదేశమిది.
బృహదీశ్వరాలయానికి ప్రేరణ
సాధారణంగా కంచికి పోయిన వాళ్ళు శివ,విష్ణు, కంచితోపాటు కామాక్షి దేవాలయాన్ని మాత్రమే దర్శిస్తారు. కానీ కైలాసనాథ ఆలయాన్ని తప్పకుండా చూడాలి. అద్భుతమైన కట్టడం. 7,8 శతాబ్దాల నాటిది. పల్లవ రాజు నరసింహవర్మన్ సృష్టికర్త. క్రీశ 985- 1014 లో రాజ రాజ చోళులుడు ఈ ఆలయాన్ని దర్శించాడని, బృహదీశ్వరాలయాన్ని నిర్మించడానికి ఈ ఆలయ నిర్మాణమే ప్రేరణగా నిలిచిందని చరిత్రకారులు చెపుతారు. గ్రానైట్, సాండ్ స్టోన్ తో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ప్రకృతి సహజమైన రంగులతో ఉన్న కుడ్య చిత్రాలు చూపరులను ఆకట్టు కుంటాయి. గర్భగుడిలో ఇరుకైన ప్రవేశమార్గం ఉన్నది. ఏడు మెట్లు ఎక్కి, ఇరుకైన మార్గం గుండా శివలింగానికి ప్రదక్షణ చేయడం జనన మరణాలకు సంకేతంగా భక్తులు నమ్ముతారు.
కంచి పట్టు చీర వైభవం
కాంచీపురం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంత ప్రసిద్ధి పొందిందో చేనేత సిల్కు పరిశ్రమకు కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కంచి పట్టు చీర మగువల మనను దోచుకుంది. అక్కడికి వెళ్ళిన మహిళలు కంచి పట్టు చీరలు కొనకుండా తిరిగి రారు అనడం అతిశయోక్తి కాదు. మేము కూడా సొంత మగ్గాలు కలిగిన ఇంటి షాపుకి వెళ్ళాము. తరతరాలుగా చేనేత వృత్తిలో ఉన్నారు. ఇంటిల్లిపాది నేతపనిలోనే ఉంటారు. ఆ యజమాని పేరు భాస్కర్ త్రివెంగళం. నాలుగో తరానికి చెందినవాడు. వాళ్ళకు 250 సిల్కు చీరలు నేసే మగ్గాలున్నాయి. పిలియార్ పాలెంలో 100 కాటన్ చీరలు నేసే మగ్గాలున్నాయి. ఒక చీర నేయడానికి సుమారు రెండు వారాలు పడుతుంది. మగ్గం చేతితో కదిలించడాన్ని అచ్చిమరం అంటారు. దానిని గంటకు 53000 సార్లు చేస్తారట. దీనిని బట్టి మగ్గం మీద చీర నేయడం ఎంత కష్టమైన పనో మనకు అర్థవుతుంది. వర్ణ సమ్మేళనం, దారపు కౌంట్, జరీని బట్టి ధర నిర్ణయిస్తారు. దీనిని బట్టే నేత కార్మికుడికి భత్యం కూడా ఉంటుంది. అందుకే చేనేత చీరలకు ధర ఎక్కువ. పవర్లూమ్స్ వచ్చిన తరువాత వాటి ధర అందుబాటులో ఉంటుంది కాబట్టి, చాలా మంది వాటి వైపే మొగ్గుచూపుతున్నారని భాస్కర్ వాపోయాడు. మేమ మా శక్తి మేరకు చీరలు కొనుగోలు చేసాము.
వెళ్ళిన వేళా విశేషము కాబోలు, ఎక్కడా ఏ రకమైన ఇబ్బంది కలుగలేదు. దేవాలయాలలో దర్శనార్థం గంటల తరబడి నిలబడిందీ లేదు. బోలెడన్ని మధుర స్మృతులను ప్రోది చేసుకొని క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నాము.
గిరిజ పైడిమర్రి
ట్రావెలర్
9949443414