సైదయ్య జాతరకు వేళాయే

by Shyam |   ( Updated:2021-01-17 23:52:17.0  )
సైదయ్య జాతరకు వేళాయే
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. ఆ ప్రాంతానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్‌పహాడ్ దర్గా. ఈ దర్గాకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ దర్గా ఉంది. ప్రతి శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రతి సంక్రాంతి తర్వాత జరిగే ఉర్సు ఉత్సవాలకు భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం ముందుకు సాగడం లేదు.

ప్రచారంలో ఉన్న దర్గా నేపథ్యమిదీ..

సుమారు 400 ఏండ్ల క్రితం మద్రాసు రాష్ట్రంలో నాగూర్ గ్రామంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రచారం చేయాలని తలచాడు. ఈ మేరకు జాన్ పహాడ్, సైదా, వాజీద్ సైదా, మోయినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారనే కథ ప్రచారంలో ఉంది. అయితే తప్పుడు సమాచారంతో వీరిపై వజీరాబాద్‌ పాలకులు యుద్ధానికి దిగారు. అందులో వీరంతా అమరులయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి.. వజీరాబాద్ రాజకుమారుడు.. ప్రాయశ్చిత్తంగా జాన్‌పహడ్‌ దగ్గర దర్గా నిర్మించాడు.

సఫాయి బావి సర్వరోగ నివారణి..

దర్గాకు వచ్చేవారికి మొదట కనిపించేది సఫాయి బావి. భక్తులు ఇక్కడి నుంచే తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బావి నీటితో వంట వండి దేవుడికి సమర్పించడం అనవాయితీ. ఇది చాలా పవిత్రమైన బావిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని నమ్ముతారు. అలాగే పశుపక్ష్యాదులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటాయని, దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

అభివృద్ధికి ఆమడ దూరం..

జాన్‌పహాడ్‌ దర్గా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రతి ఏటా దర్గాకు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రతి శుక్రవారం భక్తులు కందూరు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాలు శిథిలావస్థలో ఉండడంతో ఆరు బయట చెట్ల కింద వంటావార్పు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అధ్వాన్నంగా రహదారులు..

జాన్‌పహాడ్ దర్గాకు చేరుకునేందుకు ప్రధానంగా మూడు రహదారులు ఉన్నాయి. నేరేడుచర్ల-జాన్‌పహాడ్, దామరచర్ల-జాన్‌పహాడ్, మఠంపల్లి-జాన్‌పహాడ్‌లు ఉర్సు సమయంలో కీలకంగా మారుతాయి. దర్గా చుట్టూ సిమెంటు పరిశ్రమలు ఉండటంతో నిత్యం ఈ రహదారుల మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఫలితంగా ఆ రోడ్లపై మోకాలి లోతు గుంతలు ఏర్పడ్డాయి. ప్రధానంగా పాలకవీడు మండల కేంద్రం నుంచి దర్గా వరకు అడుగొక గండం.. క్షణమొక నరకంలా ప్రయాణం సాగుతుంది. దర్గాకు భారీగా భక్తుల వస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు దర్గా సమీపంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనను వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి పంపినా ఇంతవరకు ఎలాంటి స్పందనాలేదు. గతంలో జాన్ పహాడ్ దర్గాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చినా.. ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు పడలేదు.

Advertisement

Next Story

Most Viewed