సీఎం చేతిలో ఫైల్ ఉన్నా నో ప్రమోషన్స్​

by Anukaran |
సీఎం చేతిలో ఫైల్ ఉన్నా నో ప్రమోషన్స్​
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: వారు ఫ్రంట్​లైన్​వారియర్స్.. కానీ, వారి సేవలను సర్కారు గుర్తించకపోవడంతో ఆందోళనబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఎంతో మంది పబ్లిక్​హెల్త్​నర్సులు పదోన్నతులకు నోచుకోవడం లేదు. ఏళ్లతరబడి పీహెచ్ఎన్​గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నా కమ్యూనిటీ హెల్త్​ఆఫీసర్​(సీహెచ్​ఓ)గా పదోన్నతులు కల్పించడం లేదు. 2017లో నిలిచిపోయిన పదోన్నతులు నేటికీ చేపట్టడం లేదు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పదోన్నతులు కల్పించడం లేదని పలువురు వాపోతున్నారు. నాలుగేళ్లుగా పదోన్నతుల ఫైల్​ సీఎం పేషీలోనే పెండింగ్​లోఉందని, ఇప్పటికైనా కనికరించకపోతే ఆందోళన తప్పదని పబ్లిక్​హెల్త్​నర్సులు హెచ్చరిస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ‌లో పబ్లిక్ హెల్త్ న‌ర్సులు ఎన్నో ఏళ్లుగా ప‌దోన్నతులకు నోచుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన ఫైల్​ సాక్షాత్తు సీఎం పేషీలో నాలుగేళ్లుగా పెండింగ్ ఉంది. దీంతో ఎలాంటి ఎదుగు బొదుగూ లేకుండా న‌ర్సులు తీవ్ర మాన‌సిక ఆందోళ‌నల మ‌ధ్య విధులు నిర్వహిస్తున్నారు. న్యాయంగా పీహెచ్ఎన్ (పబ్లిక్​హెల్త్​నర్సు) నుంచి క‌మ్యునిటీ హెల్త్ ఆఫీస‌ర్ (సీహెచ్ఓ) ప‌దోన్నతుల‌కు అర్హత ఉన్నప్పటికీ పొందడంలేదు. గ‌డిచిన నాలుగేళ్లుగా పీహెచ్ఎన్ హోదాలోనే 52 మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ప్రస్తుతం మ‌రో 120 మంది ప‌దోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విష‌య‌మై ‌‌‌‌
స‌చివాల‌యంతో పాటు డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ కార్యాల‌యం చుట్టూ ప‌లు ప‌ర్యాయాలు ప్రద‌క్షిణ‌లు చేసినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని వారు వాపోతున్నారు.

పట్టని ఆదేశాలు..

ప‌దోన్నతుల విష‌యంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యద‌ర్శిగా శాంతికుమారి ఉన్న స‌మ‌యంలో ప‌ద‌వీ విర‌మ‌ణకు స‌మీపంలో ఉన్న వారికి పీహెచ్ఎన్ నుంచి సీహెచ్ఓగా ప‌దోన్నతులు క‌ల్పించేందుకు అడ్ హ‌క్ నిబంధ‌న‌ల ద్వారా చ‌ర్యలు తీసుకోవాల‌ని డీపీహెచ్ కు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇందుకు సంబంధించిన ఫైల్​ ముందుకు సాగ‌లేదు. దీంతో ప‌దోన్నతుల‌కు అర్హత‌లు ఉన్నప్పటికీ రాకుండానే ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారికి న్యాయంగా, నిబంధ‌న‌ల మేర‌కు రావాల్సిన పింఛన్​కూడా తగ్గిపోతుంది.

ఫైల్​ముందుకు క‌దిలేనా …?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌ల అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు ప‌దోన్నతులు క‌ల్పించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటికైనా ప‌దోన్నతులు వ‌స్తాయ‌ని పీహెచ్ఎన్ లు ఆశ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో డీపీహెచ్ కార్యాల‌యంలో ప‌దోన్నతుల స‌మాచారం తెలుసుకునేందుకు ఎన్ని ప‌ర్యాయాలు ప్రయ‌త్నించినా తెలియడం లేదని కొంత మంది న‌ర్సులు వాపోతున్నారు. ఇప్పటికి కూడా ప‌దోన్నతులు క‌ల్పించ‌క‌పోతే ఆందోళ‌న‌లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణను సైతం రూపొందిస్తున్నట్లు స‌మాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పీహెచ్ఎన్ నుంచి సీహెచ్ఓగా ప‌దోన్నతులు క‌ల్పించాల‌ని, ఇందులో 2017 నుంచి అర్హత ఉన్నప్పటికీ ప‌దోన్నతులు పొంద‌కుండా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారిని కూడా చేర్చి వారి పింఛన్ కూడా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పదోన్నతులు కల్పించాలి..

2017 నుంచి పీహెచ్ఎన్ నుంచి సీహెచ్ఓ గా ప‌దోన్నతులు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫైలు సీఎం పేషీలో పెండింగ్ లో ఉంది. ప‌దోన్నతులు కల్పించాల‌ని అధికారుల చుట్టూ ఎన్ని ప్రద‌క్షిణ‌లు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో నేను ఉద్యోగ విర‌మ‌ణ చేశాను. న్యాయంగా నాకు రావాల్సిన ప‌దోన్నతి ఇస్తే నాకు పింఛన్ కూడా పెరిగేది. ఇప్పుడు ప్రభుత్వమే ప‌దోన్నతుల విష‌యంలో చ‌ర్యలు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో 2017 నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారికి కూడా కొంత మేర న్యాయం జ‌రుగుతుంది. ప్రభుత్వం ఈ విష‌యంలో పున‌రాలోచించాలి.

–ప్రస‌న్న కుమారి, మెడిక‌ల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈఎ స్ఐ (ఐఎంఎస్) ఉమెన్స్ ఎంప్లాయీస్ సెంట్రల్ యూనియ‌న్ అధ్యక్షురాలు

Advertisement

Next Story

Most Viewed