వణికిస్తోన్న డెంగ్యూ.. ఇదే మంచి చాన్స్ అంటున్న కార్పొరేట్ ఆస్పత్రులు

by Shyam |
వణికిస్తోన్న డెంగ్యూ.. ఇదే మంచి చాన్స్ అంటున్న కార్పొరేట్ ఆస్పత్రులు
X

దిశప్రతినిధి, రంగారెడ్డి : రాష్ట్రంలోని ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్‌తో జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో డెంగ్యూ వ్యాధి సామాన్యులను వణికిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో గతాడేదితో పోలిస్తే ఈసారి 17 డెంగ్యూ కేసులు అధికంగా నమోదైయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో దోమలకు ఆవాసంగా మారిపోయాయి. దీంతో పెద్దలు, చిన్నారులు జ్వరం బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో -198, వికారాబాద్ జిల్లాలో -21 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు సాధరణంగా ఏడాదిలో జూన్ నుంచి నవంబర్ వరకు సీజనల్ వ్యాధుల కాలంలోనే ప్రబలే అవకాశం ఉంది. అయితే, గతాడేది రంగారెడ్డి జిల్లాలో -181, వికారాబాద్ జిల్లాలో- 27 కేసులు నమోదయ్యాయి. ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ కేవలం 3నెలల్లోనే అధికంగా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. కానీ, ఈ వివరాలు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారివే… ప్రైవేట్ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇంకా అధికంగా ఉంటుందని అధికారులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్, టిమ్స్ తదితర ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ ఆసుపత్రిలు ఇప్పటికే జ్వరంతో బాధపడే రోగులతో కిటకిటలాడుతున్నాయి. శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వ్యాధి నిర్ధారణకు అవసరమైన ఎన్ఎస్-1 ర్యాపిడ్ యాంటిజెన్, ఐజీఎం యాంటీబాడీ ఎలిసా టెస్టు కిట్లు రోగుల నిష్పత్తికి తగినంతగా లేవు. దీంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేటు ల్యాబులను ఆశ్రయిస్తు న్నారు. ఎప్పటికప్పుడు డెంగ్యూ రోగుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపాల్సి ఉన్నా.. ఆయా ఆస్పత్రుల వైద్యులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా డెంగీ బాధితుల సంఖ్య పక్కాగా తెలియడం లేదు.

ప్లేట్లెట్స్ డౌన్ పేరుతో కార్పొరేట్ వైద్యం..

రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రతి సీజన్‌ను పండుగలాగా జరుపుకుంటున్నాయి. కరోనా పేరుతో ఇష్టానుసారంగా చికిత్సలు చేసి రోగుల నుంచి డబ్బుల వసూలుచేశాయి. ఇప్పుడు కూడా అదే పనిలో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు నిమగ్నమైయ్యాయి. మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. జ్వర పీడితుల్లో ఈ కౌంట్ తగ్గుతుంది. ప్రస్తుతం అస్ప త్రులకు వస్తున్న చాలా మంది రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ 40 వేలలోపే ఉంటోంది. వాస్తవానికి 25 వేల వరకున్న పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఒకవేళ కౌంట్ 20 వేలకు పడిపోయి నోరు, ముక్కు నుంచి బ్లీడింగ్ అయితే వెంటనే ప్లేట్ లెట్స్ పునరుద్ధరించాలి. లేదంటే షాక్‌కు గురై కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదే ఆసరాగా కొంతమంది వైద్యులు రోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్లేట్లెట్స్ కౌంట్ పేరుతో రోజుకు రెండు సార్లు టెస్టులు చేయడంతో పాటు ప్లేట్లెట్స్ ఎక్కించే పేరుతో భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారు. పారాసిటమల్, సాధారణ పూయిడ్స్‌తో తగ్గిపోయే జ్వరానికి ఖరీదైన మందులు, సంబంధం లేని టెస్టులను సిఫార్సు చేస్తుండటంతో రోగులు వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్న వారిలో పెద్దలతో పోలిస్తే చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రతీ ఐదుగురు చిన్నారుల్లో ఒకరు డెంగ్యూ బాధితులు కావడం గమనార్హం.

కివి, బొప్పాయి ధరలకు రెక్కలు

డెంగ్యూ బాధితులు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అల్లోపతి మందులు వాడుతూనే మరోవైపు ప్రత్యామ్నాయంగా కివి పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. ఇదే అదనుగా వ్యాపారులు సైతం ధరలను పెంచేశారు. గతంలో ఒక్కో కివి పండు రూ.20లకు దొరికేవి ప్రస్తుతం రూ.50కి పైగా విక్రయిస్తున్నారు. బొప్పాయి ధరలు సైతం రెట్టింపయ్యాయి.

ఈ ప్రాంతాల్లోనే కేసులు నమోదు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉండటంతో పాటు ఇంటిపై ఉన్న ట్యాంకులకు మూతలు లేకపోవడం, పూల కుండీల్లో వర్షపు నీరు చేరి రోజుల తరబడి నిల్వ ఉండటం, ఇంటిపై ఉన్న పాత ఖాళీ డబ్బాలు, టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు దోమలకు నిలయంగా మారాయి. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

నివారణకు మార్గం పరిశుభ్రత..

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పారిశుధ్యలోపం లేకుండా జాగ్రత్త పడాలి. పూల కుండీలు, చెట్ల పొదలను, వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, కుండీలు, టైర్లను తొలగించాలి. నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకున్న సంపులు, ట్యాంకులపై తప్పనిసరిగా కప్పు ఉండేలా చూసుకోవాలి. దోమ తెరలు, మస్కిటో కాయిల్స్, గుడ్‌నైట్, ఆల్ ఔట్ వంటివి వాడాలి. డెంగ్యూ నివారణకు ఏకైక మార్గం పరిసరాల పరిశుభ్రతే.

-డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్, రంగారెడ్డి

Advertisement

Next Story