అలర్ట్: రాష్ట్రంలోకి ప్రవేశించిన డెల్టా ప్లస్ వేరియంట్

by Shyam |
delta plus variant
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోకి అత్యంత ప్రమాదకరమైన డెల్టాప్లస్ వేరియంట్ కరోనా వైరస్ ప్రవేశించింది. ఈ నెల 23న శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో రాష్ట్రంలో 2 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రంలో అత్యధికంగా 23 కేసులు నమోదవడంతో అక్కడి నుంచి ఎక్కవగా సోకే ప్రమాదముందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. చాపకింద నీరులా కరోన వైరస్ ప్రబలుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి పెరుగుతుంది. కేసుల సంఖ్య పెరుగుతున్నాకాని రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుంది.

శాస్త్రవేత్తల అంచనాలు తలకిందులు చేస్తూ థర్డ్ వేవ్ అత్యంత వేగంగా ముంచుకొస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం, సెకండ్ వేవ్ పూర్తిగా తొలిగిపోయిందని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ లో డెల్లా వేరియంట్ ప్రబలగా తాజాగా అత్యంత ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు రాష్ట్రంలో నమోదవడం ఆందోళన కలిగిస్తున్నాయి. మ్యూటేషన్లు చెందుతున్న వైరస్ లు ఎలాంటి ప్రమాదాలకు తెచ్చిపెడాయోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

రాష్ట్రంలో 2 డెల్టా ప్లస్ కేసులు నమోదు

దేశ వ్యాప్తంగా ఈ నెల 23న శాస్త్రవేత్తలు 28 జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లో చేసిన పరిశోదనలు చేపట్టారు. సార్స్ కోవిడ్-2 కు చెందిన 58,240 నమూనాలను సేకరించి వీటిలో 46,124 నమూనాలకు పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో దేశ వ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించిగా రాష్ట్రంలో 2 కేసులు నమోదైనట్టుగా తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రలో 23 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తుంది. సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ మహారాష్ట్రా నుంచే సోకడంతో డెల్టాప్లస్ వేరియంట్లు కూడా అక్కడి నుంచే ప్రబలే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ పేషెంట్ల తాకిడి

ప్రైవేటు ఆసుపత్రులకు గత 10 రోజులుగా కోవిడ్ పేషెంట్ల తాకిడి పెరిగింది. సెకండ్ వేవ్ లో జరిగిన పరిణామాలు మళ్లీ పునరావృతమయ్యేలా పరిస్థితులు తలెత్తుతున్నాయి. చికిత్సల కోసం చేరిన రెండు, మూడు రోజుల్లో పేషెంట్లు చనిపోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమా థియేటర్లతో సహా వేడుకలకు, ఉత్సవాలకు బహిరంగ సభలకు ప్రభుత్వం అనుమతులివ్వడంతో మహమ్మారి మళ్లీ చెలరేగుతుంది.

కేసులు తక్కువగా చూపిస్తున్న ప్రభుత్వం

వైరస్ నెమ్మదిగా ప్రబలుతున్నప్పటికి ప్రభుత్వం కోవిడ్ కేసులను తక్కువగానే చూపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇదే ప్రక్రియను అనుసరిస్తుండటంతో ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియకుండా పోతున్నాయి. తాజగా వైద్యారోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం ఒక రోజులో 614 కొత్త కేసులు నమోదవగా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్టీవ్ కేసులు 9,141 మాత్రమే ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు.

Advertisement

Next Story