ఎ…క్క…డా…?

by Shyam |
ఎ…క్క…డా…?
X

దిశ ప్రతినిధి, మెదక్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో జాప్యం తలెత్తుతోంది. అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం మాటలు.. చేతల్లో కనిపించడం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నాలుగేండ్ల క్రితం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. కానీ వాటిని నేటికీ పంపిణీ చేయలేదు. తమకు ఇండ్లు వస్తాయన్న ఆశతో అర్హులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తు సైతం చేసుకున్నారు. నేడు, రేపు అంటూ అధికారులు, నాయకులు కాలం వెళ్లదీస్తుంటడంతో అర్హుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూంల నిర్మాణ పరిస్థితి ఎలా ఉన్నా.. సిద్దిపేటలో కాస్త త్వరగానే కొంత మేర ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ వాటి పంపిణీలో జాప్యం తలెత్తుతోంది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నర్సాపూర్ శివారు‌లో 2,460 ఇండ్లను సుమారు రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2,460 ఇండ్లకు 11,657 దరఖాస్తులు వచ్చాయి. 65 మంది అధికారులతో 21 టీంలు ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు. మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అర్హుల జాబితా దాదాపు పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ఏండ్లుగా ఇదే తంతు

2018 ఎన్నికలకు ముందే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి, అర్హుల జాబితా కోసం అధికారులతో సర్వే నిర్వహించారు. ఇప్పటికి సుమారు రెండేండ్లు గడిచినా వాటి ఊసే లేదు. మధ్య మధ్యలో అప్పుడు పంపిణీ చేస్తాం, ఇపుడు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారే తప్ప పంపిణీ చేపట్టడం లేదు. ఉగాది రోజున సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తామని ఫిబ్రవరి‌లో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో అర్హులు తమకు ఇల్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ అది నెరవేరలేదు. కరోనా లాక్‌డౌన్‌తో పంపిణీ ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. దీంతో అర్హుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. సొంత ఇంటి కల నెరవేరుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, అప్పులు చేసి కిరాయి ఇండ్లలో ఉంటూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొందరు వాపోతున్నారు.

శిథిలావస్థలో కొన్ని నిర్మాణాలు

నాలుగేండ్ల క్రితం నిర్మించిన ఇండ్లు పడావుగా ఉండడంతో నిరూపయోగంగా మారాయి. ఇప్పటికే అందులో కొన్ని శిథిలావస్థకు చేరాయి. కిటికీలు, గ్లాస్‌ అద్దాలు, తలుపులు, పైపులైన్లు, ప్లాస్టిక్‌ వాటర్‌ ట్యాంకులు కొన్ని ధ్వంసమవుతున్నాయి. కొన్ని తుప్పు పట్టి వాడకానికి నిరుపయోగంగా మారాయి. ఈ ఇండ్లను ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శిస్తున్నారు. కేవలం నిర్మాణం పూర్తయిన ఇండ్లు సందర్శనకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తారో? లేదో? చూడాలి.

Advertisement

Next Story