రైతులకు సంఘీభావంగా ఢిల్లీ డాక్టర్లు

by Shamantha N |   ( Updated:2020-12-03 05:16:18.0  )
రైతులకు సంఘీభావంగా ఢిల్లీ డాక్టర్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘వ్యవసాయ చట్టాలు’ రైతులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో లక్షలాదిమంది రైతులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. మూడు అగ్రి చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, వారి ఆరోగ్యం కోసం ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సఫ్దార్‌జంగ్, హిందూ రావ్’ ఆస్పత్రులకు చెందిన వైద్యులతో పాటు మరెంతో మంది ఢిల్లీ డాక్టర్లు హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తుండటం విశేషం. కాగా ఇంటర్నెట్‌లో ఆ డాక్టర్లకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీలో రైతుల నిరసన ఆరో రోజుకు చేరింది. కాగా, వారు ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. కానీ వారిని ఢిల్లీ వెళ్లనీయకుండా వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో ఎంతోమంది రైతులు గాయపడ్డారు. అంతేకాక రాత్రి, పగలు తేడా లేకుండా నిద్ర మానుకుని నిరసన చేస్తుండటంతో వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. దాంతో ఢిల్లీకి చెందిన వైద్యులు మెడికల్స్ క్యాంప్స్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ.. ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రొటెస్ట్ జరుగుతున్న 5 సిటీల్లోనూ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్ తెలిపాడు. రైతులకు తమ సంఘీభావం తెలియజేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా డాక్టర్లు చేస్తున్న సాయానికి నెటిజన్లు అభినందిస్తున్నారు. ‘మానవత్వం ఇంకా బతికే ఉంది. గ్రేట్ వర్క్ గో హెడ్ డాక్టర్స్, మీరు చేస్తున్న ఈ సేవలు ఎంతో అభనందనీయం.. డాక్టర్లందరికీ అభినందనలు’ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story