డ్రాఫ్టు విడుద‌లలో జాప్యం.. రాజ‌కీయ ఒత్తిడే కార‌ణ‌మా..

by Shyam |
Warangal
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థలో డివిజ‌న్ల విభ‌జన‌ ముసాయిదా (డ్రాఫ్టు) విడుద‌ల‌లో తీవ్ర జాప్యం జ‌రుగుతోంది. నగర పరిధిలో 66 డివిజన్ల విభజనకు సంబంధించిన డ్రాఫ్టును ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు.. సాయంత్రం వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. డ్రాఫ్టు తయారు అయినా విడుదల చేయకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిడితోనే అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

స‌మ‌స్యలు లేకుండా..

2016లో జ‌రిగి డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న‌లో ప‌లు స‌మ‌స్యలు ఉత్పన్నం కావ‌డంతో కొంద‌రు కోర్టుల‌ను ఆశ్రయించారు. అలాంటి స‌మ‌స్యలు మళ్లీ పున‌రావృతం కాకుండా ఉండాల‌ని అధికారులు పోలింగ్ బూతుల వారీగా ఈసారి పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టారు. ప‌ట్టణ ప్రణాళిక అధికారులు ప‌ది రోజుల పాటు గ్రేట‌ర్‌లో విస్తృతంగా ప‌ర్యటించి 66 డివిజ‌న్లకు ఒక రూపం తీసుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం వ‌ర‌కు డ్రాఫ్టు సిద్ధం చేశారు. కానీ విడుద‌ల చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వారి పలుకుబడే అడ్డుకుంటుందా..?

రాజ‌కీయ ఒత్తిడి కార‌ణంగానే డ్రాఫ్టు తుది రూపం దాల్చడంలేద‌న్న ఆరోప‌ణలు వినిపిస్తున్నాయి. వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాలక సంస్థలో 42 విలీన గ్రామాలు ఉన్నాయి. ఇందులో 30 గ్రామాలు వ‌ర్దన్నపేట నియోజక‌వ‌ర్గం, 10 గ్రామాలు ప‌రకాల నియోజ‌క‌వ‌ర్గం, మ‌రో రెండు గ్రామాలు స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందినవి. వ‌రంగ‌ల్ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లోని అన్ని ప్రాంతాలు గ్రేట‌ర్‌లో భాగ‌స్వామ్యంగా ఉన్నాయి. అయితే ఎవ‌రికి వారు త‌మ ఆదిప‌త్యాన్ని చూపేందుకు అధికారుల‌పై ఒత్తిడి తెస్తున్నట్లు వినికిడి. ప‌లుకుబ‌డి క‌లిగిన కొంద‌రు కార్పొరేట‌ర్లు త‌మ డివిజ‌న్ ప‌రిధి మార‌కుండా చూస్తుండ‌గా, మ‌రికొంద‌రు వారికి ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల‌ను త‌మ డివిజ‌న్‌లో క‌లపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story