ఆలయాల నిర్వహణ ఘోరం.. దేవుడికే భారం

by Sridhar Babu |   ( Updated:2021-03-24 11:01:16.0  )
temples
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా జరగాలని, ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది, కానీ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో చిత్తశుద్ధి కొరవడింది. దీంతో ఒకే అధికారికి రెండు, మూడు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారు. యాదాద్రి దేవాలయ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న రెవెన్యూ శాఖ అధికారి గీతారెడ్డి పదవీకాలం పూర్తయినా తిరిగి నియమించాల్సి వచ్చింది. ఇలాంటి అధికారులు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు.

రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో ఈవోలు వారి హోదా కంటే పెద్ద బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లుగా ఉంటున్న అధికారులు జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో పాటు అదనంగా మరికొన్ని ఆలయాలకు ఈవోలుగా ఇన్​చార్జి (ఫుల్ అడిషనల్ చార్జి) రూపంలో బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుండడంతో రోజువారీ అడ్మినిస్ట్రేషన్ విధులపై కేంద్రీకరించలేకపోతున్నారు.

అదనపు బాధ్యతలతో ఒత్తిడి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కొండగట్టు ఆలయానికి కూడా ఈవోగా పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ వరంగల్‌లోని భద్రకాళీ ఆలయానికి ఈవోగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం రీజినల్ జాయింట్ కమిషనర్ వేములవాడ ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు.

రెండు జిల్లాల్లో ఉద్యోగ నిర్వహణ..

అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కాళేశ్వరం ఆలయానికి కార్యనిర్వహణాధికారి విధులు నిర్వర్తించాల్సి ఉండగా గ్రేడ్-2 ఈవో పని చేస్తున్నారు. మేడారం సమక్క సారలమ్మ గద్దెలకు డిప్యూటీ కమిషనర్ స్థాయి ఈవో ఉండాల్సి ఉన్నా గ్రేడ్-1 ఈవోనే చూసుకుంటున్నారు. బాసర ఆలయానికి సైతం డీసీ హోదాలో ఉండే అధికారి ఈవో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి చూస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి గ్రేడ్-1 స్థాయి అధికారి ఈవోగా ఉండాలనే నిబంధన ఉన్నా గ్రేడ్-2 స్థాయిలోని అధికారి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పైగా, అతనే ఖమ్మం జిల్లాలో పలు ఆలయాలకు కూడా ఈవోగా వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాల్లో పనిచేయడం అధికారులకు కత్తి మీద సాములా తయారైంది.

దేవాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ కొన్ని నెలల క్రితం పదవీ విరమణ పొందడంతో ప్రభుత్వం ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయి డీసీ నియామకం జరగలేదు. జోనల్ స్థాయిలోనూ అదనపు బాధ్యతలను అప్పగించక తప్పడంలేదు. కొన్నేళ్లుగా పదోన్నతులను చేపట్టడంలో జరిగిన జాప్యంతో ఖాళీ పోస్టులు గుర్తించడం, భర్తీ చేయడం ఇబ్బందిగా మారింది.

సీఎం జోక్యం చేసుకున్నా..

రాష్ట్రావిర్భావం తర్వాత ఆలయాలు అభివృద్ధి బాటలో నిలుస్తాయని అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు భావించారు. కానీ యాదాద్రి మినహా మరే ప్రధాన ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర పుణ్యక్షేత్రాలు ఆ కోవలోకి చెందినవే. ముఖ్యమంత్రి కేసీఆర్ పదోన్నతుల ప్రక్రియను డిసెంబరు చివరికల్లా పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శికి టాస్క్ అప్పగించినా, పలు కారణాలతో ఇప్పటికీ పూర్తికాలేదు. ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలిసిన తర్వాతనే భర్తీ చేయడానికి వీలుగా నోటిఫికేషన్‌లను జారీ చేయడం సాధ్యమవుతుందనేది సీఎం అభిప్రాయం. కానీ మూడు నెలలైనా ఆ విషయం కొలిక్కి రాలేదు. కాగా, శాఖలవారీగానే ఎప్పటికప్పుడు పదోన్నతులు డీపీసీల ద్వారా జరిగిపోవాల్సి ఉన్నా అధికారులు చొరవ తీసుకోకపోవడంతో సీఎం స్థాయిలో డెడ్‌‌లైన్ విధించాల్సి వస్తోంది. అయినా పనులు జరగడంలేదన్నది పైపరిణామాలు చూస్తే అర్థమవుతోంది.

Advertisement

Next Story