చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడు.. షాక్‌లో గ్రామస్తులు, అధికారులు

by Sumithra |   ( Updated:2021-10-10 09:25:51.0  )
చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడు.. షాక్‌లో గ్రామస్తులు, అధికారులు
X

దిశ, ఆర్మూర్ : చనిపోయిన వ్యక్తి బతికొచ్చాడు! ఔను, ఈ విషయం తెలిసి గ్రామస్తులు అవాక్కయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలం ముల్లంగి (బి) ఇటీవల మహిళ హత్య, దహనం ఘటనతో వార్తల్లోకెక్కింది. మళ్లీ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చిన ఘటనతో ముల్లంగి (బి) పేరు మరోమారు మార్మోగుతున్నది.

అసలేం జరిగింది..?

చనిపోయిన వ్యక్తి తిరిగి రావడమేంటి..? అలా ఎలా సాధ్యమవుతుంది.. అంటే, మీరు అనుకున్నట్లు ముమ్మాటికీ అది అసాధ్యం. కచ్చితంగా అలా జరిగి ఉండదు. మరి ఏం జరిగిందనేగా మీ ప్రశ్న? అయితే గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జీపీ సిబ్బంది ఏమంటున్నారో చదవండి.. గ్రామస్తులంతా చనిపోయాడనుకున్న వ్యక్తి పేరు గంగారాం. నిర్మల్ జిల్లాలోని భైంసా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఈ వృద్ధుడు ముల్లంగి (బి)లో పడమటి గంగారాంగా సుపరిచితుడు. నా అన్నవాళ్లెవరూలేని ఒంటరి. నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమాలయం (పలుగ్గుట్ట శివాలయం)తో పాటు మాక్లూర్ మండలంలోనూ భిక్షాటన చేస్తూ బతుకీడుస్తున్నాడు. ముల్లంగి (బి) గ్రామ పంచాయతీ కార్యాలయంలో వృద్ధాప్య పింఛన్ దారుగా గంగారాం పేరు నమోదై ఉంది. దీంతో గ్రామంలో ప్రతినెలా పింఛన్ తీసుకుంటూ గ్రామస్తులు పెట్టింది తింటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇదిలాఉండగా, మూడు నెలల కిందట ముల్లంగి (బి) గ్రామంలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో పడమటి గంగారాం తీవ్రంగా గాయపడ్డాడు. అనాథ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. విషయం తెలియడంతో స్థానిక సర్పంచ్ భర్త శ్యామ్ రావు 108 అంబులెన్స్ సహాయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రమైన గాయాలున్న వృద్ధున్ని చూసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, కుటుంబ సభ్యులను పిలిపించాలని సూచించారు. అనాథ కావడంతో కొన్నేళ్లుగా తమ ఊరిలో, పరిసర గ్రామాల్లో యాచిస్తూ పొట్ట నింపుకుంటున్నాడని సర్పంచ్ వైద్యులకు చెప్పి ఇంటికి వచ్చేశారు.

సీన్ కట్ చేస్తే..

దాదాపు మూడు నెలల తర్వాత ఈ నెల 8వ తేదీ శుక్రవారం ముల్లంగి (బి) జీపీ వద్దకు ఓ ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి నడువడానికి కూడా సత్తువ లేని ఓ వృద్ధుడు దిగాడు. నేరుగా జీపీ సెక్రెటరీ రాధిక వద్దకు వెళ్లాడు. తన పేరు గంగారాం అని, మూడు నెలలుగా తాను పింఛన్ తీసుకోలేదని.. ఇప్పుడే ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. ఆ పేరు వినగానే స్థానిక అధికారి పరిస్థితి చచ్చి బతికినంత పనైంది. పోలీసులు ఈ కేసు విషయంలో కాలికి బలపం కట్టుకొని జీపీ చుట్టూ తిరిగిన తీరు జ్ఞప్తికి తెచ్చుకున్న సెక్రెటరీ జీపీ సిబ్బందిని అలర్ట్ చేశారు. కనబడకుండా ‘పోయిన’ వ్యక్తి స్థితి వాళ్ల రికార్డుల్లో ఎలా ఉందోనని ఠంచను పడిపోయిన ఆమె బతికే ఉన్నాడన్న సమాచారం చేరవేయాలని సిబ్బందిని పురమాయించారు. స్థానిక వీఆర్ఏ శనివారం ఠాణాకెళ్లడంతో పోలీసులకు మళ్లీ కొత్త సమస్య వచ్చి పడినట్టు అయ్యింది.

యాక్సిడెంట్‌కు, రీ ఎంట్రీకి మధ్య ఏం జరిగింది..?

ముల్లంగిలో ఆ రోజు గుర్తు తెలియని వాహనం కారణంగా యాక్సిడెంట్ జరిగింది కావున స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు ఘటనా స్థలిని పరిశీలించారు. వృద్ధున్ని కొట్టేసి ఆపకుండా వెళ్లిపోయిన వాహనం వివరాలు, ప్రమాదం జరిగిన తీరును జీపీలోని సీసీ పుటేజీల ఆధారంగా సేకరించారు. గాయపడిన వ్యక్తి కోసం దవాఖానకు వెళ్లిన పోలీసులకు అతని ఆచూకీ లభించలేదు. వార్డులన్నీ వెతికామని, సదరు వృద్ధుడు అసలు ఆస్పత్రిలోనే లేడని పోలీసు సిబ్బంది తమ పైఅధికారికి చెప్పారని తెలిసింది. ఈ కేసు విషయమై మూడు, నాలుగు సార్లు ముల్లంగి గ్రామాన్ని సందర్శించి కేసు పెట్టిన పోలీసులు తదనంతర దర్యాప్తు చేపట్టారు. మరోవైపు గ్రామంలో గంగారాం చనిపోయాడట అని అంతా చర్చించుకుంటుండడాన్ని చూసి జీపీ అధికారులూ తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.

పోలీసులు వెతికినా దొరకని వ్యక్తి ఇక లేడన్న విషయం గ్రామంలో ఓ రేంజ్‌లో షికారు కొట్టింది. ఆ పుకార్లనే అధికారులు బలంగా నమ్మడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే పింఛన్ స్కీమ్ నుంచి గంగారాం పేరు తొలగించేందుకు విఫలయత్నం జరిగినట్లు సమాచారం. గంగారాంనకు సంబంధించి ఆధార్ కార్డు అధికారులకు దొరక్కపోవడమే మంచిదైంది. అతని పేరు రికార్డుల్లో సజీవంగా ఉంది! ఆ అభాగ్యుడి మరణ ధృవపత్రం అడిగేవారే లేకపోవడం నయమైంది. అధికారులు సహా అందరూ ముగించేద్దాం అనుకునేలోపే ముసలి ప్రాణం నేనున్నానంటూ నడిచొచ్చింది. అడ్రస్ లేని మనిషి అడ్రస్ లేకుండానే పోయాడని చెమ్మగిళ్లిన కళ్లు ఇప్పుడు ఆనంద భాష్పాలు రాల్చుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed