12ఏండ్ల పైబడిన పిల్లలపై ట్రయల్స్

by Shamantha N |
12ఏండ్ల పైబడిన పిల్లలపై ట్రయల్స్
X

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ ‘క్లినికల్ ట్రయల్స్’ పద్ధతిలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే, 12ఏండ్ల పైబడిన పిల్లలపై కూడా క్లినికల్ ట్రయల్స్ జరపడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. చివరి రౌండ్‌లో 12ఏండ్ల పైబడిన పిల్లలపై భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా అది సురక్షితమని తేలింది. ప్రస్తుతం ఆ సంస్థ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరపడానికి సన్నద్ధమవుతున్నది.

ఇప్పటివరకైతే 18ఏండ్ల పైబడిన వారికి మాత్రమే కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతించింది. కానీ, 12ఏండ్ల పైబడిన పిల్లలపై జరిపిన ట్రయల్స్ డేటా మొత్తం అందజేస్తే భవిష్యత్తులో పిల్లలకు కూడా టీకా ఇవ్వానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది. మూడో దశ ట్రయల్స్ పూర్తికాని కొవాగ్జిన్‌కు డీజీసీఐ అనుమతులు ఇవ్వడంపై విమర్శలు చెలరేగడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌కు ఇచ్చిన అనుమతులు వేర్వేరు అని తెలిపారు. కొవాగ్జిన్‌ను క్లినికల్ ట్రయల్స్ తరహాలో అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతులు ఇచ్చారని తెలిపారు. కొవాగ్జిన్ టీకా పొందిన ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేయడంతో నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed