అప్పులు తీసుకున్నారు.. అస్సలే కట్టడంలేదు!

by  |   ( Updated:2020-11-18 13:29:42.0  )
అప్పులు తీసుకున్నారు.. అస్సలే కట్టడంలేదు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకుది పెద్ద చరిత్ర. ప్రస్తుత స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ​రాజకీయ ఓనమాలు దిద్దింది ఎన్ డీసీసీబీ నుంచే. చాలా మంది ఇందూరు నేతలకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ బ్యాంకే. ఇక్కడ నుంచే సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు షురూ అయ్యాయి. అలాంటి బ్యాంకు ప్రస్తుతం అప్పుల ఊబిలో నుంచి బయటకు రావడానికి ఆపసోపాలు పడుతోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ కొందరు పెద్దలు తీసుకున్న రుణాలు గుదిబండగా తయారయ్యాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న ఎన్​డీసీసీబీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు లోన్లు తీసుకున్న వారు ప్రజాప్రతినిధులు కావడమే ప్రధాన కారణం. గతంలో పాలకవర్గంలో పదవులు అనుభవించిన వారు ప్రస్తుతం పదవులు వెలగబెడుతున్న వారు.. అందులో అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది కావడంతో అప్పుల వసూళ్లకు తిప్పలు తప్పడం లేదు.

పెద్దల వద్ద పేరుకుపోయిన రుణాలు:

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉమ్మడి జిల్లా పరిధిలోని 63 బ్రాంచిల ద్వారా రూ. 905 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. అందులో రూ. 200 కోట్ల రుణాలు కొన్నేళ్లుగా వ సూలు కావడం లేదు. 2019లో 38.10 శాతం, 2020 లో ఇప్పటి వరకు 29 శాతం దీర్ఘకాలిక రుణాలను మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ. 50 కోట్ల రుణాలు 1,251 మంది ప్రజాప్రతినిధులు, డీసీసీబీ డై రెక్టర్లు, సహకార సంఘాల ప్రతినిధులు వద్ద పేరుకుపోయాయి. అందులో అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని, ముఖ్యంగా పలువురు ప్రజాప్రతినిధుల బినామీల పేరిట రుణాలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

చేతులెత్తేసిన పాలకవర్గం.!

బ్యాంకు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు ఉండగా అధికార పార్టీ నేతల సిఫారసు మేరకు రుణాలిచ్చిన పాలక వర్గం వసూలు చేయలేక చేతులెత్తేసింది. గడిచిన పాలక వర్గం హయాంలో దీర్ఘకాలిక రుణాలు రూ. 200 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. రు ణాల మంజూరులో పాలక వర్గం చెప్పినట్టు వినలేదని బ్యాంకు అధికారులను మార్చిన అప్రతిష్ట రాష్ట్రంలో ఎన్​డీసీసీబీ మూటగట్టుకుంది. మొండి బకాయిలు రూ. 50 కోట్లు ఉండగా, ఎ క్కువగా అధికార పార్టీ నేతలుండడంతో సిబ్బందికి తలనొప్పిగా మారింది. అయితే రుణాల సమయంలో పదింతల ఆస్తులు గ్యారంటీ పెట్టారని, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అయితే ఇప్పటికే వాటిని బహిరంగంగా వేలం వేసేవని ఆరోపణలున్నాయి.

కానీ, ఎక్కువ మంది డిఫాల్టర్లలో అధికార పార్టీ నేతలు ఉండడంతో బ్యాంకు అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారు. గత నెలలో జరిగిన పాలక వర్గం మహాజన సభలో దీర్ఘకాలిక రుణాల వసూళ్లకు మొగ్గు చూపింది. అందులో భాగంగా ఇందూరు జిల్లాలో 1,251 మంది మొండి బకాయి దారులకు లీగల్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. బ్యాంకు అధికారుల నోటీసులకు స్పందించి ఎంత మంది రుణాలు తిరిగి చెల్లిస్తారో, లేక బ్యాంకు అధికారులు, పాలకవర్గం వారు గ్యారంటీ ఆస్తులను వేలం వేస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed