53.5 కోట్ల ఎఫ్‌బీ యూజర్ల డేటా లీక్

by Anukaran |   ( Updated:2021-04-04 02:21:29.0  )
53.5 కోట్ల ఎఫ్‌బీ యూజర్ల డేటా లీక్
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో యూజర్ల డేటాకు భద్రత లేకుండా పోతోంది. ఇటీవలే పేమెంట్ యాప్ ‘మొబిక్విక్’‌కు చెందిన 35 లక్షల మంది వినియోగదారుల సమస్త సమాచారం లీకైన విషయం తెలిసిందే. తాజాగా 100కి పైగా దేశాల నుంచి దాదాపు 533 మిలియన్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని తెలుస్తుండగా.. ‘లో లెవల్ హ్యాకింగ్ ఫోరమ్స్‌’లో ఆ వివరాలన్నీ ఉచితంగా పోస్ట్ చేశారని మల్టిపుల్ సోర్సెస్ ద్వారా వెల్లడైంది.

ఫేస్‌‌బుక్ నుంచి లీకైన యూజర్ల డేటా చాలా పాతదే అని తెలుస్తున్నా, లీకైన సమాచారం మాత్రం కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి ఈ డేటా సేకరించినట్టు బిజినెస్ ఇన్‌సైడర్ కథనం పబ్లిష్ చేసింది. ఆ కథనం ప్రకారం 106 దేశాల్లో ఫేస్‌బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అయితే ఫేస్‌బుక్ డేటాకు సంబంధించిన సమస్య చాలా ఏళ్లుగా ఉండగా, ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఫీచర్‌ను 2018లోనే డిసేబుల్ చేసింది ఫేస్‌బుక్. కాగా 2019లో తొలిసారి లీకైన ఈ డేటాబేస్‌ను హ్యాకర్లు 20 డాలర్లకు టెలిగ్రామ్‌కు అమ్మేసినట్లు సమాచారం. కానీ జూన్ 2020‌లో, ఆపై జనవరి 2021‌లో అదే డేటాబేస్ మళ్ళీ లీక్ అయింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అలోన్ గాల్.. ఈ లీకైన డేటాబేస్ వివరాలను తన ట్విట్టర్ పోస్ట్‌లో తాజాగా మరోసారి పంచుకున్నాడు. ఆ డేటాబేస్ జనవరి నుంచి హ్యాకర్ సర్కిళ్లలో చెలామణి అవుతున్నట్లు ఆయన తెలిపాడు. అంతేకాదు ఎవరైనా ఫేస్‌బుక్ ఖాతా కలిగి ఉంటే, ఆ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 5.5 లక్షల మంది, ఆస్ట్రేలియా- 1.2 మిలియన్లు, బంగ్లాదేశ్ – 3.8 మిలియన్లు, బ్రెజిల్ – 8 మిలియన్లు, భారతదేశం – 6.1 మిలియన్ల మంది వినియోగదారుల వివరాలను అనేక ఫోరమ్‌లలో ఉచితంగా ఉంచినట్లు సమాచారం.

కేంబ్రిడ్జ్ అనలిటికా అనే రాజకీయ సంస్థ తమకు తెలియకుండానే లేదా అనుమతి లేకుండా 87 మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019 డిసెంబర్‌లో ఉక్రెయినియన్ సెక్యూరిటీ రీసెర్చర్ కూడా 26.7 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, యూజర్ ఐడీలు లీక్ అయినట్టు గుర్తించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే లీక్ అయిన డేటా చాలా పాతదని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్‌బుక్ క్లారిటీ ఇచ్చింది.

డేటా ఉల్లంఘన కేసుల్లో యూజర్ డేటా రక్షణ, పీనల్ యాక్షన్ కోసం భారతదేశానికి బలమైన విధానం లేదు. 2019 నుంచి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు లోక్‌సభలోనే పెండింగ్‌లో ఉంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ బిల్లుపై తన నివేదికను మార్చి నాటికి సమర్పించాల్సి ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశం మొదటి వారం వరకు పొడిగింపు కోరింది.

Advertisement

Next Story

Most Viewed